Congress 6 Guarantees : ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన డిసెంబర్ 28వ తేదీ నుంచి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించింది. పెన్షన్ పెంపు, మహిళలకు రూ. 2500లు, రూ. 500లకే గ్యాస్, ఇంటి నిర్మాణానికి రూ. 5లక్షలు, కొత్త రేషన్ కార్డుల జారీ వంటి పథకాలకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొంది. ఇందుకోసం గ్రామాల్లోనే గ్రామసభలు నిర్వహించి ఈ సభల ద్వారానే దరఖాస్తులు తీసుకోవడంతో పాటు లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత, పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం గాంధీ భవన్లో నిర్వహించిన పీసీసీ పొలిటికల్ ఆఫైర్స్ కమిటీ(పీఏసీ)లో తీసుకున్న నిర్ణయాలను ఆయన వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ తరుపున, అటు ప్రభుత్వం తరుపున ప్రతినిధులను నియమించి గ్రామ సభలను నిర్వహించనున్నారు. సభ ద్వారా దరఖాస్తులు స్వీకరించి.. అందరి ఆమోదం తెలిపిన వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేయనున్నారు. అయితే దీని పర్యవేక్షణకు ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నోడల్ అధికారిని నియమించనున్నారు. విలేకరుల సమావేశంలో దీనిపై షబ్బీర్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. పథకాల అమలులో తమ కార్యకర్తలకే తొలి ప్రాధాన్యం ఉంటుందని, ఈ విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి గతంలోనే చెప్పినట్లు తెలిపారు. ఇక కొత్త హౌసింగ్ శాఖ ఏర్పాటు చేస్తున్నట్లు షబ్బీర్ అలీ వెల్లడించారు. అయితే ఇది పార్టీ నిర్ణయం. ఇక ప్రభుత్వం నుంచి కూడా దరఖాస్తుల స్వీకరణ, అమలుపై స్పష్టమైన ప్రకటన రావాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే పథకాలు ఎప్పటి నుంచి అమలు చేస్తారనే విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీలో ప్రకటిస్తారని షబ్బీర్ అలీ తెలిపారు. పథకాల అమలుకు సంబంధించిన విధి విధానాల రూపకల్పనపైనా సీఎం స్పష్టతనిస్తారని తెలిపారు.