హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): అనుకొన్నదే నిజమైంది. కాంగ్రెస్ కుట్ర బట్టబయలైంది. తమకు అధికారమిస్తే కల్పతరువు లాంటి హైదరాబాద్ నగరాన్ని ఏం చేయబోతున్నారో.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందే బయటపెట్టేశాడు. అట్టర్ ఫ్ల్లాప్ అయిన అమరావతి మాడల్‌ను హైదరాబాద్‌లో అమలు చేస్తానని ప్రకటించారు. 6 గ్యారెంటీలంటూ ఊదరగొడుతున్న హామీల అమలుకు డబ్బు లేదని స్వయంగా తేల్చేశాడు. ఆ హామీలు అమలుచేయటానికి హైదరాబాద్ చుట్టుపక్కల, రాచకొండ ప్రాంతంలో 50 వేల ఎకరాల భూమిని రైతుల నుంచి లాక్కొని అంతర్జాతీయ కంపెనీలకు అమ్మేసి డబ్బు సంపాదిస్తామని స్పష్టంగా చెప్పేశాడు. కర్ణాటకలో డబ్బాలో ఓట్లేయించుకొన్న తర్వాత ప్రజలకు దోఖా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో ఎన్నికలకు ముందే బయటపడిపోయింది. అంతేకాదు.. 50 వేల తాను నిర్మిస్తానంటున్న నగరానికి హైదరాబాద్‌లోని గల్లీగల్లీలో చిన్నాచితకా వ్యాపారాలు చేసుకొంటున్నవారందరినీ మూటగట్టి పట్టుకుపోతాడట. అక్కడ 24 గంటలూ వ్యాపారాలు చేయిస్తాడట.
కాంగ్రెస్ అధ్యక్షుడి పదవిలో ఉన్నా.. తన గురువు ఆలోచనా విధానాల్లోంచి, కనుసన్నల్లోంచి ఇంకా బయటకు రాలేదని రేవంత్‌రెడ్డి నిరూపించుకొన్నారు. ఇప్పటికే టీడీపీకి కాంగ్రెస్‌ను తాకట్టు పెట్టిన ఆయన, మరో అడుగు ముందుకేశాడు. ఇండియా టుడే నిర్వహించిన డిబేట్లో బుధవారం మాట్లాడిన రేవంత్.. తనలోని అసలు మనిషిని బయటపెట్టుకొన్నారు. ఏపీలో గత టీడీపీ పాలనా విధానాన్ని తెలంగాణలో అమలు చేస్తామని ప్రకటించారు. ఆయన గురువు అరచేతిలో స్వర్గం చూపించి ఆవిష్కరించిన అమరావతిలా హైదరాబాద్ పక్కన భారీ నగరం నిర్మిస్తానని తెలిపారు. తమకు అమరావతే ఆదర్శమని తేల్చి చెప్పారు. ‘తెలంగాణ ఎన్నికల్లో మీరు ప్రజలకు ఆరు గ్యారెంటీలు ఇచ్చారు.
కర్ణాటకలో కూడా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 5 గ్యారెంటీలు ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలుకు డబ్బు లేదని చేతులెత్తేసింది. మరి ఇక్కడ ఎలా అమలుచేస్తారు?’ అని చర్చలో వ్యాఖ్యాత రేవంత్‌ను ప్రశ్నించారు. ‘మా 6 గ్యారెంటీల అమలుకు ప్రభుత్వం వద్ద డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు. మూసీ పరీవాహక ప్రాంతంలో భారీగా భూములు సేకరిస్తాం. విదేశాల నుంచి కంపెనీలను తీసుకొస్తాం. ఈ భూములను ఆ కంపెనీలకు ఇచ్చి డబ్బు తీసుకొంటాం. ఆ డబ్బుతో గ్యారెంటీలు అమలుచేస్తాం. ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి నిర్మాణానికి ల్యాండ్‌పూలింగ్ చేశారు. ఇక్కడా అలాగే చేస్తాం. రాచకొండ ప్రాంతంలో 50 వేల ఎకరాల భూమి సేకరించటం కూడా చాలా తేలిక. ఆ భూముల్లో భారీ నగరాన్ని నిర్మిస్తాం. హైదరాబాద్‌లోని వీధి వ్యాపారులందరినీ అక్కడికి తరలిస్తాం. అక్కడ 24 గంటలూ వ్యాపారాలు చేసుకొనేందుకు వీలు కల్పిస్తాం’ అని రేవంత్ చెప్పుకొచ్చారు.
ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం భూసేకరణ మొదలుపెట్టింది. అమరావతి నగర నిర్మాణానికి చేపట్టిన ల్యాండ్‌పూలింగ్‌పై మొదటి నుంచీ లెక్కకు మిక్కిలి ఆరోపణలు, వివాదాలు ఏర్పడ్డాయి. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కేంద్ర కమిటీ సూచనలను తుంగలో తొక్కి రేవంత్ గురువు చేపట్టిన లాండ్‌పూలింగ్‌లో చిన్న రైతులు చితికిపోయారు. భూసేకరణకు ముందే ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. దీంతో ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ నగర నిర్మాణాన్నే పక్కనబెట్టేసింది. అప్పటికే ఆ భూముల్లో అనేక చోట్ల నిర్మాణాలు మొదలుపెట్టారు. దీంతో అవి అటు వ్యవసాయానికి పనికి రాకుండా పోయాయి.
