సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్యను భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సత్తుపల్లిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ తరఫున నిలబడ్డ ఎవన్ని కూడా నేను అసెంబ్లీ వాకిలి తొక్కనియ్యనని జిల్లాకు చెందిన ఒకడు శపథం చేశాడని, అది అయ్యేపని కాదని సీఎం అన్నారు. నియోజకవర్గ ప్రజలంతా తలుచుకుంటే సత్తుపల్లిలో దుమ్మురేగదా..? అని సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రశ్నించారు.
అంబులెన్స్ కంటే వేగంగా ప్రజల మధ్యకు సండ్ర
సీఎం కేసీఆర్ ఇంకా ఏమన్నారంటే.. ‘సత్తుపల్లిలో సండ్ర వెంకట వీరయ్యకు ఒక పేరుంది. నియోజకవర్గంలోని ఏ మండలం నుంచి గానీ, ఏ ఊరు నుంచి గానీ, ఎవరు గానీ సమస్య ఉందని ఫోన్ చేస్తే చాలు క్షణంలో అక్కడ పక్షిలా వాలిపోతడు. ఆపద్భందు వాహనం, అంబులెన్స్ అయినా ఆలస్యం అయితయేమోగానీ, వీరయ్యగారు ఆలస్యంగా రారని ఇక్కడి ప్రజలు చెప్తరు. ప్రజల మధ్య ఉండి ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి సండ్ర వెంకట వీరయ్య’ అని సీఎం కొనియాడారు.
‘ఈ సభకు హాజరైన మిమ్ములందరినీ చూస్తుంటే ఒక్క విషయం తేలిపోయింది. సత్తుపల్లిలో మీ అందరి ఆశీస్సులతో వీరయ్య 80 వేల మెజార్టీతో గెలుస్తారని క్లియర్‌గా అర్థమవుతున్నది. ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే హెలిక్యాప్టర్ నుంచి చూస్తే వందల వేల ట్రాక్టర్లు రోడ్ల మీద ఉన్నయ్. చాలా మంది వస్తున్నరు. ఈ గ్రౌండ్, సభ సరిపోత లేదు. అది వెంకట వీరయ్య మీద ప్రజలకు ఉన్న అభిమానం’ అని సీఎం పొగడ్తల్లో ముంచెత్తారు.
ఆంధ్రా కంటే మంచిగ బతుకుతున్నం
అదేవిధంగా తెలంగాణలో జిరగిన అభివృద్ధి గురించి మాట్లాడుతూ.. ‘మనం ఎవరితోనైతే విడిపోయినమో అదే బార్డర్ల మీరున్నరు. వాళ్ల రోడ్లు ఎట్లున్నయో, మన రోడ్లెట్టున్నయో చూడండి. అదే మన అభివృద్ధికి నిదర్శనం. సింగిల్ రోడ్డు ఉంటే ఆంధ్రా అన్నట్టు. డబుల్ రోడ్డు ఉంటే తెలంగాణ అన్నట్టు. రాష్ట్ర విభజన సందర్భంలో ఆంధ్రా నుంచి విడిపోతే మీరు ఎట్ల బతుకుతరని మన కోసం వాళ్లు బెంగటిల్లిర్రు. కానీ ఇప్పుడు వాళ్లకంటే మనమే బ్రహ్మాండంగా ఉన్నం. మన దగ్గరే వెలుగుజిలుగులు ఉన్నయ్. వాళ్లు కారు చీకట్లలో ఉన్నరు’ అని సీఎం చెప్పారు.
ప్రధాని మోదీకి ప్రైవేటైజేషన్ పిచ్చి
‘నరేంద్రమోదీకి ఒక పిచ్చి ఉన్నది. అదేందంటే ప్రతీది ప్రైవేటైజ్ చేయడం. మాట్లాడితే ప్రైవేటైజేషన్ అంటడు. ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రైవేటైజ్ చేసుకుంట వస్తున్నడు. తెలంగాణలో కూడా ఎన్నో అభివృద్ధి పనులు చేసినం. కానీ ప్రైవేటైజేషన్‌కు తావులేదు. పదేళ్లలో ఏదీ ప్రైవేటైజ్ చేయలే. అంతేకాదు గతంలో మోదీ మోటార్లకు మీటర్లు పెడ్తం అన్నడు. తెలంగాణలో కూడా పెట్టకపోతే ఏటా రూ.5 వేల కోట్ల నిధుల కోత పెడ్తమని హెచ్చరించిండు. కానీ నేను ఒప్పుకోలే. నేను సావనైనా సస్తగానీ మోటార్లకు మీటర్లు పెట్టేది లేదని తెగేసి చెప్పిన. ఐదేళ్లలో రూ.25 వేల కోట్ల నష్టాన్ని భరించిన గానీ మోటార్లకు మీటర్లు పెట్టలే’ అని సీఎం తెలిపారు.