హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించి నిధులు మంజూరు చేయాలని, హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని ఆరు లేన్లకు విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం ఆయన ఢిల్లీలో జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై రాష్ట్రంలోని పలు రహదారుల విస్తరణ, కొత్తగా ప్రకటించాల్సిన జాతీయ రహదారుల గురించి ప్రస్తావించారు.
ట్రిపుల్‌ఆర్‌లో 181.87 కి.మీ. పొడవైన దక్షిణ భాగాన్ని కూడా జాతీయ రహదారిగా ప్రకటించి, ఈ ఏడాది ఎన్హెచ్ఏఐ వార్షిక ప్రణాళికలో నిధులు మంజూరు చేయాలని కోరారు. హైదరాబాద్ (ఓఆర్ఆర్ గౌరెల్లి జంక్షన్) నుంచి వలిగొండ-తొర్రూర్-నెల్లికుదురు-మహబూబాబాద్-ఇల్లెందు -కొత్తగూడెం వరకు ఉన్న జాతీయ రహదారి (ఎన్‌హెచ్-930పీ)లో మిగిలిన మూడు ప్యాకేజీల (165 కి.మీ) పనులను త్వరగా చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార, ఆర్అండ్బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ, చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ ఉన్నారు.