హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలవడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. అభివృద్ధిలో తెలంగాణ కేవలం ఎనిమిదేండ్లలోనే అగ్రస్థానానికి చేరడం.. ‘డబుల్ ఇంజిన్’ సర్కార్ అంటూ గొప్పగా చెప్పుకొంటున్న రాష్ర్టాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడటం కేంద్రానికి రుచించడం లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు అందనంత ఎత్తులో తెలంగాణ ఉండటం.. ప్రత్యేకించి అనేక అంశాల్లో గుజరాత్‌ను అధిగమించడం నరేంద్రమోదీ సర్కార్‌కు మింగుడు పడటం లేదు. అందుకే అడుగడుగునా తెలంగాణ ప్రగతికి మోకాలడ్డే ప్రయత్నం చేస్తున్నది. రాష్ర్టాన్ని ఆర్థికంగా దెబ్బతీసి కోలుకోకుండా చేయాలని కుట్రలు చేస్తున్నది. కుంటి సాకులతో నిధులివ్వకుండా ఎనిమిదేండ్ల నుంచి వేధిస్తున్నది.
తెలంగాణ విన్నపాలు బుట్టదాఖలు
తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేకమార్లు కేంద్రానికి విన్నవించింది. మొత్తం ఎన్ని నిధులు రావాలి? ఏఏ సంవత్సరంలో ఎంత పెండింగ్‌లో పెట్టారు? అనే విషయాలను కూలంకషంగా వివరిస్తూ పలు లేఖలు రాయడంతోపాటు సీఎం కేసీఆర్ స్వయంగా ఢిల్లీ వెళ్లి అభ్యర్థించారు. అయినా కేంద్రానికి చీమకుట్టినట్టు కూడా లేదు. ఆర్థిక సంఘం సిఫారసులను సైతం బుట్టదాఖలు చేసింది. తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులపై అనేకసార్లు నీతి ఆయోగ్ ఇచ్చిన ఆదేశాలను కూడా బుట్టదాఖలు చేసింది. ఇందులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తనదైన పాత్ర పోషించారు. తెలుగు ఆడపడుచునని చెప్పుకొనే ఆమె తెలంగాణపై సవతి తల్లి ప్రేమను ఒలకబోస్తున్నారు. ‘నోటితో నవ్వి, నొసటితో వెక్కిరించినట్టు’ వ్యవహరిస్తున్నారు.
ముచ్చట్లు సరే… బకాయిల సంగతేంటి?
తెలంగాణలో మూడురోజుల పర్యటనకు వచ్చిన నిర్మలా సీతారామన్ రెండురోజులు పనికిరాని ముచ్చట్లతో కాలం గడిపారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన రూ.34,149 కోట్ల బకాయిల గురించి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పైగా రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లేందుకు విశ్వప్రయత్నం చేశారు. ప్రగతి పథంలో దూసుకెళుతున్న తెలంగాణ గురించి పచ్చి అబద్ధాలు చెప్పి, ప్రజలను నమ్మించేందుకు అష్టకష్టాలు పడ్డారు. కానీ, చైతన్యానికి మారుపేరైన తెలంగాణ సమాజం మాత్రం ఆమెది మొసలి కన్నీరేనని పసిగట్టేసింది. శనివారంతో తెలంగాణ పర్యటనను ముగించుకోనున్న నిర్మలమ్మ ఇప్పటికైనా కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన నిధులపై ప్రకటన చేస్తారో? లేక తన అసలు రంగును బయటపెట్టుకొని తెలంగాణ సమాజం ముందు ద్రోహిగా నిలబడతారో? చూడాల్సిందే.
కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు