Telangana techie : భార్యను చంపి, గుర్తు తెలియన వారు చేసిన హత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన తెలంగాణ యువకుడిని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. ఇండియాలో ఉన్న తన ప్రేయసి కోసం ఆ యువకుడు తన భార్యను చంపినట్లు తేలింది. దీంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలివి. తెలంగాణకు చెందిన నార్నె అవినాష్ (30) అనే యువకుడికి, రాజిత సబ్బినేని (27) అనే యువతికి గత ఏడాది వివాహమైంది. నార్నె అవినాష్ అమెరికాలోని వాషింగ్టన్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. నూతన దంపతులిద్దరూ అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో వీరి పెళ్లైన ఆరు నెలలలకు.. అంటే గత ఏడాది అక్టోబర్ చివరిలో రాజిత అనుమానాస్పదంగా మరణించింది.
తన భార్య బాత్రూమ్లోకి వెళ్లి తలుపు వేసుకుందని, పిలిచినా పలకడం లేదని అవినాష్ పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే వచ్చి చూడగా, బాత్రూమ్ తలుపు వేసి ఉంది. తలుపు పగలగొట్టి చూడగా, రాజిత అక్కడి నేలపై పడిపోయి ఉంది. రాజితను పరీక్షించిన పోలీసులు అప్పటికే ఆమె మరణించినట్లు గుర్తించారు. దీంతో ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరగగా.. అవినాష్ పొంతనలేని సమాధానాలు చెప్పాడు. తను బయటకు వెళ్లొచ్చేసరికి ఆమె బాత్రూమ్లో లాక్ చేసుకుని ఉందని, వెంటనే పోలీసులకు తెలిపానని విచారణలో చెప్పాడు. కానీ, తన వాదనలో ఎక్కడో తేడా కొట్టడంతో వాషింగ్టన్ పోలీసులు, డిటెక్టివ్స్ అన్ని కోణాల్లో విచారణ జరిపారు. అతడు చెప్పిన సమాధానాలకు, ఘటన జరిగిన విధానాలకు తేడా ఉంది.
అలాగే, రాజిత ఊపిరాడకపోవడం వల్ల మరణించిందని, తనను ఎవరో హత్య చేశారని పోస్టుమార్టంలో తేలింది. దీంతో హత్య కోణంలో పోలీసులు విచారించారు. సీసీ కెమెరాల్లో అతడు తప్ప ఆ ఇంట్లోకి ఎవరూ రానట్లు గుర్తించారు. వారిద్దరి ఫోన్లను కూడా పరిశీలించారు. ఇలా, పలు రకాలుగా పరిశీలించగా, అవినాష్‌ను విచారించగా.. చివరకు అతడే రాజితను హత్య చేసినట్లు అంగీకరించాడు. ఈ అంశంపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అవినాష్ పెళ్లికి ముందే ఇండియాలో ఒక యువతిని ప్రేమించాడు. అయినప్పటికీ, రాజితను పెళ్లి చేసుకున్నాడు. పైగా ఆ యువతి కూడా వీరి పెళ్లికి వచ్చింది. పెళ్లి అనంతరం అమెరికా వెళ్లినా సరే.. అతడు ఆ ప్రేయసితో సంబంధాన్ని కొనసాగించాడు. ఆమె కోసమే ఈ హత్య చేసినట్లు తేలింది.
రాజితను హత్య చేసిన తర్వాత ఆమె మృతదేహానికి సంబంధించిన ఫొటోను అతడు ఇండియాలోని తన ప్రేయసికి పంపాడు. ఈ విషయాలన్నీ పోలీసులు ఇటీవల కోర్టుకు నివేదించారు. రాజిత హత్య జరిగిన దాదాపు 9 నెలల తర్వాత అతడి నేరం రుజువైంది. కొంతకాలం బెయిల్‌పై ఉన్న అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. కోర్టు అతడికి అక్కడి చట్టాల ప్రకారం.. యావజ్జీవ కారాగార శిక్ష విధించే అవకాశం ఉంది.