హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయానికి ఆటో డ్రైవర్లు బలవుతున్నారని తెలంగాణ ఆటో మోటర్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ (టీఏటీయూ) అధ్యక్షుడు వేముల మారయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కోల్పోయామనే భయంతో కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక ఆటో డ్రైవర్ సతీశ్ ఆత్మహత్యకు పాల్పడటానికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని ఆయన ఆరోపించారు. ఇంకెంత మంది ఆటో డ్రైవర్లు చనిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం స్పందిస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. టీఏటీయూ నాయకులు సోమాజిగూడలో మృతుడు సతీశ్గౌడ్ కుటుంబసభ్యులను శనివారం పరామర్శించారు.
ఈ సందర్భంగా మారయ్య మాట్లాడుతూ.. ఇటీవల నిర్వహించిన భిక్షాటన చేసిన డబ్బులను వారికి అందిస్తామని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ఆటో డ్రైవర్లు ప్రశాంతంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో కార్మికులంతా రోడ్డున పడ్డారని అన్నారు. ఆటో డ్రైవర్లమంతా ఎన్ని విజప్తులు చేసినా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదని చెప్పారు. అందుకే ఇందిరాపార్క్ ధర్నాచౌక్లో ఆదివారం ఉదయం 11 గంటలకు చలో హైదరాబాద్-మహా ధర్నాలో రాష్ట్రవ్యాప్తంగా ఆటో కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.