బంజారాహిల్స్, ఫిబ్రవరి 6: ‘నిద్దుర లేదు.. సుఖం లేదు.. దెబ్బ మీద దెబ్బ. పుండు మీద కాకి పొడిచినట్టు పొడుస్తున్నర్ర..’ ఇది సై సినిమాలోని డైలాగ్ ఇది. ఖైరతాబాద్ ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్‌ది కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితే. సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో నిస్పృహలో ఉన్న ఆయన సొంత నియోజకవర్గంలో భూమి పూజ కార్యక్రమానికి హాజరుకాలేదు. స్థానిక నేతలే ఆ కార్యక్రమం పూర్తిచేయాలని పురమాయించారు.
బీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై గెలిచిన ఆయన కాంగ్రెస్‌లోకి జంప్ అయిన నాటి నుంచి ఆ పార్టీలో ఇమడలేక సతమతమవుతున్నారు. సుప్రీంకోర్టులో జరుగుతున్న ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ ఆయనకు ఊపిరాడనివ్వడం లేదు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్‌లోని బీజేఆర్ నగర్ బస్తీలో గురువారం ఓ పాఠశాల నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకావాల్సి ఉన్నా ఆయన వెళ్లలేదు.
దీంతో కాంగ్రెస్ సీనియర్ నేత మామిడి నర్సింగరావు భూమి పూజ చేశారు. దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని స్థానిక ప్రతిపక్ష నేతలు నిర్ణయించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆదేశాలతోనే తాను భూమిపూజ చేశానని, ఎమ్మెల్యే బిజీగా ఉన్నారని మామిడి నర్సింగరావు పేర్కొనడం కొసమెరుపు.