హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో వెలుగుచూసిన కిడ్నీ రాకెట్ కేసులో ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను చెన్నైలో అరెస్టు చేసినట్టు డీజీ శిఖాగోయెల్ గురువారం వెల్లడించారు. రంగారెడ్డి జిల్లాలోని అలకనంద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో వెలుగుచూసిన కిడ్నీ అక్రమ మార్పిడి వ్యవహారంపై నమోదైన కేసును సీఐడీ విచారిస్తున్నది.
ఇప్పటికే ఈ కేసులో 13 మంది నిందితులను అరెస్టు చేసిన అధికారులు, ఈ నెల 26న కీలక నిందితులైన శంకరన్ (56), ఎన్ రమ్య(36)ను చెన్నైలో అరెస్టు చేశారు. ట్రాన్సిట్ రిమాండ్‌పై హైదరాబాద్‌కు తీసుకువచ్చి న్యాయమూర్తి ముందు హాజరు పరిచినట్టు వెల్లడించారు. ఈ ముఠా తమిళనాడులోని నిరుపేదులను ఉద్యోగ భరోసా పేరుతో హైదరాబాద్‌కు తీసుకొచ్చి, కిడ్నీలు తీయించి మార్పిడి చేయిస్తున్నట్టు విచారణలో తేలింది. కిడ్నీ మార్పిడికోసం నిందితులు రూ.10 లక్షల వరకు దందా చేసేవారని తెలుస్తున్నది.