హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బీసీ జాబితాలో ఉండి, ఓబీసీ జాబితాలో లేని 40కులాలను వెంటనే ఆ జాబితాలో చేర్చాలని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కేంద్రాన్ని కోరారు. కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రి వీరేంద్రకుమార్కు గురువారం ప్రత్యేకంగా లేఖ రాశారు. తెలంగాణ ఆవిర్భా వం తర్వాత రాష్ట్ర ఓబీసీ జాబితాను 2016లో ప్రకటించారని, అయితే అప్పటికే కేంద్రం ఓబీసీ జాబితా ప్రకటించిందని వెల్లడించారు.
ఆ ఓబీసీ జాబితాలో తెలంగాణకు చెందిన బీసీ కులాలు 90మాత్రమే ఉన్నాయని వివరించారు. అనాథలతోపాటు, మరో 17 కులాలను ప్రభుత్వం రాష్ట్ర బీసీ జాబితాలో చేర్చిందని, దీంతో కులాల సంఖ్య 130కి చేరుకున్నదని వెల్లడించారు. ఇంకా ఇప్పటికీ కేంద్ర ఓబీసీ జాబితాలో చేరని రాష్ట్ర బీసీ కులాలు 40 ఉన్నాయని వివరించారు. ఆ కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం 2016 నుంచి కోరుతూ వస్తున్నదని, లేఖలు రాసిందని, జాతీయ బీసీ కమిషన్కు విజ్ఞప్తి చేసిందని వెల్లడించారు.