Uday Scheme | హైదరాబాద్, జూలై 29 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల బిగింపునకు రంగం సిద్ధమైందా? విద్యుత్తు వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు పెట్టక తప్పని పరిస్థితి ఏర్పడిందా? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు ఇందుకు బలాన్నిస్తున్నాయి. కేంద్రంతో గత బీఆర్ఎస్ సర్కారు చేసుకొన్న ఒప్పందం కారణంగానే స్మార్ట్ మీటర్లు బిగించాల్సి వస్తున్నదని ముఖ్యమంత్రి ఆరోపిస్తున్నారు. 2017 జనవరిలో కేంద్ర ప్రభుత్వంతో, ఆప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, రాష్ట్ర డిస్కంలు త్రైపాక్షికంగా చేసుకొన్న ‘ఉదయ్’ ఒప్పందాన్ని ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. అయితే, వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టడానికి తాము ఒప్పుకోలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు నిక్కచ్చిగా చెప్తున్నారు. 2021 జూన్ 9నాటి కేంద్రం ఎఫ్ఆర్బీఎం రుణ ప్రతిపాదనలకు, 2017లో తీసుకొచ్చిన ఉదయ్ స్కీంకు ముడిపెట్టి విద్యుత్తు స్మార్ట్ మీటర్ల అంశంలో సీఎం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు.
2017 జనవరి 2న కేంద్ర ప్రభుత్వం ‘ఉదయ్’ పథకాన్ని తీసుకొచ్చింది. కాంగ్రెస్, బీజేపీపాలిత రాష్ర్టాలతో కలిపి మొత్తం 27 రాష్ర్టాలు దీనిపై సంతకాలు చేశాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ డిస్కంలు కలిపి ఈ ‘త్రైపాక్షిక ఒప్పందం’పై 2017 జనవరి 4న సంతకాలు చేశాయి. డిస్కంల ఆర్థిక పరిస్థితిని సరిదిద్దడానికి, సంక్షోభంలో చిక్కుకొన్న డిస్కంలను బయటపడేసేందుకు, డిస్కంల అప్పులను రాష్ట్ర ప్రభుత్వాలు భరించేలా ఈ పథకాన్ని తీసుకొచ్చినట్టు కేంద్రం వెల్లడించింది.
తెలంగాణ డిస్కంలు ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. వీటి రెవెన్యూ లోటు 2016-17లో రూ.4,380 కోట్లు. 2015 మార్చి 31 నాటికి డిస్కంల నష్టాలు రూ.9,875 కోట్లు, 2015 సెప్టెంబర్ నాటికి అప్పులు రూ.11,897 కోట్లకు చేరాయి. ఈ అప్పుల నుంచి డిస్కంలను బయటపడేయడమే ఈ స్కీం ముఖ్యోద్దేశం.త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం.. అప్పుల్లో 75% డిస్కంల పేరుపై నుంచి రాష్ట్ర ప్రభుత్వం పేరు మీదకు 2017 మార్చి 31నాటికి బదిలీ అయ్యింది. విద్యుత్తు నష్టాలను తగ్గించడానికి ఒప్పందం ప్రకారం.. డిస్కంలు కింది నిబంధనలు అమలుచేయాలి. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్తు ఫీడర్ల వద్ద 2017 జూన్ 30 నాటికల్లా స్మార్ట్ మీటర్లు ఏర్పాటుచేయాలి.
వ్యవసాయ వినియోగదారులు మినహా.. 500 యూనిట్లలోపు వాడే కనెక్షన్లకు 2018 డిసెంబర్ 31నాటికి, 200 యూనిట్లలోపు వాడే కనెక్షన్లకు 2019 డిసెంబర్ 31నాటికల్లా స్మార్ట్ మీటర్లు ఏర్పాటుచేయాలి. రాష్ట్రంలోని అన్ని 11 కేవీ ఫీడర్ల వద్ద కరెంటు ఎంత సరఫరా అవుతుందనేది 2018 మార్చి 31కల్లా ఆడిట్ చేసి నివేదిక ఇవ్వాలి. ఆర్థిక క్రమశిక్షణ, డిస్కంల అప్పులను రాష్ట్రప్రభుత్వాలు భరించే వెసులుబాటు ఉండటంతో ఉదయ్ పథకంపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సంతకాలు చేసింది. ఈ పథకంలో స్మార్ట్ మీటర్ల బిగింపు చేపట్టాలని నిబంధన ఉండగా, అప్పటికే వినియోగదారులందరికీ మీటర్లు ఉండటంతో కేసీఆర్ సర్కారు కొత్తగా మీటర్లను పెట్టలేదు. దీంతో రాష్ట్రంలో ఏ ఒక్క స్మార్ట్ మీటర్ కూడా ఇన్స్టాల్ కాలేదు.
