హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఈ నెల 30న నిర్వహించనున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు విస్తృత ఏర్పాట్లు చేసినట్టు సీఈవో వికాస్‌రాజ్ తెలిపారు. ఈ నెల 29న డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల ద్వారా పోలింగ్ సామగ్రిని పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఆదివారం ఆయన బీఆర్కేఆర్ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 12 వేల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, ఆయా కేంద్రాల్లో వెబ్‌క్యాస్టింగ్‌కు ఏర్పాట్లు చేస్తామని వివరించారు. ఒకేచోట ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉంటే బయట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎన్నికల విధుల్లో అన్ని విభాగాల నుంచి మొత్తం 2.50 లక్షల మంది సిబ్బంది పాల్గొంటున్నారని, మైక్రో అబ్జర్వర్లుగా 22 వేల మందిని నియమించామని వెల్లడించారు. శాంతిభద్రతల పరిరక్షణ, బందోబస్తు విధుల్లో 45 వేల మంది తెలంగాణ పోలీసులు, ఇతర రాష్ర్టాలకు చెందిన 23,500 మంది హోంగార్డులు పాల్గొంటారని తెలిపారు. వీరితోపాటు 3 వేల మంది తెలంగాణ ఎక్సైజ్, అటవీశాఖ సిబ్బంది, 50 కంపెనీల టీఎస్ఎస్పీ సిబ్బంది, 375 కంపెనీల కేంద్ర బలగాలను వినియోగిస్తామని వివరించారు.
ఏకే గోయల్ ఇంట్లో ఏమీ దొరకలేదు
మాజీ ఐఏఎస్ అధికారి ఏకే గోయల్ నివాసంలో నిర్వహించిన తనిఖీల్లో ఏమీ లభ్యం కాలేదని ప్రాథమిక నివేదికలో వెల్లడైందని వికాస్‌రాజ్ వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.709 కోట్ల విలువైన వస్తువులు, నగదు, మద్యం, ఇతర సామగ్రిని సీజ్ చేశామని తెలిపారు.
దివ్యాంగులకు ఉచిత రవాణా
రాష్ట్రంలో ఇప్పటివరకు 54.39 లక్షల ఓటరుకార్డులను ముద్రించామని, మిగిలిన వాటి పంపిణీకి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. దివ్యాంగులకు పోలింగ్ కేంద్రాల వద్ద 18 వేల వీల్చైర్లను ఏర్పాటు చేశామని, రిటర్నింగ్ అధికారి ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తారని చెప్పారు.
ఓటేసిన 96 వేల మంది ఉద్యోగులు
ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్లు, హోం ఓటింగ్ ద్వారా 1,23,186 ఓటు హక్కు వినియోగించుకున్నారని వికాస్‌రాజ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ విధుల్లో ఉన్న 1,68,612 మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోగా ఇప్పటికే 96,526 మంది ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటుహక్కు వినియోగించుకున్నారని వెల్లడించారు. ఫెసిలిటేషన్ సెంటర్లో ఇంకా ఓటింగ్‌కు అవకాశం ఉన్నదని చెప్పారు. విధుల్లో ఉన్న ఉద్యోగులు 2018 ఎన్నికల్లో 1,00,135 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారని తెలిపారు. సాధారణ ఎన్నికల్లో మొదటిసారిగా ప్రవేశపెట్టిన హోం ఓటింగ్ పూర్తి అయిందని, 26,660 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారని వెల్లడించారు.
పోస్టల్ బ్యాలెట్లకు ప్రత్యేక టేబుళ్లు
ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా ఉన్నందున వీటి లెక్కింపునకు ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని, ప్రతి 500 పోస్టల్ ఓట్లకు ఒక టేబుల్ ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. ఇవి ఈవీఎం ఓట్ల లెక్కింపు టేబుల్స్‌కు అదనమని స్పష్టంచేశారు. రాష్ట్రంలో 41 కేంద్రాల్లో 119 కౌంటిం గ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించా రు. రంగారెడ్డి జిల్లాలో 4, హైదరాబాద్‌లో 14 ప్రాంతాల్లో లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశామని, 31 జిల్లాల్లో కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. బీఆర్ఎస్ ఫిర్యాదులపై స్పందించామని పేర్కొన్నారు. సమావేశంలో అడిషనల్ సీఈవో లోకేశ్‌కుమార్, జాయింట్ సీఈవో సర్ఫరాజ్ అహ్మద్, డిప్యూటీ సీఈవో సత్యవాణి పాల్గొన్నారు.
ఇప్పటివరకు సీజ్ చేసిన మొత్తం విలువ రూ.709 కోట్లు
రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులు
బరిలో ఉన్నఅభ్యర్థులు మొత్తం అభ్యర్థులు 2,290