హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): శాసనసభ సమావేశాల్లో భాగంగా గురువారం మండలిలోనూ వివిధ అంశాలపై చర్చ జరిగింది. ఎమ్మెల్సీలు కవిత, ప్రభాకర్‌రావు రైతు రుణమాఫీ, ఆర్టీసీ విలీనంపై ధన్యవాద తీర్మానాలు ప్రవేశపెట్టారు. కొత్తగా ఎన్నికైన సభ్యులను చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సభకు పరిచయం చేశారు. వరదల సందర్భంగా సీఎం కేసీఆర్ ముందుచూపుతో వ్యవహరించి పెనునష్టం జరగకుండా చూశారని సభ్యులు ప్రశంసించారు. కేంద్రం వరద సాయం ఊసెత్తకపోవడంపై దుమ్మెత్తిపోశారు.
బండికి బండి ఇస్తామన్నోళ్లు పత్తాలేరు: బండ ప్రకాశ్
గతంలో హైదరాబాద్‌లో అకాల వర్షాలు సంభవించినప్పుడు బండికి బండి.. గుండుకు గుండు ఇస్తామని నినాదాలిచ్చినొళ్లు ఇప్పటి వరకు పత్తాలేకుండా పోయారని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ బీజేపీ నేతలపై ధ్వజమెత్తారు. ‘రాష్ట్రం అత్యధిక వర్షపాత పర్యవసానాలు – ప్ర భుత్వం చేపడుతున్న చర్యల’పై శాసనమండలిలో జరిగిన లఘు చర్చను ప్రారంభించి బండా ప్రకాశ్ మాట్లాడారు. ఎస్డీఆర్ఎఫ్ ద్వారా రూ. 500 కోట్లు నిధులొస్తే అడ్వాన్స్‌గా 10శాతం మాత్రమే వినియోగించుకునే అవకాశముందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రైతుల కోసం రూ. 150కోట్లు కేటాయించి ఆదుకున్నట్టు సభకు వివరించారు.
బీజేపీ వరద సాయం ఇచ్చి మాట్లాడాలి: కడియం
వరద బాధితులపై బీజేపీకి నిజంగానే ప్రేమ ఉంటే కేం ద్రం వరద సాయం అందించిన తర్వాతే మాట్లాడాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సూచించారు. బురద రాజకీయాలు మానుకోవాలని విపక్షాలకు హితవు పలికారు. సీఎం కేసీఆర్ ముందస్తు హెచ్చరికలతో అధికార యంత్రాం గం అప్రమత్తమై తక్షణ సహాయక చర్యలు చేపట్టిందని తెలిపారు. భవిష్యత్తులో ముంపు సమస్య తలెత్తకుండా ఉండాలంటే వరంగల్‌లో భూగర్భ డ్రైనేజీ, స్ట్రామ్‌వాటర్ డ్రైన్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. మోరంచపల్లి, కొండయ్య గ్రామ ప్రజలకు ఎత్తైన ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి వారిని అక్కడికి తరలించాని కోరారు.
దేశంలో తెలంగాణ భాగం కాదా?: జీవన్‌రెడ్డి
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు గత ప్రభుత్వాలు పదివేలు పరిహారంగా ఇచ్చాయని, ఇది గొప్ప విషయమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. 2018-22 వరకు ఎన్డీఆర్ఎఫ్ కింద కేంద్రం రూ. 44,214 కోట్లు విడుదల చేసినా రాష్ర్టానికి రూపాయి ఇవ్వలేదని ఆరోపించా రు.గుజరాత్‌కు నిధులిచ్చారని, ఆ రాష్ట్రం దేశంలో భాగమైనప్పుడు తెలంగాణ కూడా దేశంలో భాగమేనన్న సంగతిని మర్చిపోకూడదని హితవు పలికారు. 2020లో జరిగిన నష్టానికి కేంద్రం నుంచి తగిన సహాయం అందలేదని, రూ.1,350 కోట్లకు ప్రతిపాదనలు పంపిస్తే నయా పైసా విదల్చలేదని మండిపడ్డారు.
గెస్ట్ యాక్టర్లలా విపక్షాల తీరు: తాతా మధు
వరదల సందర్భంగా తాము బాధితుల కుటుంబ సభ్యు ల్లా వ్యవహరిస్తే విపక్ష నేతల తీరు మాత్రం గెస్ట్ యాక్టర్లను తలపించిందని టీఆర్ఎస్ సభ్యుడు తాతా మధు ఎద్దేవా చేశారు. ఖమ్మంలో తాము ప్రతి ఇల్లూ తిరిగి బాధితుల్లో భరోసా నింపితే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మాత్రం అంతా అయిపోయాక వచ్చి మీడియాలో వార్తల కోసం చిల్లర మాటలతో బురద రాజకీయాలు చేశారని మండిపడ్డారు. అధికార యంత్రాంగం అప్రమత్తమై మున్నేరు శివారు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించడంతో నష్టం తప్పిందని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో రోడ్ల పునరుద్ధరణ, మున్నేరు వాగుకు కరకట్ట నిర్మాణం కోసం అదనపు నిధులు కేటాయించాలని కోరారు.