2021-22 నుంచి 2024-25 వరకు విద్యుత్తు సంస్కరణలు అమలు చేస్తే.. 0.5% అదనంగా 4% జీఎస్డీపీ వరకూ రుణాలు పొందే వెసులుబాటును రాష్ర్టాలకు ఇస్తాం. విద్యుత్తు సవరణ బిల్లు-2020 నియమాలను పాటించాలి. నష్టాలను తగ్గించేందుకు డిస్కంల పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్తు పంపిణీని ఫ్రాంచైజీలకు, సబ్లైసెన్సీలకు అప్పగించాలి. డీబీటీ పద్ధతిలో వ్యవసాయం, గృహ వినియోగదారులకు విద్యుత్తు సబ్సిడీ చెల్లించాలి. ఏ రాష్ర్టాలు ఎఫ్ఆర్బీఎం పరిధికి మించి అప్పు తీసుకోవాలని అనుకొంటున్నాయో.. ఈ మేరకు అంగీకరిస్తున్నట్టు ప్రతిపాదనలు పంపించాలి. ఈ రూల్స్ రాష్ట్రంలో అమలవుతున్న వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు పథకానికి ఆటంకంగా మారొచ్చన్న ఉద్దేశంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దీనిని వ్యతిరేకించింది. ఈ నియమాలకు ఒప్పుకొంటే డిస్కంల ప్రైవేటీకరణ జరుగొచ్చని అనుమానించింది. డీబీటీ పద్ధతిలో సబ్సిడీ చెల్లించాలంటే బోరు బావులకు మీటర్లు బిగించాల్సి ఉంటుందని, ఇది రైతాంగ సంక్షేమానికే నష్టమని భావించిన కేసీఆర్ సర్కారు ఈ నిబంధనలను ఒప్పకోలేదు. దీంతో నాలుగేండ్లలో అప్పుల రూపంలో రాష్ర్టానికి సమకూరాల్సిన రూ. 30 వేల కోట్లు అందకుండా పోయాయి. అయినప్పటికీ, కేసీఆర్ మీటర్లు పెట్టేందుకు సుముఖత చూపలేదు.
వ్యవసాయ మోటర్లకు స్మార్ట్ మీటర్లు బిగింపు లేదని తెలియజేసేలా.. 2017లోని ఉదయ్ స్కీంలో మీటర్ల బిగింపు విషయంలో వ్యవసాయ వినియోగదారులను మినహాయిస్తున్నట్టు స్పష్టంగా పేర్కొన్నారు. అందుకే, అప్పటి బీఆర్ఎస్ సర్కారు దానికి ఒప్పుకొన్నది. తర్వాత 2021లో తీసుకొచ్చిన నోట్లో వ్యవసాయ మోటర్లకు స్మార్ట్‌మీటర్ల బిగింపు చేపట్టాలంటూ పరోక్షంగా కేంద్రం నిబంధనలు తీసుకురావడంతో దానిని కేసీఆర్ ప్రభుత్వం వ్యతిరేకించింది. అయితే, 2017లోని ఉదయ్ స్కీంను, 2021 నోట్‌ను కలగలిపి.. రెండూ ఒకటే అనేలా భ్రమింపజేసిన సీఎం రేవంత్.. సాగు మీటర్లపై గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాల్జేయడానికి ప్రయత్నించారు. సాగు మోటర్లకు మీటర్లు పెట్టడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించిందటూ అబద్ధాలు వల్లె వేశారు. అది నిజం కాదు. ఒకవేళ నిజంగా అప్పటి కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలనుకొంటే, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో ఆ వ్యాఖ్యలు చేసేవారు కాదని నిపుణులు గుర్తు చేస్తున్నారు.
వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం పలుమార్లు ప్రయత్నించినప్పటికీ, అప్పటి కేసీఆర్ ప్రభుత్వం దానికి ఒప్పుకోలేదు.
