హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో గురువారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు, ఎన్నికల నిర్వహణ కమిటీల సమావేశంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై చర్చే జరగలేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి తేల్చేశారు. జాబితాను ఎప్పుడు విడుదల చేస్తారనే అంశంపై కూడా స్పష్టత ఇవ్వలేదు. ఢిల్లీ పెద్దలు అవకాశం ఇస్తే రేపో ఎల్లుండో మాట్లాడుతానని చెప్పారు.
తెలంగాణలో ఎన్నికలకు ఇంకా 40 రోజుల సమయం ఉన్నదని, అందుకే ఇతర రాష్ర్టాల ఎన్నికలపైనే దృష్టిపెట్టినట్టు చెప్పారు. దీంతో జాబితా ఇప్పట్లో రానట్టేనని పరోక్షంగా చెప్పేశారు. జనసేనతో పొత్తుపైనా స్పష్టత ఇవ్వలేదు. దీంతో రాష్ట్రంలోని బీజేపీ నేతలు, కార్యకర్తలు పూర్తిగా డీలాపడిపోయారు. అభ్యర్థులు లేరని ఇతర పార్టీలు ఎద్దేవా చేస్తుండగా, పార్టీ పరిణామాలు కూడా దానికి తగ్గట్టే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొత్తుల కోసం ఎదురుచూడటాన్ని బట్టే అభ్యర్థులు లేరని అర్థం అవుతున్నదని వ్యాఖ్యానిస్తున్నారు.