దుబ్బాక, అక్టోబర్ 3: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో గురువారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పర్యటనను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహం చూపించారు. వారిని బీఆర్ఎస్ శ్రేణులు నిలువరించడంతో ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలోని శివాజీ చౌక్ వద్దకు ఎమ్మెల్యే కాన్వాయ్‌లో వస్తుండగా స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇంతలోనే కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే వాహనంపై కోడిగుడ్లు విసిరేందుకు ప్రయత్నించగా అవి పక్కన రోడ్డుపై పడ్డాయి. కాంగ్రెస్ నాయకుల కవ్వింపు చర్యలపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసుల జోక్యంతో రెండు పార్టీల వారు అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ ఘటనపై దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి స్పందించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి దొంగే .. దొంగ అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టు వ్యవహరిస్తున్నదని, అధికారంలో ఉన్నామనే సోయి తెచ్చుకుని బాధ్యతాయుతమైన పాలన అందించాలని హితవు పలికారు. దిగజారుడు రాజకీయాలు, ప్రతిపక్షాలను వేధించే రాజకీయాలు మానుకోవాలని కొత్త ప్రభాకర్‌రెడ్డి సూచించారు.