2020 ఏప్రిల్ 17: రాష్ర్టాలకు పంపిన ముసాయిదాలో.. ‘రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సబ్సిడీ పొందే వర్గాల నుంచి (సాగు రంగం సహా) డిస్కంలు ముందుగా బిల్లులు వసూలు చేయాలి. ఆ తర్వాత కావాలంటే నగదు బదిలీ రూపంలో వారికి తిరిగి ఇవ్వవచ్చు’ అని పేర్కొన్నది. దీనికి అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఒప్పుకోలేదు.
2020 డిసెంబర్ 31: విద్యుత్తు వినియోగదారుల హక్కుల నిబంధనల్లో.. ‘మీటర్లు లేకుండా విద్యుత్తు కనెక్షన్ జారీ చేయరాదు’ అని కేంద్రం స్పష్టం చేసింది. దీనిని కూడా అప్పటి బీఆర్ఎస్ సర్కారు వ్యతిరేకించింది.
2021 ఫిబ్రవరి 5: రాష్ర్టాలకు పంపిన విద్యుత్తు చట్ట సవరణ రెండో ముసాయిదా ప్రకారం.. ‘ఏ రంగంలో అయినా విద్యుత్తు కనెక్షన్‌కు మీటర్ తప్పనిసరి’ అని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తెలంగాణ సహా పలు రాష్ర్టాలు అభ్యంతరం వ్యక్తంచేశాయి.
2021 ఏప్రిల్ 27: జాతీయ విద్యుత్తు విధాన ముసాయిదాలో.. తాము ఇస్తున్న ఈ పాలసీ నోటిఫికేషన్ వెలువడిన ఏడాదిలోగా మీటర్లు బిగించాలని ఆదేశించింది. దీనిని కూడా అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఖండించింది.
2021 అక్టోబర్ 6: కొత్త ఆడిట్ నిబంధనల ప్రకారం.. ‘మూడేండ్లలో వినియోగదారులందరికీ కమ్యూనికేబుల్ మీటర్లు బిగించాలి’ అని కేంద్రం ఆదేశించింది. రైతుల మోటర్లకు మీటర్లు బిగించడమే దీని లక్ష్యం. ఈ ప్రతిపాదనను అప్పటి సీఎం కేసీఆర్ వ్యతిరేకించారు. అయితే, అప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న కాంగ్రెస్‌గానీ, ఇతర పక్షాలుగానీ మోటర్లకు మీటర్ల విషయంలో కేంద్రాన్ని నిలదీయకపోవడం గమనార్హం.
విద్యుత్తు రంగంలో సంస్కరణలు తీసుకొస్తామని, డిస్కంల నష్టాలను తగ్గిస్తామంటూ ఎఫ్ఆర్బీఎం రుణ ప్రతిపాదనల పేరిట ఎఫ్ నంబర్ 40(02)/ ఎఫ్-ఎస్/2020-21తో 2021 జూన్ 9నాడు రాష్ర్టాలన్నింటికీ కేంద్ర ఆర్థిక శాఖ ఒక నోట్‌ను పంపించింది. ఏ రాష్ర్టాలైతే, ఎఫ్ఆర్బీఎంలో అనుమతించిన దానికంటే 0.5% అదనంగా అప్పు తీసుకోవాలనుకొంటున్నాయో.. ఆయా రాష్ర్టాలు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని ఆ నోట్లో సూచించింది.డజనుకుపైగా రాష్ర్టాలు ఈ ప్రతిపాదనలు పంపాయి.
‘మోదీ ప్రభుత్వం మోటర్లకు మీటర్లు పెట్టుమని ఒత్తిడి తెస్తే.. నా తల తెగిపడినా సరే పెట్టను అని చెప్పిన’ అని మాజీ సీఎం కేసీఆర్ తరుచూ చెప్పేవారు. ఇది నిజమని.. 2023 నవంబర్ 21న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతున్నది. ‘రాష్ర్టాలు రుణం రూపంలో నిధులు సేకరించుకోవాలంటే మోటర్లకు మీటర్లు పెట్టాలని నిబంధన విధించాం. అన్ని రాష్ర్టాలు మోటర్లకు మీటర్లు పెట్టి నిధులు తీసుకున్నాయి. తెలంగాణలో మాత్రం పెట్టలేదు. నిధుల సేకరణకు మేం అనుమతి ఇవ్వలేదు’ అని ఆమె హైదరాబాద్‌లో మీడియా ముఖంగా చెప్పారు.