Hyderabad | హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): దేశ రక్షణ రంగానికి తెలంగాణ వెన్నుదన్నుగా నిలుస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం, ముఖ్యంగా హైదరాబాద్ ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల పెట్టుబడులకు గమ్యస్థానంగా మారడంతో ఇక్కడ అనేక జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు కొలువుదీరాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించిన 14 ప్రాధాన్య రంగాల్లో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు చోటు కల్పించడంతోపాటు నాటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అనుసరించిన పారిశ్రామిక అనుకూల విధానాలే ఇందుకు కారణమని చెప్పవచ్చు. ప్రస్తుతం ఎల్అండ్టీ డిఫెన్స్, వెమ్ టెక్నాలజీస్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, జీఈ, కోలిన్స్ ఏరోస్పేస్, టాటా బోయింగ్ ఎరోస్పేస్, టాటా సికోర్స్కై ఏరోస్పేస్, స్కైరూట్ ఏరోస్పేస్, శాఫ్రాన్, ధృవ స్పేస్, ఎంటీఏఆర్ టెక్నాలజీస్, లాక్హీడ్ మార్టి న్, ఆజాద్ ఇంజినీరింగ్ తదితర 20కిపైగా కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. దీంతో క్షిపణులు, పలు రకాల ఆయుధాలతోపా టు డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాలకు అవసరమైన అనేక రకాల పరికరాలు, విడిభాగాల తయారీకి తెలంగాణ ప్రధాన కేంద్రంగా ఎదిగింది.
తెలంగాణలో తయారవుతున్న తేలికపాటి ఆయుధాలు
ప్రభుత్వ రంగంలోని బీడీఎల్ సంస్థ చాలా కాలం నుంచి క్షిపణులతోపాటు పలు రకాల ఆయుధాలను ఉత్పత్తి చేస్తుండగా.. ప్రైవేటు రంగంలోనూ అనేక రకాల తేలికపాటి ఆయుధాలు తయారవుతున్నాయి. వాటిలో మిషన్-ప్రూవెన్ కార్ 816 రైఫిల్, కార్ 817 అసాల్ట్ రైఫిల్, తేలికపాటి సీఎస్ఆర్ 338, 308 బోల్ట్-యాక్షన్ స్నైపర్ రైఫిల్స్, సీఎస్ఆర్ 50 బోల్ట్-యాక్షన్ యాంటీ-మెటీరియల్ స్నైపర్ రైఫిల్, అత్యాధునిక సీఎంపీ 9 సబ్ మెషీన్ గన్, క్యారకల్ ఈఎఫ్, క్యారకల్ ఎఫ్ జెన్-2 కంబాట్ పిస్టల్స్ ముఖ్యమైనవి.
రాష్ట్రంలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల అభివృద్ధి ఇలా..