KTR | హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనలో భాగంగా తెలంగాణ నిర్మాణాత్మక ప్రగతికి దోహదపడేలా పెట్టుబడులు తీసుకొనిరావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆకాక్షించారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బృందం తలపెట్టిన అమెరికా, దక్షిణ కొరియా పర్యటన విజయవంతం కావాలని ఆదివారం ఒక ప్రకటనలో అభిలషించారు. గత పదేండ్లలో అనేక మల్టీ నేషనల్ కంపెనీలను, ప్రపంచ దిగ్గజ సంస్థలను హైదరాబాద్‌కు తీసుకు రాగలిగామని వివరించారు. ఆయా కంపెనీలతో తెలంగాణకు ప్రత్యేక అనుబంధం ఏర్పరచగలిగామని ఉదహరించారు.రాష్ట్రంలో ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న దిగ్గజ కంపెనీలతో తెలంగాణకు బలమైన వ్యాపార బంధం ఏర్పడిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న అద్భుతమైన వ్యాపార, వాణిజ్య విధానాలు, టీఎస్ ఐపాస్ అనుమతుల ప్రక్రియ వంటి వాటి వలన ఇప్పటికే తెలంగాణకు తాము తీసుకొచ్చిన కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికలో కూడా రాష్ట్రానికి ప్రాధాన్యం ఇస్తున్నాయని కేటీఆర్ గుర్తుచేశారు.
కేసీఆర్ సారథ్యంలో విప్లవాత్మక విధానాలు
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో పదేండ్లలో విధానపరమైన, విప్లవాత్మక నిర్ణయాలతోపాటు మౌలిక వసతుల కల్పన ద్వారా తెలంగాణకు పెట్టుబడుల ఆకర్షణలో ప్రత్యేక స్థానాన్ని కల్పించగలిగామని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రానికి రూ.నాలుగు లక్షల కోట్లకుపైగా పెట్టుబడులను తీసుకురావడంతోపాటు 24 లక్షల ఉపాధి అవకాశాలను ప్రైవేటు రం గంలో సృష్టించిన విషయాన్ని ఉదహరించారు. ముఖ్యమంత్రి ప్రతినిధి బృందం ఇలాంటి కంపెనీలతో మరోసారి చర్చలు నిర్వహిస్తున్న నేపథ్యంలో రాష్ర్టానికి మరి న్ని పెట్టుబడులు వస్తాయని ఆకాంక్షించారు. ప్రస్తుత ప్రభుత్వం తాము దశాబ్దకాలంగా నిర్మించిన బలమైన పెట్టుబడుల పునాదులపై మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పించాలని అభిలషించారు.