హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ కాంగ్రెస్ మళ్లీ వివాదంలో చికుకున్నది. కులగణన ప్రమోషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన వీడియోలో భారతదేశ మ్యాప్‌పై వివాదం రేగుతున్నది. మ్యాప్‌లో జమ్ముకశ్మీర్, లడఖ్ చిత్రాన్ని సరిగా ముద్రించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కుల ఆధారిత సర్వేను హైలైట్ చేయడం కోసం ప్రభుత్వం ఒక వీడియో విడుదల చేసింది. దీనిని కాంగ్రెస్ అధికారిక ‘ఎక్స్’ హ్యాండిల్లో షేర్ చేసింది. ఈ వీడియోలో భారతదేశ భౌగోళిక స్వరూపం తప్పుగా ఉన్నదనే విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ జమ్ముకశ్మీర్, లడఖ్ స్వరూపం లేని పటాన్ని ప్రదర్శించటం ఇది మొదటిసారి కాదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన భారత్ సమ్మిట్‌లో, నిరుడు డిసెంబర్లో బెళగావిలో జరిగిన సమావేశాల్లోనూ ఇదేవిధంగా ప్రదర్శించినట్టు నెటిజన్లు విమర్శిస్తున్నారు.