అత్యధికంగా మంథనిలో 45.8 డిగ్రీలు
నేటి నుంచి మరింత భగభగ
47 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం
భారత వాతావరణ విభాగం అంచనా
రాష్ర్టానికి ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ
హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచే వడగాడ్పులు వీస్తున్నాయి. తెలంగాణలో సోమవారం (మే 2) నుంచి వేసవి తీవ్రత మరింత పెరగవచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. పగటి ఉష్ణోగ్రతలు 42 నుంచి 47 సెల్సియస్ డిగ్రీల మేరకు నమోదయ్యే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ఈ మేరకు సోమవారానికి ‘ఆరెంజ్ అలర్ట్’ను.. మంగళ, బుధవారాలకు ‘ఎల్లో అలర్ట్’ను జారీ చేసింది. వాతావరణ హెచ్చరికలను జారీ చేసేందుకు ఐఎండీ గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ కలర్ కోడ్లను ఉపయోగిస్తుంది. వీటిలో ‘ఎల్లో అలర్ట్’ అంటే పరిస్థితిని నిశితంగా గమనిస్తూ ఉండాలని, ‘ఆరెంజ్ అలర్ట్’ అంటే పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అర్థం. కాగా, ఆదివారం రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు మించిపోయాయి. 11 జిల్లాల్లో 44 డిగ్రీలు, 6 జిల్లాల్లో 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా పెద్దపల్లి జిల్లా మంథనిలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.
పెద్దపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నల్లగొండ, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో వడగాడ్పులు వీచినట్టు తెలిపింది. గత ఏడాది ఇదే రోజున (మే 1న) 4 జిల్లాల్లో మాత్రమే 40 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రత నమోదైంది. అప్పట్లో అత్యధిక ఉష్ణోగ్రత 41.1 డిగ్రీలే. కానీ, ఈసారి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 41.6 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవడం గమనార్హం. కాగా, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో సోమవారం కూడా వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రస్తుతం విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా ఇంటీరియర్ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తున ఉపరితల ద్రోణి స్థిరంగా కొనసాగుతున్నదని, దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. కాగా, వడగాడ్పుల పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం లేఖలు రాసింది. వచ్చే 3-4 రోజులపాటు వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.
బుల్లెట్ నుంచి మంటలు
గర్మిళ్ల, మే 1: మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం బుల్లెట్ బైక్ దగ్ధమైంది. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌కు చెందిన శ్రీకాంత్ షాపింగ్ కోసం రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై మంచిర్యాలకు వచ్చారు. మెయిన్ రోడ్డు ఏరియాలో ఉన్న ఓ షాపులోకి వెళ్లారు. పావుగంట తరువాత బుల్లెట్ నుంచి మంటలు చెలరేగడంతో బైక్ పూర్తిగా కాలిపోయింది.