ఇటు రాజధాని అటకెక్కింది. దీంతో రైతులు మూడేండ్లుగా తమకు న్యాయం చేయాలని పోరాడుతూనే ఉన్నారు. నిజానికి అమరావతి ప్రాంతంలోని భూములన్నీ వ్యవసాయ భూములే. అక్కడ ఏటా మూడు పంటలు పండుతాయి. ఆ భూములకు ఎకరా ధర ఎంత ఎక్కువైనా లక్షల్లోనే ఉన్నది. మరి హైదరాబాద్ పరిస్థితి? ఇక్కడ ఎకరం రూ.100 కోట్లు పలికి ఇటీవలే రికార్డు నెలకొల్పింది. ఇలాంటి చోట 50 వేల ఎకరాల భూమిని సేకరించటం సాధ్యమేనా? ఒకవేళ సేకరించినా రైతులకు ఎకరానికి ఎంత ఇస్తారు? రేవంత్‌రెడ్డి విధానంలో చెప్పాలంటే ఏ రూ.5 లక్షలో.. రూ.6 లక్షలో ఇచ్చి భూములు లాక్కొంటారు. అంటే ఓట్లు డబ్బాలో పడకముందే రైతులను ముంచుతామని రేవంత్‌రెడ్డి చెప్పేశారు. ఆయన చెప్పిన రాచకొండ ప్రాంతంలో కూడా ఎకరం భూమి కోట్లలోనే ఉన్నది. అమరావతి భూ సేకరణపై ఇప్పటికీ కోర్టుల్లో విచారణ జరుగుతున్నది. అట్టర్ ఫ్లాప్ అయిన ఓ ప్రాజెక్టును ఆదర్శంగా తీసుకొని తెలంగాణపై రుద్దుతానని రేవంత్‌రెడ్డి అంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్‌లో ఏ కాలనీల్లో చూసినా, ప్రధాన రోడ్లపై చూసినా చిరు వ్యాపారులు కనిపిస్తారు. వారి వ్యాపారం ఏ రోజుకు ఆ రోజే అన్నట్టుగా ఉంటుంది. ఎంత భారీగా వ్యాపారం చేసినా రోజూ రూ.1000-2000 కంటే ఆదాయం మించదు. తెలంగాణను అభివృద్ధి చేయటానికి కాంగ్రెస్ వద్ద ఉన్న ప్లానేంటని రేవంత్‌ను అడిగితే, ఇదిగో.. ఈ వీధి వ్యాపారులతో ఎక్కడో నగరానికి దూరంగా బిజినెస్ చేయిస్తానని చెప్పాడు. నిజానికి ఈ వీధి వ్యాపారులు తాము నివసించే ప్రాంతం నుంచి రెండుమూడు చదరపు కిలోమీటర్ల పరిధిలోనే వ్యాపారాలు చేస్తుంటారు. ఇప్పుడు రేవంత్‌కు ఓట్లేస్తే.. వారందరినీ తీసుకెళ్లి రాచకొండలో తాను నిర్మించే అమరావతి నగరంలో 24 గంటలూ వ్యాపారం చేయిస్తాడట. ఆయన నగరం కట్టేదెప్పుడు? అక్కడ ప్రజలు చేరేదెప్పుడు? ఈ వీధి వ్యాపారులంతా బిజినెస్ చేసేదెప్పుడు? అని హైదరాబాదీలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో ఏ ప్లానూ లేకపోవటం వల్లనే రేవంత్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు.
నిజానికి హైదరాబాద్ నగరం ఏనాడో ఔటర్ రింగ్‌రోడ్డును తాకింది. అతి త్వరలో రీజినల్ రింగ్‌రోడ్డు వరకూ వెళ్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ నగరం విస్తరణ, అభివృద్ధి ఆగే అవకాశమే లేదు. మరి రేవంత్‌రెడ్డి కడతానంటున్న కొత్త నగరం ఎందుకోసమో ఆయనకే తెలియాలని మేధావులు అంటున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో ఇప్పటికే మూడు నగరాలు (కమిషనరేట్లు) న్నాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ప్రాంతాలుగా నగరం విస్తరిస్తున్నది. నగరం చుట్టూ రియల్ ఎస్టేట్, కంపెనీల విస్తరణ శరవేగంగా సాగుతున్నది. ఇప్పుడు కొత్తగా 50 వేల ఎకరాల్లో ప్రత్యేక నగరం నిర్మించటం ఎందుకని సామాన్యులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. నగరం పేరుతో భూ దందా చేయటానికి రేవంత్ పథకం వేశారా? అని అనుమానం వ్యక్తంచేస్తున్నారు.