Bandi Sanjay | హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): పదో తరగతి హిందీ పేపర్ లీకేజీ కేసులో కీలక సాక్ష్యంగా భావిస్తున్న సెల్‌ఫోన్ విషయంలో బండి సంజయ్ పూటకోమాట మాట్లాడుతున్నారు. నిన్నటివరకూ ఫోన్ విషయంలో వివిధ రకాలుగా మాట్లాడి, చివరికి తాను ఫోన్ ఎందుకు ఇవ్వాలంటూ పోలీసులపై ఎదురుదాడి చేసిన సంజయ్.. ఇప్పుడు తాను వాడుతున్న ఫోన్ పోయిందని ఆదివారం సాయంత్రం తన కార్యాలయం నుంచి మెయిల్ ద్వారా కరీంనగర్ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సోదరి డాక్టర్ సౌమ్య పేరుతో ఉన్న 7680006600 నంబర్ సిమ్ కార్డును తాను వాడుతున్నానని, ఆ మొబైల్ పోయిందని ఫిర్యాదులో పేర్కొనడం వివాదాస్పదంగా మారింది. పేపర్ లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్‌ని ఈ నెల 4న రాత్రి పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకోగా, 5న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
అరెస్ట్ సమయంలో బండి సంజయ్ వాడిన సెల్‌ఫోన్ ఇవ్వాలని కోరగా, తనకు తెలియదంటూ సమాధానం ఇచ్చారని వరంగల్ సీపీ చెప్పారు. బెయిల్‌పై బయటికి వచ్చిన త ర్వాత కరీంనగర్లో బండి మీడియాతో మాట్లాడు తూ.. ‘నా ఫోన్లో ఏముందని అడుగుతున్నారు? నా ఫోన్‌తో మీకేం అవసరం?’ అంటూ పోలీసులనే దబాయించారు. అంతే తప్ప తన ఫోన్ పోయిందని అప్పుడు చెప్పలేదు. ఆ తర్వాత తనను అరెస్ట్ చేస్తున్న సమయంలో ఫోన్ ఎక్కడో పోయిందంటూ పార్టీ నేతలతో ప్రచారం చేయించారు. తీరా.. జైలు నుంచి విడుదలైన మూడు రోజుల తర్వాత ఇప్పుడు ‘నా ఫోన్ పోయింది’ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బండి సంజయ్ ఇదంతా కావాలనే చేసినట్టు విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ బండి సంజయ్ ఫోన్ నిజంగానే పోయి ఉంటే.. జైలు నుంచి విడుదలైన వెంటనే ఫిర్యాదు చేసేవారని అంటున్నారు. తాను కేసులో ఇరుక్కోకుండా, సాక్ష్యా లు మాయం చేసేందుకు ఏయే మార్గాలు ఉన్నాయో వెతికిన తర్వాతే.. ఫోన్ పోయిందంటూ సంజయ్ ఫిర్యాదు చేశాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
బండి సంజయ్ తన ఫోన్ పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయడం పెద్ద డ్రామా అని తెలంగాణ రెడో చైర్మన్ వై సతీశ్‌రెడ్డి ఆరోపించారు. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన దొంగ ఇప్పుడు తప్పించుకొనేందుకు కొత్త వేషాలు వేస్తున్నాడని విమర్శించారు. బండి అరెస్టయిన రోజు రాత్రి ఫోన్ ఆయనతోనే ఉందని.. తాను ఫోన్లో మాట్లాడానని స్వయంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రెస్మీట్లో చెప్పారని సతీశ్‌రెడ్డి గుర్తుచేశారు. అలాగే అరెస్ట్ అయిన తర్వాత రోజు బండి సంజయ్‌తో తాను ఫోన్లో మాట్లాడానని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా చెప్పారని అన్నారు. ఫోన్ ఇవ్వడం లేదంటే కచ్చితంగా పదో తరగతి పేపర్ లీకేజీలో తన ప్రమేయం ఉందని సంజయ్ అంగీకరించినట్టేనని అన్నారు.