హైదరాబాద్ సిటీబ్యూరో/అబిడ్స్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్, ఆటో డ్రైవర్ల కోసం రూ.5 లక్షల ప్రమాద బీమా తీసుకొస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. శనివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లోని గాంధీ దర్శన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో సీఎం గిగ్ వర్కర్ల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సామాజిక రక్షణ కల్పించటంలో తమ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని వెల్లడించారు. అసంఘటిత కార్మికుల ఉపాధి, సామాజిక భద్రతకు విధాన నిర్ణయం తీసుకుంటామని వివరించారు.
రాజస్థాన్‌లో చేపట్టిన చట్టాన్ని అధ్యయనం చేసి, వచ్చే బడ్జెట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. గివ్ అండ్ టేక్ పాలసీని పాటించని సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాలుగు నెలల క్రితం కుక్క తరిమితే భవనం పై నుంచి పడి మృతి చెందిన స్విగ్గీ బాయ్ కుటుంబానికి సీఎం సహాయనిధి నుంచి రూ.2 లక్షలు అందించాలని అధికారులను ఆదేశిస్తున్నానని తెలిపారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన గ్రామసభలు నిర్వహిస్తున్నామని, అక్కడ దరఖాస్తుల్లో వివరాలు అందించాలని క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్, ఆటో డ్రైవర్లకు సూచించారు.
సమావేశానంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 5 లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్నట్టు అంచనా వేస్తున్నామని, వారిని కనీస వేతనాల పరిధిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఆటో కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారు కూడా తెలంగాణ బిడ్డలేనని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, ఏఐసీసీ సెక్రటరీలు రోహిత్ చౌదరి, మన్సూర్ అలీఖాన్, మధుయాష్కీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.