హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో బడిబాట కార్యక్రమాన్ని జూన్ 3 నుంచి 19 వరకు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలతో కూడిన షెడ్యూల్‌ను బుధవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన విడుదల చేశారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల నమోదు పెంపు కోసం ఉద్దేశించిన బడిబాటను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్లను, జిల్లా విద్యాధికారులను కోరారు. షెడ్యూల్ ప్రకారం అంశాల వారీగా బడిబాట నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్, డీఈవో, ఎంఈవో, ప్రధానోపాధ్యాయుల బాధ్యతలను శ్రీదేవసేన తెలియజేశారు. బడులు ప్రారంభం కాకముందు ఒక షెడ్యూల్, బడులు ప్రారంభమైన తర్వాత మరో షెడ్యూల్‌తో ఈ విధంగా రెండు వేర్వేరుగా మార్గదర్శకాలను వెల్లడించారు.
బడిబాట నిర్వహణకు పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, లేబర్ డిపార్ట్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, వెల్ఫేర్ డిపార్టుమెంట్, జిల్లా మహిళా సమాఖ్యలతో కలిసి ఈ నెల 30 లోపు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించాలి. జిల్లా స్థాయిలో అన్ని పంచాయతీల వారీగా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులతో బడిబాట నిర్వహించాలి. ఇందులో భాగంగా జూన్ 10 లోపు ఒక యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, వర్క్‌బుక్‌లను పంపిణీ చేయాలి.