హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): అర్హులైన వారందరూ ఈ నెల 30న ఓటు హక్కు వినియోగించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు విజ్ఞప్తి చేశారు. శనివారం (ట్విట్టర్) ఎక్స్‌లో ఓటు హక్కు వినియోగంపై స్పందిస్తూ.. పట్టణాల్లో ఓటింగ్ 50 శాతం కంటే తక్కువగా నమోదవుతున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయని గుర్తుచేశారు. ‘ఓటు హక్కు ఉన్న వారందరూ ఇష్టమైన వారికి ఓటు వేయండి. కానీ, ఓటు హక్కు మాత్రం వినియోగించుకోండి.
మీతోపాటుగా మీ చుట్టుపక్కల వారిని కూడా ఓటు హక్కు వినియోగించుకొనే విధంగా ప్రోత్సహించండి’ అని కేటీఆర్ సూచించారు. ప్రతి ఎన్నిక ఫలితం ఓటు వేసేవారితో నిర్ణయించబడుతుందని లార్రి జె సబాటో సూక్తిని ఈ సందర్భంగా ఉదహరించారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్కు మద్దతు తెలిపి, ఉత్సాహపరిచిన, అచంచల విశ్వాసం చూపించిన వారందరికీ కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. తొమ్మిదేండ్లలో అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ కొత్త పుంతలు తొక్కిందని పేర్కొన్నారు.