ఇది పాత రేవంత్ మాట
అక్రమ నిర్బంధాలు జర్నలిస్టులకు కొత్త కాదు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇలాంటివి చాలా చూసినం. జర్నలిజాన్ని పూర్తిగా తమ దొడ్లో కట్టేసుకోవాలనో.. లేకుంటే పాత్రికేయులందరినీ తమ బానిసలుగానో లేకుంటే ఉపాధి హామీ కూలీలుగానో చూడాలనుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రయత్నం చేస్తున్నదో.. దానిపై కచ్చితంగా మీడియా మిత్రులు అందరూ ఆలోచన చేయాల్సిన సందర్భం వచ్చింది. మీరు మౌనంగా ఉంటే ఇయ్యాల జరిగింది రేపు మీకూ జరుగొచ్చు.
– 2019 అక్టోబర్ 8న మీడియాతో రేవంత్
Telangana | హైదరాబాద్, మార్చి 15(నమస్తే తెలంగాణ): యూట్యూబర్స్ క్రిమినల్సా? యూట్యూ బ్, సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడించేవాళ్లంతా నేరస్థులా? అవుననేలా సీఎం రేవంత్‌రెడ్డి శనివారం అసెంబ్లీలో వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అభిప్రాయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. శనివారం సీఎం అసెంబ్లీలో మాట్లాడుతూ.. జర్నలిస్టులు ఎవరో లిస్టు ఇవ్వాలని సంఘాలను కోరారు. ఆ లిస్టులో పేరు లేనివాళ్లను క్రిమినల్స్‌గా చూస్తాం.. వారికి ఎలా జవాబు చెప్పాలో తమకు తెలుసని అన్నారు. యూట్యూబ్ చానళ్లు సోషల్ మీడియాలో పిచ్చి ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదేం భాష అంటూ అసహనం వ్యక్తంచేశారు. అసలు ఎవరు జర్నలిస్టులని ప్రశ్నించారు. ఐ అండ్పీఆర్ ఐడీ కార్డులు ఉన్నవారా? ఎవరు? అని ప్రశ్నించారు. ఎవరు పడితే వాళ్లు ఏదో యూట్యూబ్ పెట్టుకొని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మీ అమ్మనో, చెల్లినో అంటే పడతారా? అంటూ ప్రశ్నించారు. ఆడవాళ్లను అనే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చిందని నిలదీశారు. ‘సీఎంగా చెబుతున్నా… ఏది పడితే అది మాట్లాడితే చెల్లిపోతుందని అనుకుంటున్నారేమో. కోర్టుకు వెళ్తే బెయిల్ వస్తదని అనుకుంటున్నారేమో.. తోడ్కలు తీస్తా.. బట్టలు విప్పించి రోడ్డుపై తిప్పిస్తా. ఓపిక పడుతున్నా.. లేదంటే లక్ష మంది బయటకొచ్చి బట్టలు విప్పించి కొడతరు’ అని ఆగ్రహంతో ఊగిపోయారు.
అవసరమైతే చట్టాన్ని సవరిస్తామని, వీటిని క్షమించే పరిస్థితే లేదని చెప్పారు. జర్నలిస్టుల జాబితాలో పేరు లేనోళ్లను క్రిమినల్స్‌గా చూస్తాం, వారికి జవాబు ఎలా చెప్పాలో తెలుసని పేర్కొన్నారు. ముసుగు వేస్తే ఊడదీసి కొడతామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘నేనూ మనిషినే. నాకు చీము నెత్తురు ఉంది. ప్రతి దానికి ఒక శిక్ష ఉంటుంది. దీనిపై చర్చ జరగాలి. అవసరమైతే ఉక్కు చట్టం తీసుకొస్తాం. ఇది తన ఒక్కరి ఆవేదన కాదు. అందరి ఆవేదన. ఆ వీడియోలో నా పేరు తీసి మీ పేరు పెట్టుకోండి. ఎలా ఉంటుందో’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అక్రెడిటేషన్ కార్డులు ఉన్నవాళ్లే జర్నలిస్టులు అనేలా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. అంటే ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉంటేనే జర్నలిస్టా? ఓ వ్యక్తి శిక్షణ పొందితే జర్నలిస్టా అనే చిక్కుప్రశ్న ఇప్పుడు ఎదురవుతున్నది. ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉన్నవాళ్లే వార్తలు రాయాలనే నిబంధనను తీసుకొచ్చేలా రేవంత్ మాట్లాడారు. అవసరమైతే చట్టాన్ని సవరిస్తామని కూడా చెప్పుకొచ్చారు. అంటే మీడియాపై నియంత్రణ తీసుకొచ్చి, వ్యతిరేక వార్తలు రాయకుండా కట్టడి చేయాలనే ప్రయత్నమా? మీడియాను గుప్పిట్లో పెట్టుకొనే ఎత్తుగడా? వాస్తవానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) ప్రకారం వాక్ స్వాతంత్య్రపు హక్కు ప్రజలందరికీ ఉన్నది. దాని ఆధారంగానే ప్రచార, ప్రసార మాధ్యమాలు కొనసాగుతున్నాయి.
