దళితబంధు పథక ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దళితబంధును విజయవంతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ‘పట్టుబట్టి, జట్టు కట్టి దళిత జాతిని బాగు చేసుకుందాం. దళిత జాతిలో ఉన్న రత్నాలను వెలికితీద్దాం. జాతిలో ఉన్న శక్తిని బయటకు తీద్దాం. ఆ శక్తితో రాష్ట్ర సంపద పెరుగుతుంది. ఆర్థిక ప్రగతి కూడా రాష్ర్టానికి దోహదపడుతుంది. దళిత ఉద్యోగులు, రచయితల సభలు మొదలుపెడుతాం. ఈ పథకం అమలుకు చర్చలు చేపడుతాం’ అని చెప్పారు.
‘దళిత బంధు పథకం గురించి నా భార్యను అడిగిన. తప్పకుండా చెయ్యు, గెలుస్తావు అని ఆశీర్వాదం ఇచ్చింది. నా జీవితంలో ఏది చేపట్టిన వెనుకకు పోలేదు. ముందుకే పోయిన. యావత్ తెలంగాణ హర్షించే విధంగా, భారతదేశమే ఆశ్చర్యపడే విధంగా మనం ముందుకు పోవాలె. ఓపిక, ఓర్పు, నేర్పు, సహనశీలత అవసరం. ఈ స్కీం అమలులో జిల్లా కలెక్టర్లు ప్రధాన పాత్ర పోషిస్తారు. అందరం కలిసి ముందుకు పోవాలె. అందరం కలిసి పట్టుబట్టి సాధించాలి’ అని వెల్లడించారు. చివరగా.. జై దళితబంధు.. జై భీమ్.. జై హింద్.. జై తెలంగాణ అని ప్రసంగాన్ని ముగించారు.