హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి టీపీసీసీ కమిటీ ఏర్పాటైంది. సీఎల్పీ మాజీనేత జానారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌తో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఈ కమిటీ ఏర్పాటుచేశారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో నాయకుల మధ్య ఏర్పడిన అభిప్రాయ భేదాలు, ఫిర్యాదులను ఈ కమిటీ పరిష్కరిస్తుంది. నాయకులు తమ ఫిర్యాదులను కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని రేవంత్‌రెడ్డి సూచించారు. పార్టీ అంతర్గత వ్యవహారాలు, క్రమశిక్షణ రాహిత్యాన్ని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఫిర్యాదు పరిష్కారానికి పార్టీ సిద్ధంగా ఉండాలని నేతలకు సూచించారు.
జాతీయ కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ సమావేశం మంత్రి శ్రీధర్‌బాబు అధ్యక్షతన శనివారం గాంధీభవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించి జాతీయ మ్యానిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలపై చర్చించారు. ప్రధానంగా ఏపీ విభజనచట్టంలో తెలంగాణకు హకుగా రావాల్సిన అంశాలు, ప్రాంతీయ ఎయిర్ పోర్టులు, వరంగల్ ఎయిర్ పోర్టు ఆధునీకరణ, సింగరేణి రైల్వే, స్పోర్ట్స్ యూనివర్సిటీ తదితర అంశాలపైనా చర్చించారు. జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ విడుదల చేసిన 27 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఉన్నారు.