Telangana | తెలంగాణ శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది. శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కులగణన నివేదిక, స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి అంశాలపై చర్చించారు. ముందుగా కులగణన సర్వేను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసన మండలిలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎప్పటిలాగే అబద్ధాలు చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం అసలు సమగ్ర కుటుంబ సర్వేను అనౌన్స్ చేయలేదంటూ ప్రకటించారు.
భట్టి విక్రమార్క అబద్ధాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కవిత, బండ ప్రకాశ్ తదితరులు మండిపడ్డారు. రెండు రోజుల కిందట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన కులగణన వివరాలనే ఇప్పుడు శాసనమండలిలో భట్టి విక్రమార్క చెప్పి మమ అనిపించారని కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఈ కులగణన వివరాలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం లేదని కాంగ్రెస్ పార్టీని నిలదీశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిలదీతల నడుమ శాసనమండలిని నిరవధికంగా వాయిదా వేశారు.