హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : క్యాబినెట్ సమావేశం ఈ నెల 30న జరుగనున్నది. సచివాలయం లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనున్నట్టు సీఎస్ శాంతి కుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సమావేశంలో రైతు భరోసా పంపిణీపై విధివిధానాలకు మంత్రిమండలి ఆమోదం తెలుపనున్నట్టు సమాచారం. సంక్రాంతి తర్వాత రైతు భరోసా పంపిణీ ప్రారంభిస్తామని అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో.. ‘నూతన సంవత్సర కాను క’ పేరుతో క్యాబినెట్ ఆమోదించవచ్చని చెప్తున్నారు. నూతన రేషన్ కార్డుల జారీ విధివిధానాలపైనా చర్చించి, ఆమోదించే అవకాశం ఉన్నట్టు సమాచారం.
హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్ రెడ్డి సోమవారం తమిళనాడులోని కన్యాకుమారికి వెళ్లారు. కన్యాకుమారి ఎంపీ విజయ్ వసంత్ న్విహించే క్రిస్మస్ వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. రాత్రికి అక్కడే బసచేసి.. మంగళవారం ఉదయం తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): గృహజ్యోతి పథకం సబ్సిడీని మంజూరుచేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులిచ్చింది. డిసెంబర్ నెల కు రూ.172.58 కోట్లను మంజూరుచే స్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.