CEO Vikas Raj | హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడమే తమ లక్ష్యమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్‌రాజ్ తెలిపారు. ప్రలోభాలపై ప్రత్యేక నిఘా పెట్టామని, డబ్బు, మద్యం, గిఫ్టులు వంటివి పంపిణీ చేయకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఒకవేళ పట్టుబడితే వాటిని తరలించినవారితోపాటు వాటివెనుక ఎవరున్నారో గుర్తించడంపై దృష్టిపెట్టినట్టు వెల్లడించారు. వికాస్‌రాజ్ శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. పోలింగ్ రోజును సెలవు రోజుగా పరిగణించవద్దని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటినుంచే రాష్ట్రవ్యాప్తంగా వాహనాల తనిఖీల ప్రక్రియ కొనసాగుతున్నదని వికాస్‌రాజ్ తెలిపారు. అనుమానాస్పదంగా తరలిస్తున్న డబ్బు, మద్యం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పారు. వాటిని ఏయే మార్గాల్లో సేకరించారు? వీటి వెనుక ఎవరున్నారో (కింగ్‌పిన్స్) తెలుసుకోవడంపై దృష్టిపెట్టినట్టు వెల్లడించారు. ఇందుకోసం ఇంటెలిజెన్స్ వర్గాల సహాయం తీసుకుంటున్నామని తెలిపారు. డిజిటల్ పేమెంట్స్‌పై కూడా దృష్టి సారించామని, ఆర్బీఐ, బ్యాంకర్లతో సమన్వయం చేసుకుంటున్నామని చెప్పారు. అనుమానిత లావాదేవీలపై సమాచారం అందిన వెంటనే పరిశీలిస్తామని పేర్కొన్నారు. సోషల్‌మీడియాలో అసత్య ప్రచారాలు చేయవద్దని సూచించారు. హద్దు దాటితే ఐటీ చట్టం ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రజలు రూ.50 వేలకు మించి నగదును తరలించవద్దని వికాస్‌రాజ్ సూచించారు. అంతకుమించి నగదు తీసుకెళ్లేవారు సంబంధిత పత్రాలు, రశీదులు వెంట తీసుకెళ్లాలని కోరారు. డబ్బును స్వాధీనం చేసుకోవడం వల్ల కొందరు సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. జిల్లా స్థాయిలో ముగ్గురు సభ్యుల కమిటీని నియమించామని, వారికి సరైన పత్రాలు అందజేస్తే పరిశీలించి, డబ్బును విడుదల చేస్తారని తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాలు కొనసాగించాలా? వద్దా? అనేదానిపై ఇప్పటికే స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని చెప్పారు. ఒకవేళ ఏదైనా అవసరం ఉంటే ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను సంప్రదించవచ్చునని పేర్కొన్నారు. బతుకమ్మ ఉత్సవాల నిర్వహణపై ప్రభుత్వం ఇచ్చిన దరఖాస్తును కేంద్ర ఎన్నికల సంఘానికి పంపినట్టు వెల్లడించారు.
ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు తప్పకుండా నిబంధనలు పాటించాలని వికాస్‌రాజ్ స్పష్టం చేశారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే అభ్యర్థుల ప్రచారశైలి, చేస్తున్న ఖర్చు వంటివాటిని ఎన్నికల పరిశీలకులు క్షుణ్ణంగా పరిశీలిస్తారని చెప్పారు. వీడియో రికార్డింగ్ కూడా చేస్తామని, షాడోటీమ్స్ను రంగంలోకి దించుతామని వెల్లడించారు. సంప్రదాయ మీడియాతోపాటు సోషల్ మీడియాలో చేసే ప్రచారం కూడా ఎన్నికల ఖర్చులోకి వస్తుందని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరిగే ప్రచారంపై ప్రత్యేక నిఘా ఉంటుందని హెచ్చరించారు. అభ్యర్థులు నామినేషన్ సమయంలోనే సంపూర్ణమైన, సరైన సమాచారం ఇవ్వాలని, లేదంటే న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు.
రాష్ట్రంలో 35 సమస్యాత్మక నియోజకవర్గాలను గుర్తించినట్టు వికాస్‌రాజ్ వెల్లడించారు. సమస్యాత్మకం అంటే కేవలం అల్లర్లు జరిగే నియోజకవర్గాలు కాదని స్పష్టం చేశారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తే ప్రాంతాలు, డబ్బు, మద్యం అధికంగా ప్రభావం చూపే ప్రాంతాలు, గతంలో ఎక్కువగా కేసులు నమోదైన ప్రాంతాలు, రాజకీయంగా, సామాజికంగా సున్నితమైన ప్రాంతాలు వంటివాటిని ఈ క్యాటగిరీలో చేర్చినట్టు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతానికి మత ఘర్షణల సమస్య ఎక్కడా లేదని, గతంలో ఇలాంటి సంఘటనలు నమోదైన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు.
