Ramadan | చార్మినార్, ఏప్రిల్ 21: నెల రోజులపాటు సాగిన పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షలు నేటితో ముగియనున్నాయి. శుక్రవారం రాత్రి ఆకాశంలో నెలవంక కనిపించడంతో షెవ్వాల్ నెల ఆరంభమైనట్టు మక్కా మసీదు ఖతీబ్ మహ్మద్ రిజ్వాన్ ఖురేషీ ప్రకటించారు. శనివారం రంజాన్ ఈద్-ఉల్-ఫితర్ జరుపుకోవాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. మక్కా మసీదులో ఉదయం 10 గంటలకు ఇమామ్ హఫీజ్ మహ్మద్ లతీఫ్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారని తెలిపారు. మీరాలం ఈద్గాలో ఖతీబ్ మహ్మద్ రిజ్వాన్ ప్రత్యేక ప్రార్థనలను నిర్వహిస్తారని చెప్పారు. ఈదుల్ ఫితర్ సందర్భంగా హైదరాబాద్‌లో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని దక్షిణ మండల డీసీపీ సాయిచైతన్య తెలిపారు. మీరాలం ఈద్గా ప్రార్థనల సందర్భంగా 20 మంది డీఎస్పీలు, 600 మంది పోలీస్ బలగాలను మొహరిస్తున్నామని వివరించారు. చార్మినార్ పరిసర ప్రాంతాల్లోనూ ఆర్ఏఎఫ్, నగర ప్రత్యేక బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నామని తెలిపారు.
హైదరాబాద్, (నమస్తే తెలంగాణ): ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ ఉపవాస దీక్షల ద్వారా పరిఢవిల్లిన క్రమశిక్షణ, సహోదరత్వం, దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన స్ఫూర్తితో ‘ఈద్-ఉల్-ఫితర్’ పర్వదిన వేడుకలను కుటుంబసభ్యులు, బంధుమిత్రులందరితో కలిసి సంతోషంగా జరుపుకోవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. అల్లా దీవెనలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా కలిసిమెలిసి సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థించారు.
గంగా జమునా తెహజీబ్‌కు తెలంగాణ నేల ఆలవాలమని, లౌకికవాదాన్ని, మత సామరస్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటిలాగే కట్టుబడి ఉన్నదని పునరుద్ఘాటించారు. విద్య, ఉపాధితోపాటు పలు రంగాల్లో ఆసరానందిస్తూ ముస్లింలకు భరోసాగా నిలిచిందని వివరించారు. వారి జీవితాల్లో గుణాత్మక మార్పు కోసం అమలు చేస్తున్న పలు పథకాలు ఫలితాలనిస్తున్నాయని తెలిపారు. స్వయం పాలనలో గడచిన తొమ్మిదేండ్లలో మైనారిటీ సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.13 వేల కోట్లు కేటాయించి ఖర్చు చేస్తున్నదని వివరించారు. మైనారిటీల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పలు పథకాలు, ప్రగతి కార్యాచరణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, వారి అభివృద్ధి సంక్షేమం కోసం నిరంతర కృషి కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు. ముస్లిం మైనారిటీ అభివృద్ధి మాడల్‌ను దేశవ్యాప్తంగా విస్తరింపజేసేందుకు కృషి కొనసాగుతూనే ఉంటుందన్నారు.