Revanth Reddy | హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో రూ.5,000 కోట్లు అప్పు తెచ్చింది. రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మంగళవారం నిర్వహించిన ఈ వేలంలో పాల్గొని రాష్ట్ర ఆర్థికశాఖ ఈ మొత్తాన్ని సేకరించింది. సెక్యూరిటీ బాండ్లు పెట్టి ఈ రూ.5,000 కోట్లు తీసుకున్నట్టు ఆర్బీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. 19 ఏండ్లకు 7.19 శాతం వార్షిక వడ్డీతో రూ.1,000 కోట్లు, 22 ఏండ్లకు 7.21 శాతం వార్షిక వడ్డీతో మరో రూ.1,000 కోట్లు, 23 ఏండ్లకు 7.21 శాతం వార్షిక వడ్డీతో రూ.2,000 కోట్లు, 24 ఏండ్లకు 7.19 శాతం వార్షిక వడ్డీతో రూ.1000 కోట్లు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.17,400 కోట్లు రుణ సమీకరణ చేసింది. రెండో త్రైమాసికంలో రూ.12,000 కోట్లు రుణం తీసుకుంటామని ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపింది.
అయితే, ఒక్క జూలైలోనే రూ.8.500 కోట్లు సేకరించింది. ఆగస్టు తొలివారంలోనే ఆర్బీఐ నుంచి మరో రూ.5,000 కోట్లు రుణం తీసుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు నెలలు కూడా గడవకముందే ఒక్క ఆర్బీఐ నుంచే రూ.30,900 కోట్లు రుణ సమీకరణ చేశారు. తద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ రుణాల కింద రూ.54,009 కోట్లు సమీకరిస్తామని బడ్జెట్లో ప్రతిపాదించిన దాంట్లో సగాన్ని అప్పుడే దాటేశారు. బడ్జెట్ అంచనాల్లో ప్రతిపాదించిన ఆదాయ రాబడి అంచనాల్లో 16 శాతానికే పరిమితమైన రేవంత్రెడ్డి సర్కారు.. రుణ సమీకరణలో మాత్రం 50 శాతాన్ని దాటేయడంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.