కోదాడ: ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు ప్రజలు ఎంతో విజ్ఞతతో ఆలోచన చేయాలని, ఏ పార్టీకి ఓటేస్తే రాష్ట్రం బాగుపడుతదో, ఏ అభ్యర్థికి ఓటు వేస్తే బాగా పని చేస్తడో అనేది బాగా ఆలోచించి ఓటు వేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సూచించారు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యిందని, ఇప్పటికీ ఎవరో చెప్పిన మాట విని ఓటు వేయకూడదని, సొంతంగా ఆలోచించి అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఎం చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కోదాడలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఓటు అనేది మన చేతిలో ఉండే ఒకే ఒక బ్రహ్మాస్త్రం అని, ప్రజాస్వామ్యంలో దాన్ని మించిన శక్తి లేదని, కాబట్టి ప్రజలు ఆ ఓటును సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. ఒకప్పుడు కోదాడలో పంట పొలాలకు నీళ్ల కోసం ప్రతిసారి ధర్నా చేయాల్సి వచ్చేదని, లొల్లి పెట్టాల్సి వచ్చేదని సీఎం గుర్తుచేశారు. 2003లో పంట పొలాలకు నీళ్లు ఆపేస్తే కొంతమంది తన దగ్గరికి వచ్చారని, అప్పుడు తానే 60, 70 మంది స్థానికులతో నాగార్జునసాగర్ డ్యామ్ దగ్గిరికి వచ్చానని, వెంటనే నీళ్లు ఇయ్యకపోతే బాగుండదని అల్టిమేటం ఇచ్చామని, దాంతో వెంటనే నీళ్లు వచ్చాయని సీఎం తెలిపారు.
బంగారం లాంటి తెలంగాణ నిజాం నుంచి విడిపోయి బూర్గుల నాయకత్వంలో కాంగ్రెస్ ఏలుబడిలోకి వెళ్లిందని, ఆ తర్వాత కాంగ్రెస్ కుటిల నీతితో ఈ ప్రాంతాన్ని ఆంధ్రాతో కలిపేశారని ముఖ్యమంత్రి విమర్శించారు. సమైక్యాంధ్రలో కాంగ్రెస్ పాలకులు తెలంగాణలో సాగుబడిని పట్టించుకోకుండా ఆంధ్రాకు నీళ్లు తరలించుకుపోయారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా అప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నోరు మూసుకుని పడిఉన్నరని అన్నారు. దద్దమ్మల్లా మారు మాట్లాడలేదని మండిపడ్డారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్టును కట్టాల్సిన చోట కాకుండా దిగువకు తీసుకొచ్చిండ్రని సీఎం ఆరోపించారు. ఏలేశ్వరం దగ్గర కాకుండా 20 కిలోమీటర్ల దిగువన ప్రాజెక్టును కట్టడంతో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందని, తెలంగాణకు నీళ్లు రాకుండా పోయినయని సీఎం అన్నారు. నాడు కాంగ్రెస్ పాలకులు చేసిన తప్పులకు ఇప్పుడు మనం శిక్ష అనుభవిస్తున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాటి కాంగ్రెస్ పాలకుల కుట్రలపై సీఎం కేసీఆర్ ప్రశ్నల వర్షం కురిపంచారు.
‘ఉన్న హైదరాబాద్ రాష్ట్రాన్ని ఊడగొట్టింది ఎవరు..? తెలంగాణలో ప్రాజెక్టులను కట్టకుండా ఆపింది ఎవరు..? ఇంత జరుగుతున్నా మారు మాట్లాడకుండా నోరు మూసుకుని పడి ఉన్న దద్దమ్మలు ఎవరు..? ఏ పార్టీ వాళ్లు..? ఇదంతా ఓ చరిత్ర. 2001లో నేను గులాబీ జెండా ఎగరేసి ఈ అన్యాయాలపై నిలదీసిన దాక అడిగిన మొగోడే లేడు. ఈ జిల్లాలో మంత్రులు లేకుండెనా..? చాలా మంది ఉండె. కానీ వాళ్లు ఎన్నడూ సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రులతో కొట్లాడి నల్లగొండ జిల్లాకు నీళ్లు తేలే. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీళ్లకు ఇబ్బంది లేదు’ అని సీఎం వెల్లడించారు.
కాళేశ్వరం జలాలను మూసీ దాటించి ఉదయం సముద్రంలో కలిపితే ఇక తెలంగాణకు నీళ్ల కరువు రాదని సీఎం కేసీఆర్ అన్నారు. తాము ప్రజల మేలు కోసం ఇలాంటి ఆలోచనలు చేస్తున్నామని చెప్పారు. కానీ అవతలి పార్టీల వాళ్లకు ఈ సోయి లేదని విమర్శించారు. వాళ్లకు కావాల్సింది ప్రజల ఓట్లే తప్ప మేలు కాదని విమర్శించారు.