హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పేరుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, చంద్రబాబు పాలనే నడుస్తున్నదని, తెలంగాణ సీఎంవోనే ప్రత్యామ్నాయ అధికార కేంద్రంగా మారిందని, కొద్దిమంది వ్యక్తులే పెత్తనం చెలాయిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అధిష్ఠానానికి ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌లో భాగంగా సంచలన ఆరోపణలు చేసినట్టు తెలిసింది. పార్టీ విధానాలు, మ్యానిఫెస్టో, శాసనసభాపక్ష నిర్ణయాల కంటే వ్యక్తిగత రాజకీయ ఎజెండాకే ప్రాధాన్యం దక్కుతున్నదని, తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు ‘అసలు కాంగ్రెస్-వలస కాంగ్రెస్’గా చీలిపోయిందని పేర్కొన్నట్టు సమాచారం. కాంగ్రెస్ అధిష్ఠానం చేపట్టిన ‘ఆపరేషన్ ఫీడ్‌బ్యాక్’లో తెలంగాణ ప్రభుత్వ పనితీరు, ముఖ్యమంత్రి నాయకత్వ శైలి, పార్టీ పరిస్థితిపై ఎమ్మెల్యేల నుంచి ఊహించని స్థాయిలో ప్రతికూల స్పందన వచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఏఐసీసీకి ఇచ్చిన గోప్య నివేదికల్లో పలువురు లిఖితపూర్వకంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్టు సమాచారం.
‘ఆపరేషన్ ఫీడ్‌బ్యాక్’లో భాగంగా ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను సేకరిస్తున్నారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఒకవేళ ప్రశ్నపత్రంలో (ఫీడ్‌బ్యాక్ ఫారం) నమోదు చేయలేని అంశాలు ఉంటే, వాటిని ప్రత్యేకంగా లిఖితపూర్వకంగా ఇవ్వవచ్చని వారు సూచించినట్టు సమాచారం. దీంతో పలువురు ఎమ్మెల్యేలు, డీసీసీలు ప్రభుత్వ పనితీరు, ముఖ్యమంత్రి నాయకత్వం, సీఎంవో వ్యవహారశైలి, అధికార కేంద్రీకరణ, నిధుల కేటాయింపు, పార్టీ-ప్రభుత్వం మధ్య సమన్వయ లోపాలు, అధికార యంత్రాంగం తీరు తదితర అంశాలపై ఫిర్యాదులు రాసి అందజేసినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఊహించని ఫిర్యాదులతో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ ఆశ్చర్యపోయారని, ఈ నెల 18 తర్వాత కూడా తాను అందుబాటులో ఉంటానని, ఫిర్యాదులకు సంబంధించి సమగ్ర వివరాలతో రావాలని ప్రజాప్రతినిధులకు, డీసీసీలకు సూచించినట్టు సమాచారం.
కొంతమంది ఎమ్మెల్యేలు తమ ఫీడ్‌బ్యాక్‌లో అత్యంత తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, రాష్ర్టాన్ని పరిపాలిస్తున్నది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని తీవ్ర ఆరోపణ చేసినట్టు తెలిసింది. నారా లోకేశ్ ఆంధ్రప్రదేశ్‌లో ఉండి సిగ్నల్ ఇస్తే, తెలంగాణ సీఎంవోలో యాక్షన్ జరిగిపోతున్నదని పలువురు ఎమ్మెల్యేలు ఆరోపించారట. తెలంగాణ ప్రయోజనాలు, కాంగ్రెస్ సిద్ధాంతాల కంటే ఏపీ రాజకీయ ఆలోచనలకే ప్రాధాన్యం లభిస్తున్నదని వారు ఆవేదన వ్యక్తంచేసినట్టు సమాచారం. చంద్రబాబు మీద కొట్లాడిన తాము.. మళ్లీ ఆయన పాలన కిందనే పని చేయాలంటే ఇబ్బందిగా ఉన్నదని అధిష్ఠానానికి గోడు వెల్లబోసుకున్నట్టు తెలిసింది. ఈ అంశాలు మౌఖిక ఫిర్యాదుగా గుర్తించాలా? లేదా లిఖితపూర్వకంగా రాసి ఇస్తారా? అని సచిన్ సావంత్ అడుగగా.. లిఖితపూర్వకంగా రాసిచ్చినట్టు తెలిసింది.
