హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ‘వెనుకబడిన వర్గాలకు 42% రిజర్వేషన్లను పెంచాలని కోరుతూ ఒక బీసీ బిడ్డగా నేను పార్లమెంట్లో ప్రైవేటు బీసీ బిల్లు ప్రవేశపెడతా. ఆ బిల్లుకు అన్ని పార్టీల మద్దతు కోరుతా. వారంతా మద్దతుగా నిలవాలి. 42% బీసీ రిజర్వేషన్ల సాధనకు బీఆర్ఎస్ కట్టుబడి ఉన్నది’ అని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర వెల్లడించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శనివారం మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీలు ఎల్ రమ ణ, దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే ముఠాగోపాల్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ సర్కార్‌పై బీసీలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధిచెప్పారని స్పష్టంచేశారు. మలి, తుది విడత ఎన్నికల్లో కూడా గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తేల్చిచెప్పారు.
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీసీలకు కాంగ్రెస్ తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రధాని అయితేనే బీసీలకు రిజర్వేషన్లు వస్తాయని ప్రకటించిన నాడే బీసీలను ఈ సర్కారు మోసం చేస్తుందన్న సంగతి అర్థమైందని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తున్నామని జీవో విడుదల చేసి, మరో మోసానికి ఒడిగట్టిందని మండిపడ్డారు. 42శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్‌తోనే సాయి ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడినా, అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులే విజయం సాధించారని తెలిపారు. కాంగ్రెస్ చేసిన మోసాలను బీసీలు గమనిస్తున్నారని, బీసీ జ్వాలలో కాంగ్రెస్ మాడి మసైపోవడం ఖాయమని హెచ్చరించారు.
మెస్సీపై ఉన్న ప్రేమ బీసీలపై లేదు : వీ శ్రీనివాస్‌గౌడ్
సీఎం రేవంత్‌రెడ్డికి ఫుట్‌బాల్ ఆటగాడు మెస్సీపై ఉన్న ప్రేమ బీసీలపై లేదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. రాహుల్‌గాంధీ కూడా మెస్సీ కోసం కేటాయించిన సమయాన్ని బీసీల కోసం కేటాయించడం లేదని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల కోసం మరణించిన సాయి ఈశ్వరాచారి కుటుంబాన్ని సీఎం రేవంత్‌రెడ్డి కనీసం ఓదార్చలేదని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల కోసం సీఎం.. రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడగడమే లేదని దుయ్యబట్టారు. బీసీల ఓట్లతో కాంగ్రెస్ గద్దినెక్కి, వారికిచ్చిన హామీలు మాత్రం అమ లు చేయడం లేదని దుయ్యబట్టారు. సర్పంచ్ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు.
బీసీలను మోసగించింది కాంగ్రెస్సే: ఎల్ రమణ
అన్నిరంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ మోసం చేసిందని ఎమ్మెల్సీ ఎల్ రమణ మండిపడ్డారు. కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నా కాంగ్రెస్ బీసీల కోసం ఏమీ చేయలేకపోయిందని దుయ్యబట్టారు. పార్లమెంట్లో బీఆర్ఎస్ ప్రవేశ పెట్టిన బీసీ బిల్లుకు బీజేపీ మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల కోసం ఆత్మహత్యలు చేసుకోవడం పరిష్కారం కాదని హితవు పలికారు. కేసీఆర్ తిరిగి సీఎం అవుతారని, బీసీల అన్ని సమస్యలూ పరిష్కారం అవుతాయని భరోసా ఇచ్చారు.
బీసీలతో రేవంత్ ఫుట్‌బాల్ : దాసోజు
సీఎం రేవంత్‌రెడ్డి బీసీలతో ఫుట్‌బాల్ ఆడుతున్నాడని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ మండిపడ్డారు. కేసీఆర్ ఆదేశాల మేరకు పార్లమెంట్లో తమ పార్టీ ఎంపీ ప్రైవేటు బిల్లు ప్రవేశపెడుతున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత జరుగుతున్న పరిణామాలు.. బీసీలను తడిగుడ్డతో గొంతుకోసేలా ఉన్నాయని ధ్వజమెత్తారు. బీసీలను దగా చేసిన రేవంత్‌రెడ్డిని ప్రజాకోర్టులో శిక్షించాలని డిమాండ్ చేశారు. అవినీతి కేసులపై పెద్ద లాయర్లను పెట్టుకునే రేవంత్‌రెడ్డి.. బీసీల హక్కులు కాపాడేందుకు అదే పెద్ద లాయర్లను ఎందుకు పెట్ట్టలేదని విమర్శించారు. రెండు, మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు.
బీసీలపై ఎందుకింత వివక్ష : పొన్నాల
కేంద్రంలో ఎన్నో కొత్తచట్టాలు, కొత్త బిల్లులు వస్తూనే ఉన్నాయని, కానీ, బీసీ రిజర్వేషన్ల బిల్లుల విషయంలో కేంద్ర ఎందుకు వివక్ష చూపుతున్నదని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. తమిళనాడులో బీసీ రిజర్వేషన్ల అమలుకు చట్టబద్ధత వచ్చినప్పుడు తెలంగాణలో బీసీ బిల్లుకు ఎందుకు ఆమోదం రాదు? అని నిలదీశారు. మన రాష్ట్రంలో బీసీ లు అధిక సంఖ్యలోనే ఉన్నారు కదా? అని పే ర్కొన్నారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు కల్పించకుండా కావాలనే తాత్సారం చేస్తున్నారని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్లో బీఆర్ఎస్ ప్రైవేశపెట్టే బిల్లు కాంగ్రెస్‌కు చెంపపెట్టులా ఉంటుందని హెచ్చరించారు.