ఎన్నికల అంకంలో ఇప్పటికి తొలి అడుగే పడింది. అధికారంలోకి రావటమనే ముచ్చట ఇప్పుడే కాదు. కానీ రేవంత్‌రెడ్డి అప్పుడే తనకు అలవాటైన రాజకీయం మొదలెట్టారు. ప్రభుత్వ పథకాలను ఆపేయాలంటూ తన ప్రజా వ్యతిరేక విధానాలను బయటపెట్టుకొన్నారు. రైతులు, పేదల కోసం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల అమలును అపేయాలని, నిధులను విడుదల చేయొద్దని ఏకంగా ఈసీని కోరారు. గత ఆరు నెలల్లో చేపట్టిన నియామకాలను, పనులకు పిలిచిన టెండర్లను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు పెడుతామని హెచ్చరించారు.
హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలుచేస్తున్న పథకాలను వెంటనే ఆపేయాలంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తన ప్రజా వ్యతిరేక విధానాలను మరోసారి బయటపెట్టుకొన్నారు. రాష్ట్రంలో రైతులు, పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలును అపేయాలని, నిధులను విడుదల చేయొద్దని ఎన్నికల సంఘాన్ని కోరారు. రైతుబంధు వంటి పథకాల కింద ఎవరికీ డబ్బులు అందకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘గత ఎన్నికల సమయంలో రైతులకు రైతుబంధు పైసలు పడినట్టు మెసేజ్‌లు వచ్చాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఎన్నికలు ముగిసేవరకు సంక్షేమ పథకాలకు నిధులను విడుదల చేయకూడదు. ఈ పథకాలన్నింటికి నెల రోజుల తర్వాత డబ్బులు ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారులపైనా రేవంత్‌రెడ్డి బెదిరింపులకు దిగారు. అధికారుల సంగతి చూస్తాం అనేవిధంగా హెచ్చరికలు జారీచేశారు. ఎన్నికల సమయంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, అలాంటివారిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని బెదిరించారు. డీజీపీ నుంచి బీఎల్వో వరకు అధికారుల జాబితాను రూపొందిస్తున్నామని, ఇందుకోసం ప్రత్యేకంగా ఒక కమిటీనే ఏర్పాటు చేసినట్టు చెప్పుకొన్నారు.
మీడియాకూ బెదిరింపులే
మీడియాను కూడా బెదిరించేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నించారు. తమ పార్టీలో ఏదో జరిగిపోతున్నట్టుగా, మీటింగుల్లో చొక్కాలు చింపుకొని కొట్టుకున్నట్టుగా వార్తలు రాస్తే అలాంటి పేపర్లు, టీవీలపైనా ఈసీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. యాజమాన్యాలతోపాటు వార్తలు రాసే రిపోర్టర్లపైనా క్రిమినల్ కేసులు పెడతామని బెదిరించారు.
పీక్ స్టేజ్‌కి ఫ్రస్టేషన్
రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మీడియాను బెదిరించటంపై సీనియర్ జర్నలిస్టులు మండిపడుతున్నారు. వాస్తవాలు రాస్తే ఉలుకెందుకంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ అధికారులను బెదిరించడం ఏమిటని అధికారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నిబంధనల ప్రకారం అధికారులు విధులు నిర్వహిస్తారని, వారిపై ఓ రాజకీయ పార్టీ ఈ విధంగా బెదిరింపులకు పాల్పడటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఓవైపు పార్టీలో తన మాట చెల్లకపోవడం, మరోవైపు పార్టీ ఓటమి ఖాయమనే సంకేతాలు వెలువడటం, ఇంకోవైపు అధిష్ఠానం నుంచి మొట్టికాయలు పడుతుండంతో రేవంత్‌రెడ్డిలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయిందని, అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
నియామకాలు చెల్లవట!
రాష్ట్రప్రభుత్వం గత ఆరు నెలల్లో చేపట్టిన నియామకాలను, నిర్వహించి టెండర్లను వెంటనే రద్దుచేయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకొంటే క్రిమినల్ కేసులు పెడుతామని కాంట్రాక్టర్లను హెచ్చరించారు. కార్పొరేషన్ల నియామకాల చెల్లవని అడ్డగోలుగా మాట్లాడారు. దీనిపై మేధావులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఎన్నికల కోడ్ లేనప్పుడు రాష్ట్రప్రభుత్వాన్ని నియంత్రించే అధికారం ఈసీకి లేదన్న విషయం రేవంత్‌రెడ్డికి తెలియకపోవచ్చని అంటున్నారు. కార్పొరేషన్లకు నియామకాలు చేపట్టేటప్పుడు నెలకోసం, రెండునెలల కోసం నియమిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. ఇక టెండర్ల విషయంలో కాంట్రాక్టర్లను బెదిరించటంపై ఆయా వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. తుచ్చమైన రాజకీయాల కోసం తమను అవినీతిపరులుగా చిత్రిస్తారా? అని కాంట్రాక్టర్లు మండిపడుతున్నారు.
పథకాలను అడ్డుకుంటే గుణపాఠం తప్పదు
పథకాలను అడ్డుకోవాలని చూస్తే ఎన్నికల్లో పుట్టుగతులు లేకుండా చేస్తామని ప్రజలు, రైతులు హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్‌కు ఎలాగూ పేదలకు మేలు చేయాలనే ఆలోచన లేదని, తమకు మేలు చేస్తున్న వారిని ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలను చేసింది. దీంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పారు. అయినప్పటికీ ఆ పార్టీ తీరు మారలేదని మండిపడుతున్నారు. పేదల సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే మరోసారి భంగపాటు తప్పదని హెచ్చరిస్తున్నారు.
కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో పథకాలు ఆపారా?
నిబంధనల ప్రకారం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎలాంటి కొత్త పథకాలను ప్రారంభించరాదు. అప్పటికే కొనసాగుతున్న పథకాలను యథావిధిగా అమలు చేయొచ్చు. రేవంత్‌రెడ్డి మాత్రం ఎప్పటినుంచో అమలవుతున్న పథకాలను కూడా ఆపేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలకు కూడా దాదాపు ఒకేసారి ఎన్నికలు జరుగనున్నాయి. ఆ రాష్ర్టాల్లో కూడా ఎన్నికల కోడ్ తెలంగాణతోపాటే అమల్లోకి వచ్చింది. మరి ఆ రాష్ర్టాల్లో ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ ఆపేశాయా రేవంత్? అని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు. నిజాలు తెలియకపోతే ఎన్నికల నిబంధనావళిని చదువుకోవాలని సూచిస్తున్నారు. ఏనాడైనా ప్రజల గురించి ఆలోచిస్తే సంక్షేమ పథకాల విలువ తెలిసేదని మండిపడుతున్నారు.