మీడియాకు స్వీయ నియంత్రణ ఉంటుందే తప్ప, రాజ్యాంగ నియంత్రణ లేదు. అందుకే మీడియాను ఫోర్త్ ఎస్టేట్‌గా గుర్తించారు. రాజ్యాంగపు హక్కును హరిస్తామనేలా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ప్రజాస్వామ్యంలోని ప్రాథమిక హక్కుకు తాళం వేద్దామనే దుస్సాహసం సాధ్యమవుతుందా? ఇదే ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జర్నలిస్టులంటే ఎనలేని ప్రేమ ప్రదర్శించారు. ‘ఈ ప్రభుత్వాన్ని చూసి ప్రజలే భయపడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. మనం ఎన్నుకొన్న ప్రభుత్వానికి మనమే భయపడే పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో వస్తే, ఇయ్యాల జర్నలిస్టులు కూడా.. ఏదైనా మాట్లాడాలంటే అటూ ఇటూ చూసుకొనే పరిస్థితి వచ్చింది’అని ఓ సందర్భంలో ఉన్నారు. అలాంటి దృక్పథం అధికారంలోకి వచ్చేసరికి తిరగబడింది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యలపై పాత్రికేయ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. యూట్యుబర్లు క్రిమినల్స్ అనేలా మాట్లాడటంపై జర్నలిస్టులు భగ్గుమంటున్నారు. ఒకప్పుడు కేవలం వార్తాపత్రికలు మాత్రమే ఉండేవి. కాలక్రమే ణా టీవీ చానళ్లు వచ్చాయి. పత్రిక ల్లో పనిచేసినవాళ్లే టీవీ చానళ్లలో పనిచేస్తున్నారు. టెక్నాలజీ పెరిగిపోవటంతో ఇంటర్నెట్ ఆధారంగా అనేక ప్లాట్‌ఫామ్స్ పుట్టుకొచ్చాయి. యూ ట్యూబ్, ట్విట్టర్(ఎక్స్), ఫేస్బుక్, వాట్సాప్, ఈ పేపర్.. ఇలా అనేక ఆవిష్కరణలు వెలుగుచూశాయి. వాటికి అనుగుణంగా కొత్త మీడియంలోకి జర్నలిస్టులు మారిపోయారు.
ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసే ప్లాట్‌ఫామ్స్‌ను జర్నలిస్టు స్వతంత్రంగా నిర్వహించే అవకాశం ఉండటంతో అనేకమంది సొంతంగా వీటిని ఆపరేట్ చేస్తున్నారు. అలాగని ఇవి మీడియా గొడుకు కిందికి రాకుండాపోతాయా? ప్రభుత్వ పనితీరును, ప్రజల్లో సర్కారుపై ఉన్న వ్యతిరేకతను సోషల్‌మీడియా నడిబజారులో నిలబెడుతున్నది. హామీలు అమలుచేయలేని ఫ్రస్టేషన్లో ఉన్న ముఖ్యమంత్రికి డిజిటల్ మీడియా జోరు పుండుమీద కారం చల్లినట్టుగా మారటమే ప్రస్తుత అసహనానికి కారణం.