హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): అందరికీ వైద్యం అందించడంలో తెలంగాణ అద్భుతంగా ముందడుగు వేస్తున్నదని మరోసారి రుజువైంది. ప్రజలందరికీ కార్పొరేట్‌స్థాయి వైద్యం అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కల నెరవేరుతున్నదనడానికి నీతి ఆయోగ్ నివేదిక అద్దం పట్టింది. సోమవారం 2019-20 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వైద్యారోగ్య రంగం పనితీరును విశ్లేషిస్తూ నీతి ఆయోగ్ నాలుగో ఆరోగ్యసూచి (హెల్త్ ఇండెక్స్) ని విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ఆరోగ్య పురోగతిలో దేశంలోనే తెలంగాణ మొదటిస్థానంలో నిలిచింది. పిల్లలకు వ్యాక్సినేషన్, దవాఖానలో ప్రసవాల పురోగతిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నది. ఓవరాల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానాన్ని సాధించింది. నీతి ఆయోగ్ 24 అంశాలను పరిగణనలోకి తీసుకొని నివేదిక రూపొందించింది. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్ఆర్ఎస్), సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్ఎస్), హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్
సిస్టమ్స్ (హెచ్ఎంఐఎస్) వంటి పోర్టళ్లు, ఇతర మార్గాల ద్వారా సమాచారాన్ని సేకరించింది. కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ, ప్రపంచబ్యాంకు సహకారంతో 2019-20లో సమగ్రమైన పనితీరు (ఒవరాల్ పర్ఫార్మెన్స్), 2018-19తో పోల్చితే పురోగతిని (ఇంక్రిమెంటల్ పర్ఫార్మెన్స్) ను గణించి పాయింట్లు ఇచ్చింది. రాష్ర్టాల్లో పశ్చిమ బెంగాల్, కేంద్ర పాలిత ప్రాతాల్లో లఢక్ సమాచారం లేకపోవడంతో మిగతావాటికి ర్యాంకులు ఇచ్చింది. 27 రాష్ర్టాలను పెద్ద రాష్ర్టాలు (19), చిన్న రాష్ర్టాలుగా (8) విభజించింది. తెలంగాణ పెద్ద రాష్ర్టాల క్యాటగిరీలో ఉన్నది.
సమగ్ర పనితీరులో మూడోస్థానం
తెలంగాణ.. బెస్ట్ పర్ఫార్మర్
2018-19 తో పోల్చినప్పుడు 2019-20లో పురోగతి సాధించిన రాష్ర్టాల్లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. 2018-19లో తెలంగాణ 65.74 స్కోర్‌తో నాలుగో స్థానంలో ఉండేది. ఏడాదిగడిచేలోగా 4.22 పాయింట్లు మెరుగుపరుచుకున్నది. మూడో స్థానానికి ఎదిగింది. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్ (5.52 పాయింట్ల వృద్ధి), అస్సాం (4.34 పాయింట్ల వృద్ధి) తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. కర్ణాటక -1.37 వృద్ధితో అట్టడుగున నిలిచింది.
ఓవరాల్ ర్యాంకింగ్స్‌లో కేరళ, తమిళనాడు అగ్రస్థానంలో ఉన్నా.. పురోగతిలో వెనుకబడ్డాయి. ఇంక్రిమెంటల్ పర్ఫార్మెన్స్లో కేరళ 12వ స్థానంలో, తమిళనాడు 8వ స్థానంలో నిలిచాయి. తెలంగాణ అటు పనితీరులోనూ, పురోగతిలోనూ మూడో స్థానంలో నిలిచిందని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. వీటి ఆధారంగా తెలంగాణను ‘బెస్ట్ పర్ఫార్మర్’గా కీర్తించింది.
రాజస్థాన్ పనితీరు, పురోగతిలో చివరి వరుసలో నిలువడంతో ‘వీక్ పర్ఫార్మర్’గా నీతిఆయోగ్ పేర్కొన్నది.
చిన్న రాష్ర్టాల క్యాటగిరీలో మిజోరం బెస్ట్ పర్ఫార్మర్గా నిలిచింది. పనితీరు, పురోగతిలో ఆ రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నది.
