హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 7 (నమస్తే తెలంగాణ): ఉత్తర తెలంగాణలోని ఆరు జిల్లాల ప్రజల దశాబ్దాల కల త్వరలోనే నెరవేరబోతున్నదని, ఈ ప్రాంత అభివృద్ధికి మార్గాలు తెరుచుకోనున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్-రామగుండం రాజీవ్ రాహదారిలో పరేడ్ గ్రౌండ్ నుంచి తూంకుంట వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. అల్వాల్‌లోని టిమ్స్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రూ. 2,232 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ కారిడార్‌తో ఉత్తర తెలంగాణతోపాటు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజల రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని, వాహనదారుల ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పారు. పరేడ్ గ్రౌండ్ నుంచి తూంకుంట వరకు, ప్యారడైజ్ నుంచి కండ్లకోయ వరకు కారిడార్ల నిర్మాణం పూర్తయితే ఆరు జిల్లాల ప్రజలకు ప్రయాణ సమయం, ఇంధన వ్యయ భారం తగ్గుతుందని అన్నారు. ప్రజావసరాలను పరిగణనలోకి తీసుకొని దశాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు కోసం రక్షణ శాఖ నుంచి భూములను సేకరించామని తెలిపారు. మల్కాజిగిరి ఎంపీగా ఉన్నప్పటి నుంచి ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని పలుమార్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. ఇటీవల తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ అంశంపై రాజ్‌నాథ్‌సింగ్‌తో మరోసారి చర్చించడంతో భూముల బదలాయింపు ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ఈ కారిడార్ నిర్మాణం పూర్తయితే నేరుగా ఓఆర్ఆర్ వరకు చేరుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తోపాటు, ఎంఏయూడీ డైరెక్టర్ దానకిశోర్, హెచ్ఎండీఏ, రక్షణ శాఖ అధికారులు పాల్గొన్నారు.
బంజారాహిల్స్ : అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సుమారు నాలుగు దశాబ్దాలపాటు దేశరాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన భారత మాజీ ఉపప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. బంజారాహిల్స్ రోడ్ నెం 10లో నిర్మించిన బాబూ జగ్జీవన్‌రామ్ భవన్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో దళితబహుజనులు ముందు వరుసలో ఉండి పోరాడారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ఆమోదించే సమయంలో స్పీకర్‌గా ఉన్నది జగ్జీవన్‌రామ్ కుమార్తె మీరాకుమార్ అని గుర్తుచేశారు. తెలంగాణ ప్రజలు మీరా కుమార్‌ను ఎన్నటికీ మర్చిపోరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, విప్ లక్ష్మణ్, ఎమ్మెల్యేలు సత్యనారాయణ, మందుల సామేలు, స్థానిక కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి, దళిత సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పాతబస్తీ మెట్రో పనులకు శుక్రవారం సాయంత్రం ఫలక్‌నుమా ఫరూఖ్‌నగర్ బస్ డిపో సమీపంలో సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. దారుల్షిఫా నుంచి మొదలై పురానీహవేలీ, ఐతెబార్ చౌక్, అలీజాకోట్ల, మీర్ మొయిన్ దైరా, హరిబౌలి, శాలిబండ, శంషేర్‌గంజ్, ఆలియాబాద్ మీదుగా ఫలక్‌నుమా ప్యాలెస్ వరకు 5.5 కి.మీ పొడవున మెట్రో మార్గాన్ని నిర్మించనున్నారు ఈ మార్గంలో నాలుగు మెట్రో స్టేషన్లు ఉంటాయి. ఈ మార్గం నిర్మాణానికి రూ.2వేల కోట్ల వ్యయం కానుంది.
మొదటిదశలో ఉన్న పాతబస్తీ మెట్రోను మళ్లీ రెండో దశలో చేర్చడం, తాజాగా పాతబస్తీ మెట్రోలో 5.5 కిమీ మార్గానికి శంకుస్థాపన చేయడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండటంతో హడావుడిగా రెండో దశ మెట్రో ప్రాజెక్టు అంటూ పాతబస్తీ మెట్రోను 5.5 కిమీ మేర మాత్రమే నిర్మించేందుకు శంకుస్థాపన ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో జరిగే ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకే రెండోసారి శంకుస్థాపన చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.