హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 3,39,24,664 ఓటర్లలో 2,18,39,741 మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తయిందని(64.38%) రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) సీ సుదర్శన్‌రెడ్డి చెప్పారు. మిగిలిన ప్రక్రియను ‘సర్’ కార్యక్రమం ద్వారా పూర్తి చేస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒకరూ ‘సర్’ను ఉపయోగించుకొని ఓటరు జాబితాలో తమ పేర్లను సరిచూసుకోవాలని సూచించారు. ఓటరు జాబితాలో అనర్హులు లేకుండా చూడటమే ‘సర్’ లక్ష్యమని చెప్పారు.
హైదరాబాద్ బీఆర్కేభవన్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో ‘సర్’ ప్రక్రియ షెడ్యూల్, నిబంధనలను మీడియాకు వివరించారు. ఇంటింటి సర్వే కార్యక్రమం జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఉంటుందని చెప్పారు. సవరించిన ముసాయిదా ఓటర్ల జాబితా జూలై 31న ప్రచురిస్తామని, అభ్యంతరాలు, క్లెయిమ్‌ల దాఖలుకు జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు సమయం ఉంటుందని తెలిపారు. నోటీసుల జారీ, విచారణ, పరిషారం జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు ఉంటుందని, తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 1న ప్రచురిస్తామని వివరించారు.
బూత్‌స్థాయి అధికారులు(బీఎల్వో) ముందే కొంత సమాచారంతో ముద్రించిన ఎన్యూమరేషన్ ఫారాలను ప్రతి ఇంటికీ పోయి అందిస్తారని, వాటిని పూరించడంలో సహాయం చేసి, తిరిగి సేకరిస్తారని చెప్పారు. 2011 జనాభా లెకల ప్రకారం తెలంగాణ జనాభా 3,50,03,674 ఉన్నదని తెలిపారు. ప్రతి ఓటరు ఇంటికి బీఎల్వోలు కనీసం మూడుసార్లు తప్పనిసరిగా వెళుతారని, ఎన్నికల సంఘం సూచించిన 12 గుర్తింపుకార్డుల్లో ఏదో ఒక కార్డు చూపించి ఓటు హక్కు ధ్రువీకరించుకోవాలని సూచించారు. ఓటర్లు తమ ఫారాలను కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా సమర్పించవచ్చని చెప్పారు. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవాలనుకునే వారు డిక్లరేషన్‌తోపాటు ఫారమ్ 6ను బీఎల్వోలకు అందించాలని సూచించారు.
‘సర్’ ప్రక్రియపై ఏమైనా అనుమానాలు ఉన్నా, సిబ్బందిపై ఫిర్యాదు చేయాలంటే, ఇతర సమాచారం కోసం టోల్‌ఫ్రీ ఓటరు హెల్ప్‌లైన్ నంబర్ 1950ను సంప్రదించాలని సీఈవో సుదర్శన్‌రెడ్డి సూచించారు. వెబ్సైట్ నుంచి ‘బుక్ ఏ కాల్ విత్ బీఎల్వో’ సౌకర్యం, ECINET యాప్ కూడా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారాలు అందిన ప్రతిఒకరి పేర్లను ముసాయిదా ఓటర్ల జాబితాలో చేర్చుతామని, ఫారాలు తిరిగి ఇవ్వనివారి జాబితాలను బూత్‌వారీగా ప్రదర్శిస్తామని వెల్లడించారు.
గత సవరణల జాబితాతో లింక్ కానివారిని గుర్తించి ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు(ఈఆర్వో) నోటీసులు జారీ చేస్తారని, ఆ వివరాలను కూడా పబ్లిష్ చేస్తామని వివరించారు. నోటీసులు అందుకున్న ఓటర్లు పుట్టిన తేదీ, పుట్టిన స్థలాన్ని ధ్రువీకరించేందుకు నిర్దేశిత పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు, 35,985 పోలింగ్స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. ఇందులో 1,200 కంటే తకువ ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు 28,653 కాగా, 1200 కంటే ఎకువ ఓటర్లు ఉన్న కేంద్రాలు 7,332 ఉన్నాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ‘సర్’ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ప్రత్యేక అధికారులను నియమించినట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు జిల్లా ఎన్నికల అధికారులు(డీఈవో), 119 నియోజకవర్గాలకుగాను ఓటర్ల నమోదు అధికారులు (ఈఆర్వో), సహాయ ఓటర్ల నమోదు అధికారులు (ఏఈఆర్వో) 867 మంది, బీఎల్వో సూపర్వైజర్లు 3,596 మంది, బూత్‌స్థాయి అధికారులు (బీఎల్వో) 35,985 మందిని నియమించినట్టు సీఈవో వివరించారు. సమావేశంలో అడిషనల్ సీఈవో డాక్టర్ వాసం వెంకటేశ్వర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.