మోదీ దేశం మొత్తానికి ప్రధాని కాదా?: నర్సిరెడ్డి
రాష్ర్టాల విషయంలో కేంద్రం విధానం సరిగా లేదని ఎమ్మె ల్సీ నర్సిరెడ్డి ఆక్షేపించారు. గుజరాత్లో వరదలు రాగానే ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా వెంటనే అక్కడ వాలిపోయారని, ఇప్పుడు తెలంగాణలో వరదలు బీభత్సం సృష్టించినా రాలేదని పేర్కొన్నారు. మోదీ ప్రధాని అయ్యింది దేశానికో, గుజరాత్‌కో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్‌లో వరదనీటి కాలువలు ఏర్పాటు చేయాలని కోరారు. ఖమ్మంలోని మున్నేరు వాగుకు కరకట్టలు నిర్మించాలని, మోరంచపల్లికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని నర్సిరెడ్డి కోరారు.
ఆ మాటనడం సిగ్గుచేటు: తక్కళ్లపల్లి రవీందర్రావు
సీఎం కేసీఆర్ ప్రాజెక్టులు కట్టడంతోనే వరదలొచ్చాయని నాయకులు అనడం సిగ్గుచేటని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు అన్నారు. చర్చలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో ఒక నాయకుడు ఇలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోరంచపల్లిలో రాత్రి ఒంటి గంట నుంచి 4 గంటల మధ్య 64 సెంటీమీటర్ల వర్షపాతం కురవడంతోనే విపత్తు సంభవించిందని తెలిపారు. ప్రకృతి విపత్తును, ఉపద్రవాన్ని మానవీయకోణంలో చూడలేని ప్రతిపక్షాలకు ప్రజలు సరైన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
సభకు ఐదుగురు కొత్త సభ్యులు
శాసనమండలికి కొత్తగా ఎన్నికైన సభ్యులను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సభకు పరిచయం చేశారు. రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన కే నవీన్‌రావు, తొలిసారిగా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సభ్యులు దేశపతి శ్రీనివాస్, చల్లా వెం కట్రాంరెడ్డి, ఏవీఎన్ రెడ్డి, మీర్జా రహమత్ బేగ్‌లను సభకు పరిచం చేశారు. ఉమ్మడి ఏపీలో ఎమ్మెల్సీగా సేవలందించిన వెంకటనర్సింహాచారి మృతికి శాసన మండలి సంతాపం వ్య క్తం చేసింది. ఈ సంతాప తీర్మానాన్ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సభలో చదివి వినిపించగా, సభ్యులంతా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
రుణమాఫీ, ఆర్టీసీ విలీనంపై ధన్యవాద తీర్మానాలు
ప్రవేశపెట్టిన ఎమ్మెల్సీలు కవిత, ప్రభాకర్‌రావు
రైతు రుణమాఫీ, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంపై ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అభినందిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు గురువారం మండలిలో తీర్మానాలను ప్రవేశపెట్టారు.రుణమాఫీపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆర్టీసీ విలీనంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, శాసనమండలి విప్ ఎంఎస్ ప్రభాకర్‌రావు ధన్యవాద తీర్మానాలను ప్రవేశపెట్టారు. రూ. 19 వేల కోట్ల రైతు రుణమాఫీని ప్రకటించిన ప్రభుత్వం గురువారం నుంచే దానిని అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా 43,373 మంది కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు.
ఓల్డ్‌సిటీకి తప్పిన ముంపు: మీర్జా రహమత్‌బేగ్
జీహెచ్ఎంసీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్(ఎస్ఎన్డీపీ) కారణంగా ఓల్డ్‌సిటీలోని చాలా ప్రాంతాలకు ఈసారి ముంపు సమస్య తప్పిందని మజ్లిస్ ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్ తెలిపారు. ఇటీవలి వరదలపై గురువారం శాసనమండలిలో నిర్వహించిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడేండ్ల క్రితం వచ్చిన వరదలకు రాజేంద్రనగర్ పరిధిలో పలువురు మృత్యువాత పడ్డారని గుర్తుచేశారు. ఈసారి అలా జరగకపోవడానికి ప్రభుత్వం చేపట్టిన ఎస్ఎన్డీపీ పథకమే కారణమని పేర్కొన్నారు. పాతబస్తీలో రోడ్ల పునరుద్ధరణతోపాటు వివిధ అభివృద్ధి పనులకు ప్రభుత్వం కేటాయించిన రూ. 252 కోట్లు సరిపోవని, వీటిని రూ. 1000 కోట్లకు పెంచాలని కోరారు.