ఎన్నికల నిర్వహణకు మొత్తం 65 వేల బలగాలను వినియోగిస్తున్నట్టు వికాస్‌రాజ్ వెల్లడించారు. ఇందులో రాష్టంలో 40 వేల బలగాలు ఉన్నాయని వివరించారు. పొరుగు రాష్ర్టాల నుంచి 20 వేల బలగాలు, కేంద్రం నుంచి 300 కంపెనీల బలగాలు కావాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు. ప్రస్తుతం 100 బలగాల వినియోగానికి అనుమతి వచ్చిందని తెలిపారు. ఎన్నికల నాటికి మిగతా బలగాలను కేటాయించే అవకాశం ఉన్నదని, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టామని వివరించారు.
రాష్ట్రంలో గత ఎన్నికల్లో తక్కువ ఓటింగ్ నమోదైన 29 నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిపెట్టినట్టు వికాస్‌రాజ్ తెలిపారు. ఇందులో 24 నియోజకవర్గాలు గ్రేటర్ పరిధిలో ఉన్నాయని చెప్పారు. ఆయా చోట్ల ఈ దఫా పోలింగ్‌శాతం పెంచేందుకు కార్యాచరణ రూపొందించినట్టు చెప్పారు. ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నదని తెలిపారు. ‘పోలింగ్ రోజును సెలవు రోజుగా చూడొద్దు’ అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోలింగ్‌రోజు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సెలవు ఇచ్చింది ఇంటివద్ద ఉండటానికి కాదని, బాధ్యతగా వచ్చి ఓటేయడానికేనని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ తమ పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటేయాలని పిలుపునిచ్చారు.
ఈవీఎంలను కచ్చితంగా ఆర్టీసీ బస్సుల్లోనే తరలించేలా ఏర్పాట్లు చేశామని వికాస్‌రాజ్ వెల్లడించారు. ఈవీఎంలు తీసుకెళ్లే ప్రతి వాహనానికి జీపీఎస్ ట్రాకర్‌ను అమర్చుతున్నామని, తద్వారా ప్రతి వాహనం కదలికలపై నిఘా ఉంటుందని చెప్పారు. ఒకవేళ ఆయా వాహనాలు ఎక్కడైనా దారి తప్పినట్టు అనుమానం వస్తే వెంటనే రాష్ట్ర స్థాయిలోని కమాండ్ కంట్రోల్లో గుర్తిస్తామని తెలిపారు. ఎన్నికల అధికారులు కూడా ప్రైవేట్ వాహనాల్లో వెళ్లవద్దని, ప్రభుత్వం సమకూర్చిన అధికారిక వాహనాల్లోనే ప్రయాణించాలని ఆదేశాలు జారీచేసినట్టు వెల్లడించారు.
రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించాలన్నదే తమ అంతిమ లక్ష్యమని వికాస్‌రాజ్ చెప్పారు. ఒకే దఫాలో 119 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించడం ‘బిగ్‌టాస్క్’గా అభివర్ణించారు. దాదాపు 20 విభాగాలకు చెందిన సిబ్బందిని ఒకేచోటికి చేర్చి, అందరినీ సమన్వయం చేసుకుంటూ ఎన్నికలు నిర్వహించడం కఠిన పరీక్షేనని చెప్పారు. ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది సిబ్బందిని వినియోగిస్తున్నామని చెప్పారు. మారుమూల ప్రాంతాల్లోని 150 పోలింగ్ స్టేషన్లకు సెల్‌ఫోన్ సిగ్నల్ రాదని గుర్తించామని, అక్కడ పోలీసుల సెట్స్ వాడటం వంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని తెలిపారు.
గతంలో వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకొని ఓటర్ స్లిప్పుల పంపిణీపై ప్రత్యేక దృష్టిపెట్టినట్టు వికాస్‌రాజ్ వెల్లడించారు. నామినేషన్లు పూర్తయిన మరుసటి రోజు నుంచే ఓటరు స్లిప్పులను పంపిణీ చేయాలని బీఎల్వోలను ఆదేశించామని చెప్పారు. ఈ ఏడాది కొత్తగా నమోదైన ఓటర్లకు నూతన ఓటర్కార్డులను పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. కార్డులు ఆకర్షణీయమైన రంగుల్లో, ట్యాంపరింగ్‌కు అవకాశం లేకుండా లోగోతో ఉంటాయని చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల కోసం తాగునీరు, నీడ, వృద్ధుల కోసం కుర్చీలు, ప్రత్యేక క్యూలైన్లు, దివ్యాంగుల కోసం వీల్చైర్లు, మూత్రశాలలు తదితర సదుపాయాలు కల్పిస్తామని వివరించారు.
ఎన్నికల ప్రచారం, పోలింగ్ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నవారిపై ప్రజలు నేరుగా తమకు ఫిర్యాదు చేయొచ్చని వికాస్‌రాజ్ చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా ‘సీ విజిల్’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. యాప్ ద్వారా ఇచ్చే ఫిర్యాదులు నేరుగా తమకు చేరుతాయని, వెంటనే చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. తమ ఓటు వివరాలు, పోలింగ్ కేంద్రం వివరాలను తెలుసుకునేందుకు ‘ఓటరు సహాయ మిత్ర’, ఓటర్ హెల్ప్‌లైన్ పేర్లతో యాప్‌లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.