హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం శాసనసభ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు నోటీసులు జారీచేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి న్యాయస్థానాలను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అసెంబ్లీ కార్యదర్శి మంగళవారం నోటీసులు జారీచేయటం చర్చనీయాంశమైంది. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అమలు కోసం రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైన రోజునే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ నోటీసులతో ఎమ్మెల్యేలు పయనం ఎటు? వారి రాజకీయ భవిష్యత్తు ఏమిటి ?అన్నదానిపై ఉత్కంఠ నెలకొన్నది. నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ అసెంబ్లీ లాబీలో స్పందించారు. తనకు ఎలాంటి నోటీసులు రాలేదని, వచ్చాక స్పందిస్తానని దానం నాగేందర్ పేర్కొనగా, తనకు నోటీసులు అందాయని కడియం శ్రీహరి చెప్పారు.
సుప్రీంకోర్టు ఆదేశాలు, శాసనసభ కార్యదర్శి నుంచి నోటీసులు వచ్చిన నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్‌తోపాటు పది మంది ఎమ్మెల్యేలు మంగళవారం శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసేందుకు ప్రయత్నించారు. అయితే, మంత్రివర్గ సమావేశం, ఆ తర్వాత వరుసగా బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ తదితర అంశాలపై సీఎం స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉండటంతో ఆయన కుదరదని చెప్పినట్టు తెల్సింది. దీంతో ప్రభుత్వ ముఖ్యసలహాదారుడు వేం నరేందర్‌రెడ్డితో ఫిరాయింపు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. సుప్రీంకోర్టులో కేసు విచారణకు వస్తున్నదని, తమ భవిష్యత్తు ఏమిటని వారు ప్రశ్నించినట్టు తెల్సింది. సుప్రీంకోర్టు చేసిన ఘాటు వ్యాఖ్యలను బట్టి త్వరలోనే ఏదో ఒక నిర్ణయం తీసుకునేలా కనిపిస్తున్నదని, ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకొని తాము అనర్హులమైతే ఏం చేయాలని వారు అడిగినట్టు సమాచారం. దీనికి వేం నరేందర్‌రెడ్డి స్పందిస్తూ.. మంచి న్యాయవాదిని పెడ్తామని, ప్రభుత్వం తరఫున ఇప్పటికే దేశంలోని అత్యంత పేరున్న న్యాయవాదులను ఎంగేజ్ చేశామని చెప్పినట్టు తెల్సింది. కొంతకాలం సాగదీద్దామని, పరిస్థితులు అనుకూలంగా మారుతాయని భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినట్టు సమాచారం. ఒకవేళ తమపై అనర్హత వేటు పడితే ఉప ఎన్నికల్లో గెలువడం ఇబ్బందవుతుందని, తమ నియోజకవర్గాలకు హామీ ఇచ్చిన మేరకు నిధులను మంజూరు చేయాలని, వాటిని త్వరగా ప్రారంభించుకుంటామని వారు చెప్పినట్టు తెలిసింది. తమకు పార్టీ తరఫున ఇచ్చిన హామీ మేరకు పదవులు, పనుల విషయంలో చొరవ తీసుకోవాలని కూడా వారు కోరినట్టు సమాచారం.
అసెంబ్లీ లాబీలో కడియం శ్రీహరి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. తనకు ఇచ్చిన నోటీసుకు కాలపరిమితి ఏదీలేదని చెప్పారు. ‘మెల్లగా రిైప్లె ఇస్తాం. తొందరేముంది?’ అని అన్నారు. సంవత్సరంపాటు సాగదీస్తామని, ప్రభుత్వం సుప్రీంకోర్టులో గట్టిగా కొట్లాడేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. ఈలోగా నియోజకవర్గంలో చేయాల్సినంత అభివృద్ధి పనులు చేసుకుంటామని పేర్కొన్నారు. అప్పటికి ఏదైనా స్పష్టత వచ్చాక, రిజైన్ చేయాల్సి వస్తే ఏడాదిన్నరకో..రెండేండ్లకో చేస్తామని వెల్లడించారు.