ఖమ్మం: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ జోరు కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వివిధ జిల్లాల్లో ప్రచార సభలతో హోరెత్తిస్తున్నారు. ఆదివారం ఖమ్మం పట్టణంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా బాగా ఆలోచించి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లను కోరారు. దేశంలో ఇంకా ప్రజాస్వామ్య పరిణతి రాలేదని, ప్రజాస్వామ్య పరిణితి సాధించి దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని సీఎం అన్నారు. దేశంలో ప్రజాస్వామ్య పరిణతి కోసం యువత కృషి చేయాలని సూచించారు.
సీఎం ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘నేకొక్కటే మనవి చేస్తున్నా. ఖమ్మం చాలా చైతన్యవంతమైన ప్రాంతం. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయింది. అయినా దేశంలో ఇంకా ప్రజాస్వామ్య పరిణతి రాలేదు. ఎన్నికలు వస్తుంటయ్, పోతుంటయ్. ఎన్నికలు వచ్చినప్పుడు మూడు నాలుగు పార్టీల నుంచే కాకుండా స్వతంత్రులుగా కూడా కొందరు అభ్యర్థులు బరిలో దిగడం, ఈ అందరిలో ఒకరు మాత్రమే గెలువడం అనేది సర్వసాధారణంగా జరిగేదే. కానీ దేశంలో ప్రజ్వాసామ్య పరిణితి రావాలంటే యువత ముఖ్యంగా ముందుండాలి. ఓటు వేసేటప్పుడు విచక్షణతో ఆలోచించి ఓటేయాలి. అక్షర జ్ఞానం లేని వాళ్లకు యువత ఓటు విలువ తెలియజెప్పాలె. ప్రతి ఒక్కరూ ఓటు వేసేటప్పుడు బాగా ఆలోచించాలి. అభ్యర్థుల గుణగణాలను పరిశీలించాలి. ఆ అభ్యర్థుల వెనుక ఉన్న పార్టీలను చూడాలి. ఏ పార్టీ అధికారంలో ఉంటే బాగుంటది..? ఆ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది..? అనేది ఆలోచించాలి. ఇలా విచక్షణతో ఆలోచించి ఓటేయాలి. అప్పుడే భవిష్యత్‌లో మరింత మంచి జరుగుతది. ప్రజల చేతిలో ఉండే ఒకే ఒక్క వజ్రాయుధం ఓటు. మీరంతా చైతన్యవంతులు కాబట్టి బాగా ఆలోచించి ఓటేయాలి’ అని సీఎం సూచించారు.
‘ఖమ్మం జిల్లాకే చెందిన కవి రావెళ్ల వెంకట్రామారావు తెలంగాణ రాకముందు 70, 80 ఏళ్ల క్రితం ‘నా తల్లి తెలంగాణరా.. వెలలేని నందనోద్యానమ్మురా’ అని పాట రాశారు. ఇవాళ ఖమ్మం పట్టణం చూసి గర్వపడుతున్నా. ఒకప్పుడు మన గోర్లపాడు ఎట్లుండే..? ఎంత మురికి ఉండే..? ఎన్నేళ్లు మనం ఆ మురికి కంపు భరించినం..? మీరు ఆలోచించాలె. మన లకారం చెరువు ఒకప్పుడు ఎంత వికారంగా ఉండెనో ఇప్పుడు ఎంత సుందరంగా తయారైందో మీరు ఆలోచించాలి. పువ్వాడ అజయ్, నేను వాటి దుస్థితి చూసి రూ.100 కోట్ల నిధులతో అభివృద్ధి చేసినం. ఇవాళ ఖమ్మంలో వైకుంట ధామాలు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అద్భుతంగా ఉన్నయ్. ఒకప్పుడు మురికిల పెట్టి కూరగాయలు అమ్మాల్సి వచ్చేది. ముఖ్యమంత్రి అయినా ఆ కూరగాయలు తినాల్సిందే. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒకప్పుడు ఖమ్మం అంటే ఇరుకు సందులు, మురికి కాలువలు, దర్గంధంతో కూడిన పట్టణంగా ఉండె. ట్రాఫిక్ కష్టాలు, యాక్సిడెంట్స్కు నిలయంగా ఉండె. ఇప్పుడు ఖమ్మం అంటే సిక్స్ లేన్ రోడ్స్. సందుల్లో కూడా వైట్ టాప్ సిమెంట్ రోడ్స్. దారి పొడవునా దగదగలాడే లైట్స్, పచ్చని చెట్లు దర్శనమిస్తున్నాయి. ఇవన్నీ ఏదో మంత్రమేస్తే జరగలే. మీ మంత్రి పువ్వాడ అజయ్ కష్టపడి పనిచేస్తే జరిగింది. పువ్వాడ ప్రజల మధ్య ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాడు. ‘వాడవాడలా పువ్వాడ’ అని నేను పేపర్లలో చదివిన’ సీఎం తెలిపారు.
‘ఒకప్పుడు ఖమ్మం పట్ణణంలో రోడ్ నెట్వర్క్ 400 కిలోమీటర్లు ఉండె. ఇప్పుడు దాన్ని 1,115 కిలోమీటర్లకు తీసుకుపోయినం. ఒకప్పుడు మోరీల పొడవు 205 కిలోమీటర్లు ఉండె. ఇప్పుడు దాన్ని 1,592 కిలోమీటర్లకు తీసుకుపోయింది పువ్వాడ కాదా అని నేను అడుగుతున్నా. గోర్లపాడు ఛానెల్, లకారం చెరువు చిటికేస్తే అభివృద్ధి కాలే. ఏడు సంవత్సరాలు కష్టపడి పనిచేస్తే అయినయ్. లకారం చెరువు నగరవాసులకు ఆనందాన్ని పంచే ప్రదేశంగా తయారైంది. ఒకప్పటి లకారానికి ఇప్పటి లకారానికి పోలికే లేదు. దంసులాపురం బ్రిడ్జి గురించి కావచ్చు, మునేరు పొంగితే వరదలు వచ్చే ప్రాంతాల గురించి కావచ్చు అజయ్ దాదాపు నాతోటి పంచాయితీనే పెట్టుకున్నడు. పట్టుబట్టి రూ.700 కోట్ల నిధులను మంజూరు చేయించుకుని అభివృద్ధి పనులు చేసిండు. పట్టణాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని అజయ్ చూస్తున్నడు. నేను మిమ్మల్ని ఒక్కటే కోరుతున్నా. దయచేసి మంచి చెడు ఆలోచించి ఓటు వేస్తే మీకు ఇంకా మంచి జరుగుతది. పువ్వాడ అజయ్‌ని గెలిపిస్తే మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటడు. కాదని తుమ్మలు, తుప్పలు తెచ్చుకుంటే మీకే తుమ్మ ముళ్లు గుచ్చుకుంటయ్. మరి తుమ్మ ముళ్లు కావాల్నో, పువ్వాడ పువ్వులు కావాల్నో మీరే తేల్చుకోండి’ అని సీఎం వ్యాఖ్యానించారు.