హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : ‘అక్రమ కేసులతో గాంధీల కుటుంబాన్ని లొంగదీసుకోవాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్‌గాంధీల పేర్లు నేషనల్ హెరాల్డ్ కేసు చార్జీషీట్లో చేర్చారు’ అని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, సీనియర్ నేత హనుమంతరావు ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసు చార్జీషీట్లో సోనియా, రాహుల్ పేర్లు చేర్చడాన్ని నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు బుధవారం బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ‘సత్యమేవ జయతే’ నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీ పత్రికకు డబ్బులు ఇస్తే అది మనీలాండరింగ్ కేసు ఎలా అవుతుందని ప్రశ్నించారు. అక్రమ కేసులను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్‌కుమార్‌యాదవ్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, మాజీ ఎమ్మెల్యే శ్రీశైలంయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
నేటి ధర్నాకు భారీగా తరలిరావాలి..
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ వైఖరిని నిరసిస్తూ గురువారం ఉదయం 10 గంటలకు ఈడీ కార్యాలయం ఎదుట ధర్నాకు టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ధర్నాకు పార్టీ నాయకులు, శ్రేణులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు.