2021-23 సంవత్సరానికి ఏ 4 రిటెయిల్ మద్యం షాపుల లైసెన్సుల్లో గౌడ్లకు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% రిజర్వేషన్లు కల్పిస్తున్నామని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. సభ్యులు ప్రకాశ్‌గౌడ్, గాదరి కిషోర్ అడిగిన ప్రశ్నలకు జవాబిస్తూ దీనిపై త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తామని. వైన్స్ షాపులకు జిల్లాలవారీగా రిజర్వేషన్లను లక్కీడ్రా ద్వారా కల్పిస్తామని తెలిపారు.
రాష్ట్రంలో రెండో దశలో 3.50 లక్షల గొర్రెల యూనిట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యామని పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. సభ్యులు నోముల భగత్, అంజయ్య, జీవన్‌రెడ్డి, కైసర్, సండ్రవెంకటవీరయ్య ప్రశ్నలకు జవాబిస్తూ డీడీలు కట్టినవారికి ఏడాదిన్నరలో గొర్రెలు అందజేస్తామని తెలిపారు. మాంసంమార్కెట్ల ఏర్పాటుద్వారా బ్రాండింగ్చేసే ఆలోచన ఉన్నదన్నారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 12 ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ ఆఫీస్ కాంప్లెక్స్ (ఐడీఓసీ)ల నిర్మాణం పూర్తయ్యిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. సభ్యుడు ఆత్రం సక్కు అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ.. ఇప్పటివరకు రూ.1,365 కోట్లు 25 జిల్లాల్లో ఐడీవోసీల నిర్మాణానికి, రూ.1,065 కోట్లతో కలెక్టర్లు, సబ్కలెక్లర్లు, డిపార్ట్మెంట్ హెడ్స్‌కు గృహాల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. మార్చి నాటికి నిర్మాణం పూర్తిచేస్తామని తెలిపారు. అనంతరం జీరోఅవర్‌లో పలువురు ఎమ్మెల్యేలు నియోజకవర్గాలవారీగా సమస్యలను సభ దృష్టికి తీసుకురాగా.. పరిశీలించి పరిష్కరిస్తామని మంత్రులు సమాధానం ఇచ్చారు.
శాసనసభ సమావేశాలకు కాంగ్రెస్ సభ్యులు సోమవారం హాజరు కాలేదు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో భారత్ బంద్ కార్యక్రమం జరిగిన కారణంగా ఆ పార్టీకి చెందిన సభ్యులు గైర్హాజర్ అయ్యుంటారని భావిస్తున్నారు. సభలో పరిశ్రమల శాఖపై జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా సభలో ప్రతిపక్ష సభ్యులు ఉండిఉంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడ్డారు.