KTR | హైదరాబాద్, డిసెంబర్ 20 ( నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్‌పై పెట్టిన ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసు శుక్రవారం ఉభయసభల్లో ప్రకంపనలు సృష్టించింది. కేసుపై చర్చించాలని పట్టుబడుతూ బీఆర్ఎస్ సభ్యులు చేపట్టిన ఆందోళనలతో శాసనసభ, శాసనమండలి దద్దరిల్లాయి. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళనల మధ్యనే భూ భారతి బిల్లుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి ప్రసంగించగా, మండలిలో బీఆర్ఎస్ను ఎదుర్కోవడంలో అధికారపార్టీ పూర్తిగా విఫలమైంది. మండలిలో శుక్రవారం మూడు బిల్లులను ప్రవేశపెట్టాల్సి ఉండగా, ప్రభుత్వం ఆ పని చేయలేకపోయింది. కేటీఆర్‌పై కేసును నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు శుక్రవారం నల్లబ్యాడ్జీలు ధరించి ఉభయసభలకు హాజరయ్యారు. ఈ-కార్ రేసింగ్‌పై చర్చించాలని ఉభయసభల్లోనూ పట్టుబట్టి, సభను అడ్డుకున్నారు. దీంతో ఒకటికి రెండుసార్లు ఉభయసభలు వాయిదాపడ్డాయి. శాసనమండలిలో మూడోసారి సమావేశమైన తరువాత కూడా సభ అదుపులోకి రాకపోవడంతో చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సభను శనివారానికి వాయిదా వేశారు.
శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకాగానే భూభారతిపై చర్చను చేపట్టనున్నట్టు స్పీకర్ ప్రకటించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి మాట్లాడే అవకాశమిచ్చారు. ఈ-కార్ రేసింగ్‌పై చర్చను అనుమతించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కోరారు. రెండు చేతులెత్తి దండం పెడుతూ.. ‘స్పీకర్ సార్ చర్చకు అనుమతించండి’ అని విజ్ఞప్తి చేశారు. ‘ప్రశ్నోత్తరాలు ఎలాగూ లేవు. రాత్రి 12 గంటల వరకు చర్చిద్దాం.. ఈ-కార్ రేసింగ్‌పై చర్చకు అనుమతించాలి’ అని కోరారు. ప్రభుత్వానికి దమ్ము, చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. అయినా స్పీకర్ అనుమతించలేదు.
కేటీఆర్‌ను అప్రతిష్ఠపాలు చేసి బీఆర్ఎస్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు. అసెంబ్లీ నడిచే సమయంలో ఒక ఎమ్మెల్యేపై అక్రమ కేసు పెట్టారని, ఫార్ములా-ఈ కార్ రేస్‌పై చర్చకు స్పీకర్ చాంబర్లో కలిసి విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఫార్ములా-ఈ కార్ రేస్ అంశంలో రకరకాల లీకులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము తప్పు చేశామంటున్నారని, సభలో చర్చించి అదేదో చెప్పాలని డిమాండ్ చేశారు. తాము చేసింది ఎందుకు తప్పుకాదో ఈ సభ ద్వారా తాము కూడా ప్రజలకు చెప్తామని స్పష్టంచేశారు. ప్రభుత్వం పెట్టింది అక్రమ కేసు కాకుంటే సభలో చర్చించాలని సవాల్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం ముందు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో సభను స్పీకర్ వాయిదా వేశారు.
మళ్లీ సభ ప్రారంభంకాగానే స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ బీఆర్ఎస్ సభ్యులను సముదాయించే ప్రయత్నం చేశారు. భూ భారతిపై చర్చ అనంతరం తన చాంబర్‌కు పిలిపించి మాట్లాడతానని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ సభ్యులు శాంతించలేదు. ఇదే సమయంలో మంత్రి పొంగులేటికి స్పీకర్ మాట్లాడే అవకాశమిచ్చారు. భూ భారతిపై మంత్రి పొంగులేటి మాట్లాడారు. ఆ తర్వాత బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రసంగించారు. మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతున్నప్పుడు ‘బడే భాయ్.. ఛోటే భాయ్’ అంటూ బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సభను వాయిదావేశారు. విరామం తర్వాత అసెంబ్లీ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ సభ్యులు నిరసన కొనసాగించారు. నిరసనగా బయటకు వెళ్లిపోయారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళనకు పోటీగా అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. కొందరు సభ్యులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సీట్ల వైపు దూసుకొచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అత్యంత వేగంగా హరీశ్‌రావును సమీపించారు. 55 మంది మార్షల్స్ సభలో మోహరించారు.
హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి కేటీఆర్‌పై పెట్టిన ఫార్ములా-ఈ రేస్ కేసును ఎత్తివేయాలంటూ బీఆర్ఎస్ సభ్యులు చేసిన ఆందోళనలతో శాసనమండలి దద్దరిల్లింది. ఒకటికి రెండుసార్లు సభను వాయిదా వేసినా పరిస్థితి అదుపులోకి రావడంతో చివరకు ఏ చర్చా జరగకుండానే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సభను శనివారానికి వాయిదా వేశారు. మండలిలో ప్రతిపక్ష నేత మధుసూధనాచారి ఆధ్వర్యంలో శుక్రవారం నల్లబ్యాడ్జీలతో హాజరైన బీఆర్ఎస్ సభ్యులు సమావేశాన్ని స్థంభింపచేశారు. కేటీఆర్‌పై పెట్టిన ఫార్ములా-ఈ రేస్ కేసును ఎత్తివేయాలని ఆందోళనకు దిగారు. సభ సాగకపోవడంతో చైర్మన్ తొలుత 15 నిమిషాలపాటు వాయిదా వేశారు. ఉదయం 11:20 గంటలకు మండలి సమావేశం తిరిగి ప్రారంభమైనప్పటికీ, బీఆర్ఎస్ ఆందోళనలకు దిగింది. చర్చ లేకుండానే చైర్మన్ సభను శనివారానికి వాయిదా వేశారు. బీఆర్ఎస్ సభ్యులు మీడియా పాయింట్ వద్ద నిరసన తెలిపారు.
కేటీఆర్‌పై పెట్టిన కేసు ఎత్తివేయాలని సభలో చర్చ పెట్టాలన్న డిమాండ్లతో ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ సభ్యులను మండలి చైర్మన్ వారించే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ సభ్యులు వెనక్కి తగ్గలేదు. కేసుపై చర్చ జరగాలని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో చైర్మన్, మంత్రులు నిశ్చేష్టులయ్యారు.
సభలో షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకరయ్య వైఖరి వివాదాస్పదమైంది. ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఆయన పేపర్ విసిరే ప్రయత్నం చేస్తున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. ఆ తర్వాత ఆయన చెప్పు తీసి విసరబోయారని, వాటర్ బాటిల్ విసిరేయబోయారంటూ సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. ఇటీవలే వీర్లపల్లి శంకరయ్య వెలమ కులంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భౌతికదాడులకు దిగుతామని బెదింరించారు. ‘వెలమల్లారా ఖబర్దార్.. కుట్రలు చేసే వెలమల వీపులు విమానాలు మోగుతాయ’ంటూ అసభ్య పదజాలంతో దూషించారు. ఈ నేపథ్యంలో తాజా వివాదం మొదలైంది.