మాతాశిశు మరణాల్లో తగ్గుదల
నివేదికలో భాగంగా నీతిఆయోగ్ 2017, 2018 మధ్య (ఐదేండ్లలో) శిశుమరణాలు, ఐదేండ్లలోపు పిల్లల మరణాలు, తల్లుల మరణాల స్థితిగతులను విశ్లేషించింది. ఈ మూడు క్యాటగిరీల్లోనూ తెలంగాణలో తగ్గుదల నమోదైంది. శిశుమరణాల తగ్గుదలలో తెలంగాణ 3వ స్థానంలో నిలిచింది. 2014లో ప్రతి వెయ్యి జననాలలో 25 మరణాలు నమోదుకాగా, ఐదేండ్లలో 19కి తగ్గింది. మొత్తంగా 24 శాతం తగ్గుదల నమోదైంది. ఈ జాబితాలో హిమాచల్ ప్రదేశ్ (-48శాతం), తమిళనాడు (- 28.57 శాతం) తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. తల్లుల మరణాల్లో 13 శాతం తగ్గుదల నమోదైంది. 2018-19లో ప్రతి వెయ్యిమంది బాలింతల్లో 76 మరణాలు నమోదుకాగా, ఐదేండ్లలో 63 కు తగ్గింది. ఐదేండ్లలోపు పిల్లల మరణాల్లో 18.92 శాతం తగ్గుదల నమోదైనట్టు వెల్లడించింది. మాతాశిశు సంరక్షణ కోసం ప్రభుత్వం తీసుకొన్న చర్యల ఫలితంగానే మాతాశిశు, పిల్లల మరణాలు తగ్గాయి. గర్భిణులను దవాఖానకు, ఇంటికి చేర్చేందుకు అమ్మ ఒడి వాహనాలను ఏర్పాటుచేశారు. నవజాత శిశు సంరక్షణ కేంద్రాలను 22 నుంచి 42కు పెంచారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేందుకు దేశంలోనే తొలిసారిగా మిడ్ వైఫరీ వ్యవస్థను ఏర్పాటుచేశారు.
పుట్టిన పిల్లల నమోదు వందశాతం
తెలంగాణలో పుట్టిన ప్రతి శిశువును అధికారికంగా నమోదు చేస్తున్నట్టు నీతి ఆయోగ్ తెలిపింది. 2019-20లో 100 శాతం బర్త్ రిజిస్ట్రేషన్లు జరిగినట్టు వెల్లడించింది. తెలంగాణతోపాటు అస్సాం, ఉత్తరాఖండ్‌లో మాత్రమే 100 శాతం పూర్తయింది.
బెడ్ ఆక్యుపెన్సీలోనూ పెరుగుదల
రాష్ట్రస్థాయి దవాఖానల్లో బెడ్ ఆక్యుపెన్సీ పాజిటివ్ వృద్ధిలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. 2018 -19తో పోల్చితే 2019-20లో 2.1 శాతం పెరిగింది. మహారాష్ట్ర 2.61%, ఛత్తీస్‌గఢ్ 2.19%ంతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. 2014-15, 2019-20 మధ్య పోల్చినప్పుడు తెలంగాణలో ఆక్యుపెన్సీ శాతం ఏకంగా 83.81 శాతం పెరిగింది. అన్ని స్థాయిల దవాఖానల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, అత్యాధునిక పరికరాలను సమకూర్చుతుండటం, వైద్యసిబ్బందిని పెంచడంతో సర్కారు దవాఖానలపై ప్రజలకు న మ్మకం పెరిగింది. ఫలితంగా ఆక్యుపెన్సీ రేటు పెరిగింది. జిల్లా దవాఖానలన్నీ పరిశుభ్రంగా ఉన్నాయని నివేదిక తెలిపింది. స్వచ్ఛభారత్ అభియాన్ కింద ఆరోగ్య కేంద్రాలకు ఇచ్చే ‘కాయకల్ప్ స్కోర్’ 70 శాతానికిపైగా ఉన్న జిల్లా దవాఖానల జాబితాలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నది.
