హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ) : కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్)ను రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్త ‘జనజాగరణ యాత్ర’ను తలపెట్టినట్టు తెలంగాణ సీపీఎస్ఈయూ అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ తెలిపారు. శనివారం నుంచి ఈ యాత్ర ప్రారంభంకానున్నదని చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి సన్నిధి నుంచి యాత్ర ప్రారంభమవుతుందని ఆగస్టు 18 వరకు కొనగుతుందని పేర్కొన్నారు. యాత్రలో భాగంగా ఎమ్మెల్యేలను కలిసి వినతిపత్రాలు సమర్పిస్తామని తెలిపారు.‘నాడు మా ఓట్లతో గెలిచారు.. నేడు మా భద్రత కోసం పాత పింఛన్‌ను అమలుచేయండి’ అన్న పిలుపుతో ప్రజాప్రతినిధులను కలుస్తామని పేర్కొన్నారు.
యాత్ర ద్వారా ఆఫీస్ సబార్డినేట్ నుంచి గ్రూప్-1 వరకు అన్ని శాఖల ఉద్యోగులను సంఘటితం చేస్తామని పేర్కొన్నారు. ఈ యాత్రకు టీఎన్జీవో, టీజీవో, పీఆర్టీయూ టీఎస్, ఎస్టీయూ టీఎస్, యూటీఎఫ్, టీఆర్టీఎఫ్, తపస్, ఎస్జీటీయూ, టీపీఆర్టీయూ తదితర సంఘాలు మద్దతు తెలిపాయని పేర్కొన్నారు. టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి సంఘీభావం ప్రకటించారని, తాను యాత్రలో పాల్గొంటానని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ యాత్ర ముగింపుగా ఆగస్టు 23న లక్ష మంది ఉద్యోగులతో ‘చలో హైదరాబాద్’ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సంఘం కోశాధికారి నరేశ్‌గౌడ్, నరేందర్‌రావు, పవన్ పాల్గొన్నారు.