హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : ప్రొటోకాల్ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తంచేశారు. జిల్లాల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల పర్యటనలకు, కొన్నిసార్లు స్పీకర్, మండలి చైర్మన్లకు కూడా అధికారులు ప్రొటోకాల్ పాటించడంలేదని సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ దృష్టికి తీసుకొచ్చారు. అసెంబ్లీ సమావేశాలను ఈనెల 24న ప్రారంభించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో గురువారం స్పీకర్ చాంబర్లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ ప్రసాద్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ నెల 23న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం రాష్ట్రప్రభుత్వం కూడా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సి ఉన్నందున తగిన ఏర్పాట్లపై చర్చించారు. జిల్లాల్లో స్పీకర్, చైర్మన్ పర్యటించినప్పుడు ఆర్డీవో, కనీసం ఎమ్మార్వో స్థాయి అధికారి రావాల్సి ఉన్నా ఎక్కడా పాటించడంలేదని, జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో కనీస ప్రొటోకాల్ పాటించడం లేదని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు.
మంత్రుల పర్యటనల్లోనూ పోలీసులు ప్రొటోకాల్ పాటిండచం లేదని చెప్పారు. ఎస్సై స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయాల్సి ఉన్నా అమలు కావడంలేదన్నారు. ప్రొటోకాల్‌పై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, ఇది భవిష్యత్తులో ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలని, అధికారులకు ఆదేశాలివ్వాలని సీఎస్, డీజీపీలకు సూచించారు. జిల్లాలకు కొత్తగా ఉన్నతాధికారులు బదిలీపై వస్తే మర్యాదపూర్వకంగా స్పీకర్, చైర్మన్‌ను కలవాల్సి ఉంటుందని, ఇదికూడా జరగడంలేదని వాపోయారు.
ఎయిర్‌పోర్ట్‌లో స్పీకర్, చైర్మన్, ఇతర చట్టసభల ప్రజాప్రతినిధులకు ప్రొటోకాల్ పాటించడం లేదని, సినిమా వారికి, సెలబ్రిటీలకు పాటిస్తున్న ప్రొటోకాల్‌ను కూడా చట్టసభల అధిపతులు, ప్రజాప్రతినిధులకు ఇవ్వడంలేదని, దీనిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. శాసనసభ, శాసనమండలి, లెజిస్లేచర్ సెక్రటేరియట్లో పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. సమావేశంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.