Congress | స్పెషల్ టాస్క్ బ్యూరో/ హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర కాంగ్రెస్ నేతల ఇజ్జత్ పోయింది. వీరికి అధిష్ఠానం వద్ద వీసమెత్తు విలువలేదని తేలిపోయింది. పార్టీ ఎంతో కీలకంగా భావించే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో రాష్ట్రం నుంచి ఒక్క నేతకు కూడా చోటు దక్కలేదు. చివరకు పార్టీ తుడిచిపెట్టుకుపోయిన ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ మంత్రి రఘువీరారెడ్డికి చోటు కల్పించిన అధిష్ఠానం తెలంగాణ నుంచి ఒక్క నేతను కూడా పరిగణనలోకి తీసుకోలేదు. ఈ ఏడాది ఎన్నికలు జరిగే ఐదు రాష్ర్టాల్లో తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం ఉండగా ఇందులో తెలంగాణ మినహా మిగతా నాలుగు రాష్ర్టాలకు సీడబ్ల్యూసీలో స్థానం కల్పించడం విశేషం. కమిటీ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితుల జాబితాలో దామోదర రాజనరసింహ, ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో వంశీచంద్‌రెడ్డికి అవకాశం కల్పించినప్పటికీ వీరికి సభ్యుని హోదా ఉండదు. వీరిది సీడబ్ల్యూసీ సమావేశాల్లో ప్రేక్షక పాత్రే.
పైరవీలు చేసినా దక్కని ఫలితం
సీడబ్ల్యూసీలో స్థానం కోసం తెలంగాణ నేతలు చేసిన పైరవీలు ఫలించలేదు. సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సీడబ్ల్యూసీలో స్థానం కోసం ఢిల్లీ పెద్దల వద్ద లాబీయింగ్ చేసినప్పటికీ పప్పులు ఉడకలేదు. వీరితోపాటు ఎస్టీ కోటాలో ఎమ్మెల్యే సీతక్క, ఎస్సీ కోటాలో సంపత్‌కుమార్, మల్లు రవి, బీసీ కోటాలో వీ హనుమంతరావు, మధుయాష్కీ కూడా ప్రయత్నం చేసినప్పటికీ అధిష్ఠానం వీరిని లైట్ తీసుకున్నది. రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సీడబ్ల్యూసీలో తప్పకుండా అవకాశం కల్పిస్తారని రాష్ట్ర నాయకులు ఆశించారు. టీపీసీసీ అధ్యక్ష పదవి ఆశించి భంగపడిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి సీడబ్ల్యూసీలోనూ స్థానం లభించకపోవడంతో మరోసారి భంగపాటు తప్పలేదు.
తెలంగాణ నేతలు స్క్రాపేనా?
తెలంగాణ కాంగ్రెస్ నేతలను అధిష్ఠానం పట్టించుకోవడం లేదని, వీరిని స్క్రాప్‌గా పరిగణిస్తున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ నేతలకు విషయం పరిజ్ఞానం లేదన్న గ్రహింపుతోనే సీడబ్ల్యూసీలో స్థానం కల్పించలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. సీడబ్ల్యూసీలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు చోటు దక్కకపోవడం వారికి మాత్రమే కాకుండా తెలంగాణకు కూడా అవమానమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ అధిష్ఠానం ఆది నుంచీ తెలంగాణను చులకనగా చూస్తున్నదనే వాదనలు ఉన్నాయి. ఒకవేళ అధిష్ఠానానికి ప్రేమ ఉంటే.. ఇతర రాష్ర్టాలకు ఇచ్చిన ప్రాధాన్యం తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కమిటీల్లో తెలంగాణ నేతలకు చోటివ్వని కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణలో మాత్రం అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతుండటం గమనార్హం. కమిటీల్లో చోటివ్వని కాంగ్రెస్‌కు రాష్ట్రంలో చోటెలా లభిస్తుందంటూ ఆ పార్టీ నేతలే మండిపడుతున్నారు. సీడబ్ల్యూసీ జాబితాలో చోటు దక్కకపోవడం ముమ్మాటికీ తెలంగాణ నేతల వైఫల్యమేనని సొంత పార్టీ నేతలు అంగీకరిస్తున్నారు. తమ ప్రాంతాన్ని, తమ నేతల్ని గుర్తించని పార్టీ కోసం ఏవిధంగా పని చేయాలంటూ పలువురు నేతలు ప్రశ్నిస్తున్నారు.