ప్రభుత్వ నిర్ణయాల్లో కాంగ్రెస్ పార్టీ తీర్మానాలు, ఎన్నికల హామీలు, ఎమ్మెల్యేల అభిప్రాయాల కంటే వ్యక్తిగత, రాజకీయ అభిప్రాయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయపడినట్టు సమాచారం. ప్రభుత్వం ఒక దిశలో, పార్టీ మరో దిశలో నడుస్తున్నదని తేల్చి చెప్పారట. అంతర్గత విభేదాలు తీవ్రస్థాయికి చేరుకొన్నాయని పలువురు ఎమ్మెల్యేలు పేర్కొన్నట్టు సమాచారం. సీనియర్ కాంగ్రెస్ నాయకులకు తగిన ప్రాధాన్యం లేకపోవడం, ఇటీవల పార్టీలో చేరిన నాయకులకే అధిక అవకాశాలు కల్పిస్తున్నారనే అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ‘అసలు కాంగ్రెస్ – వలస కాంగ్రెస్’ అనే రెండు శిబిరాలుగా పార్టీ విడిపోయిందని కొందరు తమ అభిప్రాయాల్లో నమోదు చేసినట్టు తెలిసింది.
ప్రభుత్వంలో అత్యంత కీలకమైన ఆర్థిక శాఖ పూర్తిగా ముఖ్యమంత్రి కార్యాలయం ఆధీనంలోనే నడుస్తున్నదని, మంత్రులకు కూడా స్వతంత్ర నిర్ణయాధికారం లేదని కొందరు ఎమ్మెల్యేలు పేర్కొన్నట్టు సమాచారం. నిధుల విడుదల, పరిపాలనా అనుమతులు, అభివృద్ధి కార్యక్రమాలన్నీ సీఎంవో ఆమోదంపైనే ఆధారపడుతున్నాయని చెప్పినట్టు తెలిసింది. పార్టీ తరఫున ఏఐసీసీకి నిధులు పంపిస్తున్నామని రాష్ట్ర నాయకత్వం చెప్తుండగా, అవి నిజంగా చేరుతున్నాయా? అని కొందరు ఎమ్మెల్యేలు అనుమానం వ్యక్తంచేసినట్టు సమాచారం. ‘మాతో నిధులు పంపిస్తున్నామని చెప్పారు.. మీకు నిజంగానే అందాయా?’ అని ఏఐసీసీ ప్రతినిధిని పలువురు ఎమ్మెల్యేలు నేరుగా ప్రశ్నించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. సదరు ఎమ్మెల్యే వేసిన ప్రశ్నకు మీనాక్షి చిరునవ్వు నవ్వినట్టు సమాచారం. ‘మీ నియోజకవర్గానికి అడిగిన నిధులు ఇచ్చారు కదా? అయినా ఫిర్యాదు ఎందుకు?’ అని మీనాక్షి అడిగినట్టు తెలిసింది. దీనికి ఒక ఎమ్మెల్యే స్పందిస్తూ ‘నాకు నిధులు ఇచ్చారనే మాట అబద్ధం’ అని పేర్కొన్నట్టు తెలిసింది. ‘పార్టీ బలోపేతం కోసం ఏం చేద్దాం’ అని ఆమె ప్రశ్నించగా, ‘సీఎంను మార్చాలి’ అని సదరు ఎమ్మెల్యే సూచించినట్టు తెలిసింది. దీనిని మౌఖిక ఫిర్యాదుగా తీసుకోవాలా? లిఖితపూర్వకంగా ఇస్తారా? అని ఏఐసీసీ ప్రతినిధులు అడుగగా.. సదరు ఎమ్మెల్యే లిఖితపూర్వకంగానే రాసి ఇస్తానని చెప్పి రాసి ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది.