(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ జర్నలిస్టుల అక్రెడిటేషన్ విధానంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన విధానంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రెడిటేషన్, మీడియా కార్డుల పేరిట ఫీల్డ్, డెస్క్ జర్నలిస్టులను విడదీస్తూ జీవో 252ను జారీ చేయడంపై జర్నలిస్టు సంఘాలు, మేధావు లు మండిపడుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పాత్రికేయులను ఫీల్డ్, డెస్క్ జర్నలిస్టులుగా విభజించడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సర్కారు తెచ్చిన కొత్త జీవో ప్రజాగొంతుకపై ముమ్మాటికీ దాడేన ని, పత్రికాస్వేచ్ఛను కాలరాయడమేనని ధ్వజమెత్తుతున్నారు. జర్నలిస్టుల మధ్య చిచ్చురేపడమే లక్ష్యంగా రేవంత్ ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చిందని నిప్పు లు చెరుగుతున్నారు. సర్కారు ఏకపక్ష నిర్ణ యం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నది.
ఏ రాష్ట్రంలోనూ లేదు
దేశంలోని అన్ని రాష్ర్టాల్లోనూ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ సిస్టమ్ ఉన్నది. రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో ఆయా జర్నలిస్టులకు అక్రెడిటేషన్ పేరిట ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తింపు కార్డులను మంజూరు చేస్తున్నాయి. అయితే, అక్రెడిటేషన్ కార్డు జారీకి సదరు జర్నలిస్టు ఫీల్డ్‌లో ఉంటాడా? డెస్క్‌లో ఉంటాడా? ఏ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు? అనే నియమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వమూ పరిగణలోకి తీసుకోవడంలేదని నిపుణులు చెబుతున్నారు. వార్తా సంస్థల్లో వార్తలను రాసి, ఆ వార్తలను మెరుగుపర్చే వారందరినీ అన్ని రాష్ర్టాలూ జర్నలిస్టులుగానే గుర్తిస్తున్నాయని అంటున్నారు. అయితే, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వమే జర్నలిస్టులకు కొత్తగా ఫీల్డ్, డెస్క్ ట్యాగ్‌లను ఇస్తూ వేరుచేస్తున్నదని మండిపడుతున్నారు. ఇదే కాంగ్రెస్ అధికారంలో ఉన్న పొరుగు రాష్ట్రం కర్ణాటకలోనూ ఏకరూప అక్రెడిటేషన్ కార్డులను ఇస్తున్నారని, అక్కడ ఫీల్డ్, డెస్క్ జర్నలిస్ట్ అనే తేడాఏమీలేదని చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల్లోనూ..
రాష్ట్రప్రభుత్వాలే కాదు కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ), ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ)లోనూ జర్నలిస్టులకు ఏకరూప కార్డులను మంజూరు చేస్తున్నట్టు జర్నలిస్టు సంఘాలు చెబుతున్నాయి. పీఐబీ, పీసీఐలోనే లేని నిబంధనలు.. ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నిస్తున్నారు. తాజా జీవోతో 14 వేల మంది జర్నలిస్టుల అక్రెడిటేషన్ రద్దయ్యే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక, జార్ఖండ్ తదితర రాష్ర్టాల్లో జర్నలిస్టుల పేరు, పని చేస్తున్న సంస్థను మాత్రమే గుర్తింపు కార్డుపై ముద్రిస్తారని, సదరు జర్నలిస్ట్ ఏ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడన్న విషయాన్ని కూడా రాయకుండా.. అందరికీ ఏకరూప అక్రెడిటేషన్ కార్డులను జారీ చేస్తున్నారని ఈ సందర్భంగా మేధావులు గుర్తు చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా చర్చ
జర్నలిస్టులకు నష్టం కలిగించేలా ఉన్న జీవో 252ను రేవంత్ ప్రభుత్వం తీసుకురావడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. పాత్రికేయులను విభజిస్తూ ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయంపై జాతీయ మీడియా సంస్థల సీనియర్ జర్నలిస్టులు కూడా విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ కూడా రేవంత్ ప్రభు త్వ నిర్ణయాన్ని తప్పుబట్టింది. జర్నలిస్టులకు రెండు కార్డులను జారీ చేసే విధానం దేశం లో ఇంతవరకూ ఎక్కడాలేదని గుర్తు చేసిం ది. ఈ నిర్ణయంతో కొత్త సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నదని విమర్శించింది.