శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Sep 17, 2020 , 02:33:12

అసెంబ్లీ నిరవధిక వాయిదా

అసెంబ్లీ నిరవధిక వాయిదా

 • కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిర్ణయం
 • 8 రోజులు.. దాదాపు 55 గంటలు
 • 12బిల్లులు, 2 తీర్మానాలు ఆమోదం
 • హుందాతనంతో సాగిన సభ
 • సభా వ్యవహారాల మంత్రి వేముల

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు బుధవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ నెల 7న ప్రారంభమైన సమావేశాలు కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా 8 రోజులపాటు కొనసాగాయి. 12 బిల్లులు, రెండు తీర్మానాలను ఆమోదించాయి. శాసనసభ, శాసనమండలి కలిపి దాదాపు 55 గంటలపాటు సాగాయి. సమావేశాల సందర్భంగా భౌతికదూరం పాటించేలా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నప్పటికీ కరోనా వ్యాప్తి చెందుతుందేమోనని సభ్యులు, అధికారులు సంశయాన్ని వ్యక్తంచేశారు. కరోనా నేపథ్యంలో సభ్యుల క్షేమం దృష్ట్యా సభల్లో వివిధ పార్టీల సభ్యులతో చర్చించి సమావేశాలను కుదించాలని నిర్ణయించామని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. సభను వాయిదావేస్తున్నట్టు ప్రకటించారు. అంతకుముందు అసెంబ్లీలో పోచారం మాట్లాడుతూ.. దేశంలోని వివిధ రాష్ర్ర్టాల శాసనసభలను కరోనా మహమ్మారి దృష్ట్యా రెండు మూడు రోజుల మాత్రమే నిర్వహించుకోవాలని నిర్ణయించాయని చెప్పారు. ఈ పరిస్థితుల్లోనూ తెలంగాణ శాసనసభను సుదీర్ఘంగా నిర్వహించుకున్నట్టు తెలిపారు. సభకు రోజూ అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు, ఇతరులు దాదాపు 1200 మంది హాజరయ్యారు. సభ్యులందరి క్షేమం దృష్ట్యా సమావేశాలను ముగిద్దామని పోచారం ప్రకటించారు. మరోవైపు మండలి సమావేశాలు కూడా చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 

అర్థవంతంగా అసెంబ్లీ సమావేశాలు

శాసనసభా సమావేశాలు అర్థవంతంగా, హుందాతనాన్ని ప్రతిబింబించేలా జరిగాయని శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ప్రారంభంనుంచి కరోనా భయం వెంటాడుతున్నా ఇబ్బంది లేకుండా ఉభయసభలు నిర్వహించుకున్నామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల వాయిదా అనంతరం బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సభల నిర్వహణ కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లడంతోనే ఉభయసభలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రశాంత్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌ను రద్దుచేసినా.. ప్రజా సమస్యల చర్చించడానికి, సీఎం కేసీఆర్‌ ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌ను కొనసాగించారని తెలిపారు. కరోనా సమయంలో 14 రాష్ర్టాల్లో అసెంబ్లీ సమావేశాలు జరుగగా, 12 రాష్ర్టాల్లో రెండు మూడు రోజులే సభ నిర్వహించారని చెప్పారు. సమావేశాల కుదింపు నిర్ణయాన్ని టీఆర్‌ఎస్‌ గౌరవిస్తున్నదని చెప్పారు. సభలో 103 మంది సభ్యులు ఉన్న టీఆర్‌ఎస్‌తో సమానంగా ఎంఐఎం, కాంగ్రెస్‌ సభ్యులు మాట్లాడారని చెప్పారు. ఈ సమావేశంలో చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, విప్‌లు బాల్క సుమన్‌, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు పాల్గొన్నారు. 

పరీక్షలు.. భౌతికదూరం

సమావేశాల్లో మూడు అంశాలపై లఘ చర్చ నిర్వహించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, సిట్టింగ్‌ సభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి మృతికి సంతాపం తెలిపారు. కరోనా నేపథ్యంలో సభ్యులతోపాటు సిబ్బంది, పోలీసులు, మీడియా ప్రతినిధులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌ నిర్వహించారు. 

అసెంబ్లీలో వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ ప్రారంభం

శాసనసభ భవనంలో నూతనంగా ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యాన్ని బుధవారం స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ ఐటీశాఖ దీన్ని ఏర్పాటు చేసింది. ఈ సౌకర్యాన్ని స్పీకర్‌, మండలి చైర్మన్‌, మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉపయోగించుకోవడానికి అనువుగా ఉం టుంది. ఈ కార్యక్రమంలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌, డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌రావు, మంత్రులు వేముల, ఈటల, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి, పువ్వాడ,  శ్రీనివాస్‌గౌడ్‌, సత్యవతి రాథోడ్‌, గంగుల, అసెంబ్లీ కార్యదర్శినర్సింహాచార్యులు పాల్గొన్నారు.

అసెంబ్లీ నిర్వహణ

 • సభ నిర్వహించిన రోజులు : 8 రోజులు
 • సభ సాగిన సమయం: 31 గంటల 52 నిమిషాలు
 • మాట్లాడిన సభ్యులు : 70 మంది
 • ప్రశ్నోత్తరాల్లో ప్రశ్నలు, అడిగినవారు: 80 మంది
 • 29 ప్రశ్నలకు రాతపూర్వక సమాధానాలు
 • 10 ప్రశ్నలకు సభ ముందు సమాధానాలిచ్చారు. 
 • ఆమోదం పొందినవి: 12 బిల్లులు, 2 తీర్మానాలు
 • లఘ చర్చ నిర్వహించినవి: 3 అంశాలు

అసెంబ్లీలో ఎవరు ఎంతసేపు మాట్లాడారు

 • సీఎం కేసీఆర్‌ : 4.52  గంటలు
 • అక్బరుద్దీన్‌ ఎంఐఎం : 2.27  గంటలు  
 • మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్‌ : 2.37 గంటలు 

పార్టీలవారీగా మాట్లాడిన సమయం

 • సీఎం కేసీఆర్‌, మంత్రులు : 15.06 గంటలు 
 • టీఆర్‌ఎస్‌ సభ్యులు : 8 .39 గంటలు
 • ఎంఐఎం : 3.05 గంటలు 
 • కాంగ్రెస్‌ : 3.54 గంటలు
 • టీడీపీ : 35 నిమిషాలు 
 • బీజేపీ : 17 నిమిషాలు 

శాసనసమండలిలో...

 • సభ జరిగిన రోజులు : 8
 • సభ జరిగిన సమయం : 22.57 గంటలు 
 • మాట్లాడిన మంత్రులు : 14 మంది
 • ఆమోదించిన తీర్మానాలు : 2
 • ఆమోదించిన బిల్లులు : 12
 • లఘ చర్చలు : 2

మండలిలో మాట్లాడిన గంటలు 

 • సీఎం కేసీఆర్‌ : 1.28 గంటలు
 • ఎంఐఎం ఫ్లోర్‌ లీడర్‌ జాఫ్రీ : 1.04 గంటలు
 • కాంగ్రెస్‌ నేత జీవన్‌రెడ్డి : 2.02 గంటలు 
 • బీజేపీ నేత రాంచందర్‌రావు : 1.13 గంటలు  


logo