తెలంగాణ, కర్ణాటకలో మాత్రమే 100 శాతం ఉన్నట్టు వెల్లడించింది. తెలంగాణలోని పీహెచ్‌సీలు, యూపీహెచ్సీలన్నీ ‘హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు’గా (హెచ్డబ్ల్యూసీ) పనిచేస్తున్నాయని నివేదిక వెల్లడించింది. దేశంలో తెలంగాణ, ఏపీ మాత్రమే ఈ ఘనత సాధించాయి. తెలంగాణలోని సబ్సెంటర్లలో ఏఎన్ఎంల కొరత సున్నాశాతం ఉన్నదని, పీహెచ్‌సీలు, యూహెచ్‌సీల్లో వైద్యాధికారుల కొరత కూడా సున్నాశాతం ఉన్నదని కొనియాడింది. జిల్లా దవాఖానల్లో బా లింతల వార్డులు (లేబర్ రూం) కేంద్ర ఆరోగ్య, కుటుం బ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. రాష్ట్రంలోని అన్ని జిల్లా దవాఖానలు లక్ష్య (లేబర్ రూం క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఇనీషియేటివ్) సర్టిఫికెట్ పొందినట్టు నీతి ఆయోగ్ వెల్లడించింది. 2018-19లో 16.67 శాతమే ఉండగా ఏడాదిలోనే 83శాతానికిపైగా వృద్ధి సాధించడం విశేషం.అన్ని జిల్లా దవాఖానల్లో 100 శాతం మెటర్నిటీ ఆపరేషన్ థియేటర్లకు లక్ష్య సర్టిఫికెట్ ఉన్నట్టు తెలిపింది. ఈ ఘనత సాధించిన ఏకైక రాష్ట్రం తెలంగాణే కావడం విశేషం. టీబీ కేసుల గుర్తింపులోనూ తెలంగాణ టాప్‌లో నిలిచింది. 2019-20లో వందశాతం నమోదైనట్టు నివేదిక వెల్లడించింది.
దవాఖాన ప్రసవాల్లో టాప్
దవాఖానల్లో ప్రసవాలలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2019-20లో తెలంగాణలో 96.3 శాతం ప్రసవాలు దవాఖానల్లో జరిగినట్టు నివేదిక వెల్లడించింది. 2018-19తో పోల్చితే 1.09 శాతం వృద్ధి నమోదైంది.
2014-15, 2019-20 మధ్య పోల్చినప్పుడు ఈ విభాగంలో ఉత్తమ పురోగతి సాధించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
2014-15లో 59.15 శాతం మాత్రమే దవాఖాన ప్రసవాలు జరుగగా.. ఐదేండ్లలో 62.8 శాతం పెరుగుదల కనిపించింది.
ఐదేండ్ల పనితీరులో గుజరాత్ వరస్ట్ పర్ఫార్మర్గా నిలిచింది. 2014-15లో గుజరాత్లో దవాఖాన ప్రసవాలు 5.17 శాతం తగ్గాయి.
పిల్లలందరికీ టీకాలు.. దేశంలోనే ఉత్తమం
పిల్లలందరికీ టీకాలు అందించడంలో తెలంగాణ దేశంలోనే అగ్రభాగాన నిలిచింది. రాష్ట్రంలో 100 శాతం మంది పిల్లలకు టీకాలు వేసినట్టు స్పష్టంచేసింది. 2014-15, 2019-20 మధ్య పోల్చినా తెలంగాణ అగ్రభాగంలో నిలువటం విశేషం. రెండుసార్లూ 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తయినట్టు వెల్లడించింది.
కేసీఆర్ కిట్ల ఫలితం
దవాఖానల్లో ప్రసవాలు పెరుగటంలో కేసీఆర్ కిట్లు ముఖ్యపాత్ర పోషించాయి. దవాఖాన ప్రసవాలను ప్రోత్సహించడం, తల్లీబిడ్డల సంరక్షణపై ప్రత్యేక దృష్టిపెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ 2017 జూన్ 3న ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగ పిల్లవాడు జన్మిస్తే రూ.12 వేలు నాలుగు విడుతల్లో ఆర్థికసాయం అందిస్తున్నారు. దాదాపు రూ.2 వేలు విలువ చేసే కిట్‌ను అందజేస్తున్నారు. 3 నెలల వరకు పిల్లలకు అవసరాలను ఇవి తీర్చుతున్నాయి. ఇందులో ప్రభుత్వ దవాఖానలో ప్రసవించిన వారికి పూర్తిస్థాయిలో లబ్ధి చేకూరుతున్నది. దీంతో దవాఖాన ప్రసవాల సంఖ్య విపరీతంగా పెరిగింది. నాలుగున్నరేండ్లలో 12 లక్షల మంది లబ్ధిపొందారు. ప్రభుత్వం దాదాపు రూ.1,500 కోట్లు ఖర్చు చేసింది.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో వైద్యరంగంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానం దిశగా పయనిస్తున్నది. పల్లెల్లో ఆరోగ్య కేంద్రాల బలోపేతం నుంచి పట్టణాల్లో బస్తీ దవాఖానలు, సూపర్ స్పెషాలిటీ దవాఖానల వరకు ఎన్నడూ లేనంత సౌకర్యాలు మెరుగుపడ్డాయి. మన రాష్ట్రంలో సామాన్యుడికి ఉచితంగా ప్రపంచ స్థాయి వైద్యం అందుతున్నది. ఇదే విషయాన్ని నీతి ఆయోగ్ మరోసారి స్పష్టం చేసింది.
-వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు