కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను సమున్నతంగా నిలిపింది. ఆర్థిక పురోగతికి అవసరమైన అన్నిరంగాల్లో రాష్ర్టాన్ని ఆదర్శంగా నడిపింది. తెలంగాణ ప్రగతి ప్రస్థానానికి కితాబిచ్చిన వేదికలెన్నో! ప్రశంసించిన నివేదికలెన్నో! మొన్నటి ఆర్బీఐ రిపోర్ట్ అయినా.. నిన్నటి రాష్ట్ర గణాంక నివేదిక అయినా.. తెలంగాణ విజయయాత్రను వివరించినవే. తాజాగా ఎంఎస్ఎంఈ కౌన్సిల్ 2020-21 నుంచి మూడేండ్ల స్థితిగతులపై ఇచ్చిన నివేదిక వైభవోపేత తెలంగాణను కండ్లముందు నిలిపింది.
అభివృద్ధిలో ఎవరికీ అందకుండా దూసుకుపోతున్న సింగపూర్ వంటి దేశంతో సమానంగా మన తెలంగాణ పెట్టుబడులను ఆకర్షించడంలో కొత్త రికార్డులను నమోదు చేసింది. తెలంగాణే ఆత్మగా, శ్వాసగా ప్రేమించే భూమిపుత్రుడు కేసీఆర్ దూరదృష్టిని ఎన్ని కొలమానాలు కూడా తూచలేవు. ఇది నిజం. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి కంపెనీల ఏర్పాటు, పెట్టుబడులు, ఆర్థికాభివృద్ధి వంటి కీలక అంశాలపై అధ్యయనం చేసే ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ తాజా నివేదిక గణాంకాలతో సహా కొనియాడింది.
దార్శనికుడు కేసీఆర్ ముందుచూపుతో వందేండ్ల అభివృద్ధికి అవసరమైన రోడ్డుమ్యాప్‌ను రూపొందించి పసిగుడ్డు తెలంగాణను పరుగులు పెట్టించారు. దానిఫలితమే తెలంగాణ ఆర్థికపురోగతికి అవసరమైన అన్ని రంగాల్లో ఎంతో ఎత్తులో నిలిచింది. మొన్నటి రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అయినా.. నిన్నటి రాష్ట్ర గణాంక నివేదిక-2024 (అట్లాస్) అయినా.. నేటి ఎంఎస్ఎంఈ రిపోర్ట్ అయినా.. ఇలా ఏ నివేదికను తెరిచిచూసినా.. కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ కొత్త శిఖరాలకు ఎదిగిందనేది సుస్పష్టమవుతున్నది.
Telangana | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): అరచేయితో సూర్యకాంతిని ఎంతోకాలం ఆపలేరు. వాస్తవాలను అబద్ధపు ప్రచారంతో నిలువరించలేరు. కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదని విమర్శలు గుప్పిస్తున్న వారికి చెంపపెట్టులాంటి వార్త ఇది. పెట్టుబడులను ఆకర్షించడంలో, కంపెనీల ఏర్పాటులో, ఉద్యోగకల్పనలో, సాగు విస్తీర్ణాన్ని పెంచడంలో, ధాన్యం ఉత్పత్తిలో, రాష్ర్టాన్ని విద్యుత్తు దివ్వెగా మార్చడంలో, తలసరి ఆదాయంలో, జీఎస్డీపీలో ఇలా ప్రతీ అంశంలో దేశంలో మరే రాష్ట్రమూ సాధించని ఘనతను అతికొద్దికాలంలోనే తెలంగాణ సాధించింది. ఈ మేరకు ‘స్టడీ ఆన్ ఇన్వెస్ట్మెంట్, డెవలప్మెంట్ అండ్ గ్రోత్ ఇన్ ప్రొగ్రెసివ్ తెలంగాణ అండ్ ఎమర్జింగ్ అన్లిమిటెడ్ అపార్చునిటీస్’ పేరిట ఎం ఎస్ఎంఈ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ బుధవారం విడుదల చేసిన నివేదికతో తేటతెల్లమెంది. 2020-21 నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో జరిగిన సర్వోన్నతార్థికాభివృద్ధిని ఈ నివేదిక గణాంకాలతో సహా వివరించింది.
ఏ రాష్ట్రమైనా ఆర్థిక పురోగతి దిశలో పయనిస్తుందో లేదో తెలుసుకోవాలంటే ఆ రాష్ర్టానికి వచ్చే పెట్టుబడులే గీటురాయి. కేసీఆర్ పాలనలో తెలంగాణకు పెట్టుబడుల వరదపారిందన్న విషయం ఇప్పటికే పలు నివేదికల్లో వెల్లడైంది. తాజాగా ఎంఎస్ఎంఈ విడుదల చేసిన నివేదికలోనూ ఇదే విషయం సుస్పష్టమైంది. 2021-22 నుంచి 2023-24 మధ్య తెలంగాణకు కొత్త పెట్టుబడుల ప్రతిపాదనలు రూ. 3,25,110 కోట్ల మేర వచ్చినట్టు నివేదిక తేల్చిచెప్పింది. మూడేండ్లలో వచ్చిన రూ.3.25 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనల్లో పూర్తైన ప్రాజెక్టుల విలువ రూ.75 వేల కోట్లుగా ఉన్నట్టు నివేదిక వెల్లడించింది.
రాష్ట్ర ఆర్థిక పురోగతికి కొలమానంగా నిలిచే జీఎస్డీపీ, తలసరి ఆదాయం పెరుగుదలలో ఒక్క ఏడాదిలోనే తెలంగాణ కొత్త రికార్డులను నమోదు చేసింది. 2022-23లో జీఎస్డీపీ రూ.13,11,823 కోట్లుగా ఉంటే.. 2023-24నాటికి అది రూ.15,01,981 కోట్లకు చేరింది. 2022-23లో తలసరి ఆదాయం రూ.3,45,225గా ఉంటే ఆ మరుసటి ఏడాదికి రూ.3,93,384కు పెరిగింది. ఈ మేరకు ఎంఎస్ఎంఈ నివేదిక వెల్లడించింది.
ఐటీ, పారిశ్రామిక రంగంలో పదేండ్ల బీఆర్‌ఎస్‌పాలనలో చేపట్టిన విప్లవాత్మకమైన కార్యక్రమాల కారణంగా సేవల రంగంలో తెలంగాణ దేశంలోనే టాప్ ప్లేస్‌లో నిలిచింది. 2014తో పోలిస్తే, 2023నాటికి రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో జతచేరిన అదనపు విలువలో (గ్రాస్ స్టేట్ వ్యాల్యూయాడెడ్-జీఎస్వీఏ) వ్యవసాయరంగం ఏకంగా 165% మేర వృద్ధిరేటును సాధించింది. సాగువిస్తీర్ణంలో 117% పెంపు, ధాన్యం ముఖ్యంగా వరి దిగుబడి 350% మేర పెరుగడమే దీనికి కారణమని నివేదిక వెల్లడించింది. ఇదేసమయంలో జీఎస్వీఏలో సేవారంగం వాటా 62.9% నమోదైనట్టు నివేదిక వివరించింది. 2020-21లో రూ. 64,539 కోట్లుగా ఉన్న వస్తు ఎగుమతులు.. 2023-24కు వచ్చేనాటికి రూ.1,16,527 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో కొత్త కంపెనీల రిజిస్ట్రేషన్లు, కొత్త ఫ్యాక్టరీలు-స్టార్టప్‌ల ఏర్పాటు, స్థాపిత విద్యుత్తు సామర్థ్యంలో పెంపు, ఐటీ ఎగుమతులతో పాటు ఐటీ-ఐటీఈఎస్ రంగంలో కొత్త ఉద్యోగాలు కూడా గణనీయంగా పెరిగినట్టు నివేదిక వెల్లడించింది. స్టేట్ ఎకానమీలో పారిశ్రామిక రంగం వాటా 18.5% ఉన్నట్టు నివేదిక వివరించింది.
జనాభా, విస్తీర్ణాన్ని బేరీజువేసుకొని చిన్న రాష్ర్టాల ప్రాతిపదికన చూస్తే స్వతంత్ర భారతావనిలో మూడేండ్ల సమయంలో రూ.3.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. సింగపూర్ వంటి అభివృద్ధి చెందిన దేశాలకు వచ్చే పెట్టుబడులు తెలంగాణ వంటి రాష్ట్రం సాధించడం ఎంతో గొప్ప విషయం.
– ముంబైకి చెందిన ఓ పారిశ్రామికవేత్త
2021-22 నుంచి 2023-24 మధ్య తెలంగాణలో పెట్టుబడుల వరదపారింది. దేశంలోని పారిశ్రామికవేత్తలకే కాకుండా విదేశీ ఇన్వెస్టర్లకు కూడా పెట్టుబడుల విషయంలో తెలంగాణ ఓ గమ్యస్థానంగా మారింది.
– డాక్టర్ డీఎస్ రావత్, ఎంఎస్ఎంఈ ఈపీసీ చైర్మన్
ఏ రాష్ట్రమైనా.. దేశమైనా ఆర్థిక పురోగతి దిశలో పయనిస్తుందో లేదో తెలుసుకోవాలంటే ఆ రాష్ర్టానికి వచ్చే పెట్టుబడులే గీటురాయి. ఈ విషయంలో సింగపూర్ వంటి దేశాలతో తెలంగాణ పోటీపడుతున్నట్టు పారిశ్రామికవేత్తలు చెప్తున్నారు.
ఉత్పత్తి, ఎగుమతులపైనే రాష్ర్టానికి అదనపు ఆదాయమూ, జీఎస్డీపీలో పెరుగుదల ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో తెలంగాణ అంచెలంచెలుగా ఎదిగింది.
ఉమ్మడిపాలనలో అంధకారంలో ఉన్న తెలంగాణను వెలుగుల దివ్వెగా కేసీఆర్ తీర్చిదిద్దారు. స్థాపిత విద్యుత్తు సామర్థ్యంలో కనిపించిన పెరుగుదలే దీనికి నిదర్శనం.
2020-21 14,041.7 మెగావాట్లు
2021-22 14,892.9 మెగావాట్లు
2022-23 15,039.1 మెగావాట్లు
కంపెనీల ఏర్పాటు పెరిగితే ఆ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నట్టు భావించాలి. ఫ్యాక్టరీల ఏర్పాటులో, కంపెనీల రిజిస్ట్రేషన్లలో తెలంగాణ దూసుకుపోయింది.
2016లో తెలంగాణలో స్టార్టప్స్ 400
2022లో తెలంగాణలో స్టార్టప్స్ 2000
ఒక రాష్ట్ర ప్రగతికి జీఎస్డీపీనే కొలమానం. దేశ జనాభాలో 2.9 శాతం వాటా మాత్రమే కలిగిన తెలంగాణ.. దేశ జీడీపీలో 5.2 శాతం మేర వాటా కలిగి ఉన్నది
రాష్ట్ర ఆర్థిక పురోగతికి తలసరి ఆదాయ వృద్ధి కూడా ముఖ్యమే. పౌరుల తలసరి ఆదాయం పెరుగుదలలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నది.