CM Revanth Reddy | హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): అటు చూస్తే కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశం.. ఇటు చూస్తే అదానీతో ‘పారిశ్రామిక’ స్నేహం.. అటు ఖర్గేను, రాహుల్‌గాంధీని కాదనలేక, ఇటు అదానీని అనలేక సీఎం రేవంత్‌రెడ్డి సతమతమయ్యారు. హైదరాబాద్‌లో గురువారం ఈడీ ఆఫీస్ ముందు జరిగిన ధర్నాలో సీఎం ప్రసంగాన్ని చూస్తే ఇది అర్థం అవుతుంది.
అదానీ కుంభకోణంపై విచారణ జరపాలని, సెబీ చైర్పర్సన్ అక్రమాలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలన్న డిమాండ్లతో ఏఐసీసీ పిలుపుమేరకు గురువారం బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం వద్ద టీపీసీసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మొక్కుబడిగా హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి సంబంధం లేని ప్రసంగం చేయడంపై అటు రాజకీయ వర్గాలు, ఇటు కాంగ్రెస్ శ్రేణులు విస్మయం వ్యక్తం చేశాయి. అదానీపై రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అవినీతి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.
కానీ సీఎం రేవంత్‌రెడ్డి అందుకు భిన్నంగా అదానీ కంపెనీకి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రెడ్ కార్పెట్ పరిచారు. దావోస్‌లో కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపి, ఫొటోలు దిగారు. రాష్ట్రంలో రూ.12,400 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకున్నారు. పాతబస్తీలో కరెంటు బిల్లుల వసూలు బాధ్యతను అదానీకి అప్పగించారు. ఈ నిర్ణయాలపై ఎన్ని విమర్శలు వస్తున్నా వెనక్కి తగ్గడం లేదు. దీనిని బట్టే అదానీకి, రేవంత్‌రెడ్డికి మధ్య ఉన్న స్నేహం ఎంత బలమైనదో అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఏఐసీసీ ఆదేశం మేరకు ఈడీ ఆఫీస్ ముందు జరిగిన ధర్నా కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి దగ్గరుండి నేతృత్వం వహించాలి. కానీ కార్యక్రమం మొదలైన తర్వాత గంట ఆలస్యంగా సీఎం అక్కడికి వచ్చారు. ఉదయం 11.15 గంటలకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ బృందం సీఎం రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటిలో కలిసింది. వారు వెళ్లిపోయిన తర్వాత ప్రముఖులెవరూ రాలేదు. అప్పుడు బయల్దేరినా ధర్నా ప్రారంభం అయ్యే సమయానికి సీఎం ఈడీ ఆఫీస్‌కు చేరుకునేవారని చెప్తున్నారు. కానీ మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో సీఎం ఈడీ ఆఫీస్‌కు చేరుకున్నారు. పెద్దగా బిజీ షెడ్యూల్ లేకున్నా.. ఎందుకు ఆలస్యం చేశారన్న చర్చ పార్టీ వర్గాల్లో సాగుతున్నది. పైగా కార్యక్రమం ప్రారంభమైన తర్వాత మంత్రులు, ఇతర ప్రముఖుల ప్రసంగాలు ముగిసినా సీఎం రాలేదు. దీంతో సమయం గడిపేందుకు కొందరు నేతలతో మాట్లాడించారని చెప్పుకుంటున్నారు.
ధర్నా ప్రధాన ఎజెండా.. అదానీ గ్రూప్ అవినీతి, సెబీ చైర్పర్సన్ పెట్టుబడులు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి తన ప్రసంగంలో తూతూమంత్రంగా అదానీపై విమర్శలు చేయడం కొత్త అనుమానాలకు తావిస్తున్నది. సీఎం 5 నిమిషాలపాటు ప్రసంగించారు. ఇందులో ప్రధాన అజెండా అయిన అదానీ, సెబీ ఛైర్పర్సన్ అవినీతిపై మాట్లాడింది కేవలం నాలుగు నిమిషాలే. అందులోనూ అదానీ పేరును ఏడుసార్లు మాత్రమే తలచుకున్నారు. సెబీ చైర్పర్సన్ రాజీనామా చేయాలని, లేకపోతే కేంద్ర ప్రభుత్వమే బర్తరఫ్ చేయాలన్నారే తప్ప.. ‘అదానీ అవినీతిపై కేంద్రం విచారణ జరపాలి’ అని డిమాండ్ చేయలేదని చెప్తున్నారు. మిగతా మంత్రులు, నేతలు అదానీపై ఎన్ని విమర్శలు చేసినా.. సీఎం మాత్రం ప్రధాన అజెండాను పక్కనబెట్టి తూతూమంత్రం విమర్శలకే ఎందుకు పరిమితం అయ్యారంటూ కాంగ్రెస్ వర్గాల్లోనే చర్చ జరుగుతున్నది.
సీఎం తన ప్రసంగంలో ఐదు నిమిషాలు మోదీ, అమిత్ షాను తిట్టడానికి కేటాయిస్తే, దాదాపు ఆరు నిమిషాలు జవహర్లాల్ నెహ్రూ నుంచి పీవీ వరకు కాంగ్రెస్ ప్రధానులను పొగడటానికి సరిపోయింది. మోదీ, అమిత్‌షా, అదానీ, అంబానీని దుష్టచతుష్టయంగా అభివర్ణించి.. నలుగురూ కలిసి దేశాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. హమ్ దో.. హమారే దో అన్నట్టుగా యావత్ ప్రపంచాన్ని దోచుకునేలా మోదీ, అమిత్‌షా వ్యహరిస్తున్నారని మండిపడ్డారు. దేశానికి బీజేపీ ముప్పులా మారిందన్నారు. దేశాన్ని ప్రధాని మోదీ అప్పుల ఊబిలో నెట్టారంటూ సందర్భం లేని వ్యాఖ్యలు చేశారు. ఇక.. ధర్నా అసలు ఉద్దేశం కన్నా బీఆర్ఎస్ను విమర్శించడానికి ఎక్కువ సమయం తీసుకున్నారు.
దాదాపు 10 నిమిషాలపాటు కేసీఆర్, కేటీఆర్‌పై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో కొన్నిరోజులుగా చెప్తున్న ఆవుకథనే మళ్లీ చెప్పారు. రాజీవ్‌గాంధీ గొప్పదనాన్ని వర్ణించడంతోపాటు సచివాలయం ముందు ఆయన విగ్రహాన్ని పెడతామని, దమ్ముంటే తొలగించాలని, దాడులు చేస్తామని.. ఇలా పాత ముచ్చట్లే చెప్పుకొచ్చారు. అదానీని, అసలు విషయాన్ని పక్కనపెట్టి.. అనవసరంగా కేసీఆర్‌ను, కేటీఆర్‌ను ఎందుకు విమర్శించారో అక్కడికి వచ్చిన నేతలకు కూడా అర్థం కాలేదు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క, శ్రీధర్‌బాబు, కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.
రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని, రైతులు రోడ్డెక్కొద్దని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఏ రైతుకు రుణమాఫీ కాకపోయినా.. సమస్య ఉన్నా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాలని సూచించారు. కలెక్టరేట్లల్లో అధికారులు కౌంటర్లు ఏర్పాటు చేశారని, వారికి సమస్యలు చెప్పుకోవాలని సూచించారు. ఆయా సమస్యలను పరిష్కరించి రుణమాఫీ చేస్తారని తెలిపారు.